2734* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

వీధి మెరుగుబాటు కోసం రెస్క్యూ టీం2734* వ నాటి ప్రయత్నం!

            11-4-23 (మంగళవారం) అట్టి ప్రయత్నం జరిగింది గంగులవారిపాలెం బాట బండ్రేవు కోడు కాల్వ దగ్గరైతే - అందులో నెగ్గింది ఆరేడెనిమిది మంది స్వచ్చ కార్యకర్తలు! 1 ¾ గంటల శరీర శ్రమ 30/40 గజాల బారునా!

            చెమటలు చిందించిన 6 గురి కృషిని - అటుగా ఉదయం పనుల మీద వచ్చే - పోయే 100 మంది చూసినా - కనీసం ఇద్దరు ఉదయ సమయ నడక వాళ్లం పరిశీలించాం! చల్లపల్లికే ప్రత్యేకమైన, ఈ రోజుల్లో అసాధారణమైన, స్వార్థం వాసనే లేని, వేలకొద్దీ రోజుల అవిచ్ఛిన్న పారిశుద్ధ్య పనులకు పరవశించాం! ఈ వేకువ ఆ కార్యకర్తల ఆదర్శ కృషికి బాహాటంగా కాకున్నా - మనసుల్లో అభినందించాం!

            ఊళ్లో సగానికి పైగా జనం ఇంకా నిద్రిస్తున్న బ్రహ్మ కాలాన మేల్కొన్న వాళ్ల సొంత పనుల హడావిడీ సమయాన - ఈ కొద్దిమంది కార్యకర్తల సామాజిక కర్తవ్య పరాయణతను గ్రామస్తులు ఎంత ఎక్కుమంది గుర్తిస్తే అంత మంచిది! అభినందించకుంటే ఉండిరి వక్ర దృష్టితో, స్వార్థ ప్రేరణతో తప్పులెన్నకుంటే అదే పది వేలు!

వీటన్నిటికీ అతీతులైన కార్యకర్తలు యధాప్రకారంగా ఈ గంటన్నర పైగా కృషితో

1) 20 - 25 మొక్కల సుందరీకరణమో - క్రమబద్ధీకరణమో చేసుకుపోయారు;

2) వాళ్లలో కొందరు మొక్కల మధ్య గడ్డి, పనికి రాని మొక్కలుంటే తొలగించారు;

3) రోడ్డునూ, దాని మార్జిన్లనూ ఊడ్చి, శుభ్రం చేశారు!

            ఉదయం 6 ½ సమయంలో తమ గ్రామ స్వచ్ఛ సౌందర్య సాధక నినాదాలు బృందావన కుమారు ననుసరించి పలికారు!

            తాతినేని వేంకటరమణ సమర్పిత కోడి గ్రుడ్ల, బూస్ట్ ల పంపకమూ జరిగిపోయింది!

            2735* వ వేకువ - బుధవారం మనం కలిసి శ్రమించే చోటు - బెజవాడ దారిలోని చిల్లల వాగు వంతెన ప్రాంతమే!

     అందుకె మాదరి జేరవు

జనం కొరకు పాటుబడిన చారిత్రక సంఘటనలు!

ప్రజల కొరకు - ప్రజల మధ్య పని చేసిన అనుభవాలు!

మా మనసులలోనున్నవి మహనీయుల ప్రవచనాలు!

అందుకె మాదరి జేరవు నిరాశా - నిస్పృహ ఛాయలు!

            ఇట్లు

- (చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలు)

  ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  11.04.2023.