2735* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

చల్లపల్లి వీధి సంస్కరణంలో అక్షరాలా 2735* వ ప్రయత్నం!

            బుధవారం - (12.4.23) నాటి సదరు ఉద్యోగులు (= ప్రయత్నకారులు) మొత్తం 23 మందీ, నిర్ణీత 4.30 కాలం దాకా ఆగక ముందే చిల్లలవాగు గట్టుకు చేరుకొన్న సగం మందీ! గంటా ఏభై నిముషాల శ్రమతో, ఊరుకు ఎవరేమి ఒరగబెట్టారో - శ్రీశ్రీ అన్నట్లు - ఏ వెలుగులకీ ప్రస్థానమో చర్చిద్దాం!

1) తొమ్మిదేళ్ల నుండీ జరిగే చర్విత చర్వణ ప్రక్రియే ననుకోండి - 10/11 మంది ఏ 4.15 కో ముందుగా నిర్ణయించుకొన్న బెజవాడ దారిలో మురుగుకాల్వ వంతెన దగ్గరకు చేరుకోవడమూ - చేతొడుగులు ధరించడమూ - వాడి తగ్గిన కత్తులు నూరుకోవడమూ వగైరాలు 3/4 నిముషాలు!

2) మిగిలిన కార్యకర్తలు మూడూళ్ల నుండి - మూణ్ణాలుగు కిలోమీటర్ల దూరం నుండి వచ్చి కలవడమూ, వంతెన దగ్గరి 3 చోట్ల కశ్మలాల మీద తెగబడడమూ!

3) ఏ కారణమో గాని ఈ వేకువ సుందరీకరణం ముఠా డుమ్మా కొట్టింది - అందులోని ఒకరిద్దరూ వేరే పనుల్లోకి దిగారు.

4) ఈ వేకువ పనుల్లో కెల్లా కష్టసాధ్యమైనదీ, దిగి చేస్తుంటేనే చూపరుల కాశ్చర్యం కల్గించేది ఏమంటే ఇద్దరు ముగ్గురు రైతులు 10 - 12 అడుగుల లోతైన చిల్లలవాగు ఏటవాలు గట్టును శుభ్రపరచడమే! కాళ్లు జారుతున్న చోట - వాళ్ల పని మెలకువ, శ్రమ ఏపాటివో గాని, తెల్లారాక వంతెన మీదుగా వెళ్లే ఎవరికైనా ఆ పరిశుభ్రత కంటబడక తప్పదు!

5) వంతెనకు దక్షిణ - పశ్చిమోన్ముఖంగా బాటను ఆరేడుగురు కార్యకర్తలెంత శ్రమిస్తే 6.00 తరువాత ఆ మాత్రం  స్వచ్ఛ సుందరంగా రూపొందిందో ఊహించుకోండి!

6) వంతెన మీది చెత్తను, దుమ్మును ఒకటికి రెండు మార్లు ఊడ్చి, మట్టి పెచ్చుల్ని గోకి, గడ్డి మొక్కల్నీ, ప్లాస్టిక్ తుక్కుల్నీ రాచి రంపాన పెట్టి, అరగంటలో దాన్ని కనువిందుగా మార్చిన నలుగురి పట్టుదలా! (వాహన వేగాలు ఎప్పుడు ప్రామాదికమౌతాయో అని మాలో ఒకరిద్దరి బెంగ!)

7) ఈ రోజు ట్రక్కు పైకెక్కి తుక్కుల్ని అదిమి త్రొక్కే పని పడలేదు.

8) నా బోటి ఒకళ్లిద్దరం ప్లాస్టిక్, గాజు సీసాల - గ్లాసుల - కప్పుల పని చూసుకొన్నాం!

9) ఈ రోజు మాత్రం పని విరమణ సూచక ఈల తొలిసారి మ్రోగినపుడు కార్యకర్తలు సగం మందైనా విరమించారు!

10) కనీసం ముగ్గురి దగ్గర ఎక్కువ చెమట కంపును గుర్తించాను! (ఐతే ఈ కంపే మన ఊరి వీధుల సొంపు అనీ, మా కార్యకర్తలందరికీ ఇంపు అనీ ఋజువౌతున్నది!)

నేటి 6.30 సమయపు సమీక్షా సమావేశ వివరాలేమనగా:

- ప్రక్కనున్న కర్మల భవనం ప్రతిధ్వనించేలాగ - అడపా గురువు స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలూ, మంచి సూక్తులూ, ఇంకా ఒకరిద్దరు విశ్రాంత వృద్ధులకిచ్చిన మర్యాదా - మన్ననలూ;

- ఒకానొక సినిమా పాటననుకరించిన స్వచ్ఛ కార్యకర్తల శ్రమ సందేశ గీతాన్ని నందేటి శ్రీనివాసగాయకు డాలపించడమూ;

- రేపటి మన వేకువ శ్రమ ప్రదేశం చిల్లలవాగు వంతెన ఉత్తరంగా - వక్కలగడ్డ దిశగా అనే నిర్ణయమూ......

ఈ వేకువ సమయం సంగతులు కాక

            గత 3 రోజుల నుండీ స్వచ్చ కార్యకర్తల సహకారంతో, కొందరు దాతల, SRYSP పూర్వ విద్యార్ధుల వితరణతో గంగులవారిపాలెం వీధి మొదట కమ్మని మజ్జిగ పంపకం జరుగుతున్నది.    

            ఈ ఉద్యమ మాగ నంది!

శారీరక శ్రమ, మేధోశ్రమ చాలినంతగా ఉన్నది

జనం పట్ల - ఊరి పట్ల తరగని ప్రేమొకటున్నది

అన్ని హంగు - లన్ని వనరు లన్నవకాశాలున్నవి

ఎన్ని దశాబ్దాలైనా ఈ ఉద్యమ మాగ నంది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  12.04.2023.