2732* వ రోజు....... .......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

                   2732 * (ఆదివారం) నాటి స్వచ్ఛంద శ్రమదాతల అనుభూతి !

          ఏప్రిల్ 9 వ వేకువ ఆ అనుభూతి 33+1 మందిది. (చివరి ఒక్క కార్యకర్త కన్నడ- దావణగెరే పట్టణస్తుడు - వేమూరి అర్జునుడు!) సదరు అనుభూతుల్ని పంచినది చిల్లల వాగు దగ్గరి శ్మశాన పరిసరాలే! సుమారు వారం రోజులుగా కార్యకర్తల శ్రమదాన తపస్సులు ఒక అరకిలో మీటరు పర్యంత విజయవాడ రహదారికే పరిమితమైపోయాయి! అలా ఎందుకందురా ?

          ఆ కాస్త దూరానికే రోజూ పాతిక ముప్పైమంది కష్టం అంకితమైపోవడానికి :

 

1) మూడు నాల్గు రోజులు కష్టించి తీర్చిదిద్దిన ప్రధాన రహదారి మీద, ప్రక్క అడ్డ రోడ్ల మీద ప్లాస్టిక్ సంచులో, సీసాలో, చెత్త బళ్ల వరిగడ్డి పరకలో పడితే - కార్యకర్తలకది నచ్చక 2 వ – 3 వ మారు కూడ ఏరి- ఊడ్చిరావడం;

2) అక్కడి డ్రైన్లు-ముఖ్యంగా పడమటి మురుగు కాల్వ, దానిలోని వ్యర్థాలూ, నాలుగైదడుగుల ఎత్తు పెరిగిన గడ్డి దుబ్బులూ సామాన్యమైనవా?

3) ఇక - సుందరీకరణం ముఠాది కొంచెం ‘ అతి’  అని కొందరనుకొన్నట్లే - పట్టిపట్టి ఇతరులు శుభ్రపరచిన చోట కూడ నచ్చక ఆ ముఠా అదనపు ‘బ్యూటిఫికేషన్’కు దిగుతుంది! వాళ్లకేమో ఎన్ని గంటలుపనిచేశామనీ, ఎన్నోమారు అందగిస్తున్నామనే ఆలోచన కాదు- ఇంకా ఇంకా పరిపూర్ణత (పర్ఫెక్షన్) మీదే దృష్టి !..

4) అసలు నేటి కాయ కష్టమంతా పడమటి మురుగుకాల్వలో మిగిలిన అడుగూ. బొడుగూ బారెడంత మురుగు గడ్డిని ఏరడమూ, దాన్ని ఎత్తి ట్రాక్టర్ లోకి బట్వాడా చేయడమూ

5) నేనైతే దగ్గరగా చూడలేదు గాని, కొందరు కార్యకర్తలు చెప్పిందేమంటే - పద్మావతి ఆస్పత్రిలోని ఒక నర్సమ్మ మురుగ్గుంట పని విన్యాసాలు తప్పక చూడదగినవి అని

6) తూర్పు ప్రక్క కాల్వ కూడ ఈ ఉదయానికల్లా మరింతగా శుభ్రపడిందంటే అందుకు అర డజను మంది వంచిన నడుములకీ- గంట పాటు దిక్కుమాలిన పిచ్చి కంపల మీద కత్తి విసురుతూ చేతులకీ పరీక్షపెట్టుకోవడమే కారణం!

"చదువుకొన్న-ఉన్నతోద్యోగిస్తున్న - వయస్సులు మళ్లని, మళ్లిన ఇందరు కార్యకర్తలకి ప్రతి వేకువా ఈ మురికి పనుల ఖర్మేంటి?" అని ఎవరైనా విస్తుపోయే వాళ్ళుంటే :

          6.15 దాక చెమటోడ్చి, తమ ఊరికోసం కష్టించి,  శుభ్రపడిన రహదారినో - మురుగు గుంటనో- పొందికైన చెట్లనో- పూల మొక్కల్నో చూసుకొని - కొందరి ముఖాల్లో కాస్త గుంభనగానూ, మరికొందర్లో బట్ట బయలుగానూ కనిపించే ఆత్మ సంతృప్తే సమాధానం !

నేటి 6.35 వేళ సమీక్షా సభలో:

- గోళ్ల వేంకట రత్నం ప్రకటిత గ్రామ స్వఛ్ఛ- సుందరోద్యమ నినాదాలూ,

- దాసరి రామకృష్ణ వైద్యుని స్వానుభవ పూర్వక "గూగుల్ పే " మోసాల హెచ్చరిక,

- ప్రాతూరి శాస్త్రుల వారి 5000/-విరాళమూ కాక

 రేపటి నుండి గస్తీ గది దగ్గర జరిగే మజ్జిగ ప్రదానమూ వంటి విశేషాలు!

బుధవారం వేకువ శ్రమదాన గమ్యం చిల్లలవాగు వంతెనే అని నిర్ణయం!

       సాహసమే మిన్న!

తెల్లదొరల అకృత్యాల తెరదించిన పోరుకన్న -

కరువు కాటకాల నడుమ బ్రతుకు బండి నడుపుకన్న -

పావు లక్షమంది బ్రతుకు ప్రగతి కొరకు వేకువనే

వీధి ఊడ్చి - మురుగు తోడు వీరుల సాహసమే మిన్న!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   09.04.2023.