2733* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

స్వచ్చ - సుందర ప్రయత్నంలో పనిదినాల సంఖ్య 2733*

ఊరి బాగు పట్ల నిబద్ధత గల 7+2 కార్యకర్తల సోమవారం (10.4.23) ఉదయపు శ్రమదాన ధారావాహికలో నేటి వివరాల్లోకి వెళితే:

- రెస్క్యూ ముఠా ఈ వేళ పూనుకొన్నది కూడ గంగులవారిపాలెం దారిలోని బండ్రేవుకోడు మురుగు కాల్వ దగ్గరే! ఆ బాటకు పొలం ప్రక్కగా ఉత్తరం గానే!

- అక్కడ దక్షిణం ప్రక్కలో వలె మహా వృక్షాలు లేవు గాని, కరెంటు తీగలున్నాయి. క్రిందేమో కార్యకర్తలు ఐదారేళ్ల క్రితం నాటి, పెంచిన గద్దగోరు, సువర్ణ గన్నేరు వంటి పూలమొక్కలు చిక్కగా పెరిగాయి.

- మూడు నాలుగు రంగుల పూల కొమ్మలు కొన్ని ఇప్పటికింకా విద్యుత్ తీగల్ని తాకలేదు గాని విద్యుదుద్యోగులకు పని కల్పించడమెందుకని - ముందుగానే స్వచ్చ కార్యకర్తలు జాగ్రత్త పడుతున్నారు!

- ఈ బాట ప్రయాణికుల్లో 2 వర్గాలు కనిపిస్తున్నాయి:

1) వేసవి ఎండల సమయంలో నీడనిస్తున్న పూల శోభను ప్రకటిస్తున్న ఈ పెద్ద చెట్లను - సుందరీకరణ పేరుతో తొలగించరాదనేది కొందరి,

2) ఆకులు, పూలు రాలి, పుప్పొడి పరచుకొని, కొన్నిటి ఘాటు వాసన (సంవత్సరంలో 10 రోజులే!) ఇబ్బంది అనీ మరికొందరు,

            రెండవ - మూడవ (విద్యుత్ శాఖ) సంగతుల్నే పరిగణించి, చెట్ల సుందరీకరణం జరుగుతున్నది! దక్షిణం ప్రక్క ఈ ఉదయం ఏ 30 మొక్కల కొమ్మలో పోయి, బాటైతే కాస్త విశాలంగా కనిపిస్తున్నది! నేటి నినాదాల ప్రకటనదారుడు కస్తూరి శ్రీనివాసుడు.

            తెగువ కార్యకర్తలది!

దేశానికి తిండి పెట్టు దీక్ష రైతు కూలీలది

స్వాతంత్య్రం కొరకు సాగు సమరమ్ములు అలనాటివి

గ్రామస్తుల సుఖ శాంతులు కోరి బ్రహ్మ ముహూర్తాన

దిన దినమూ పాటుబడే తెగువ కార్యకర్తలది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  10.04.2023.