2736* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

విజయవాడ మార్గంలోనే విజయవంతమైన మరొక శ్రమదానం - @2736*

            శ్రమదానం గురువారం (13-4-23) నాటిది, అవలీలగా 40 - 50 గజాల దాక వీధి కశ్మలాల మీద గెలుపొందినవారు 27+2 మంది! అందులో వ్యావసాయక - ఔద్యోగిక - విశ్రాంత - గృహస్థాదిగా నానాజాతి సమితి! ఎవరే మురికి - బురద మొండి పనులకు దిగినా - అందరూ న్యాయబద్ధమైన, ఆదర్శమైన, ఆవశ్యకమైన సామాజిక కర్మిష్టులే మరి!

            ఒక్కమారు తీరుబడిగా 9 ఏళ్ల స్వచ్చ - సుందరోద్యమాన్ని నెమరేసుకొంటే - ఎన్ని జ్ఞాపకాలు; సుసాధ్యాలుగా మారిన ఎన్ని అసాధ్యాలు; వాటి కోసం ఎన్నెన్ని సాహసాలు; కోటాను కోటీశ్వరులు కాని - కేవలం సాదాసీదా కార్యకర్తల త్యాగాలు!

            ఇంతకన్నా ఒళ్లు గగుర్పొడిచే సేవా సంఘటనలు దేశ చరిత్రలో జరగలేదని చెప్పలేం! కాని ఈ కాని కాలంలో, ఇంత సుదీర్ఘంగా, సాముహికంగా, సగర్వమైన ఉదాహరణ ప్రాయంగా, ఆటుపోటు లెదుర్కొని సార్ధకంగా ఉద్యమిస్తున్న చోటు మన సమకాలంలో మరొకటి ఉన్నదా?

            ఈ కార్యకర్తలు ఎవరెక్కడ పుట్టి పెరిగి - చల్లపల్లిలో స్థిరపడ్డారో గాని, తమ నివాస గ్రామ క్షేమం దృష్ట్యా తమ పరిధిలో వాళ్లు చేయని దున్నదా? వేకువ 2 - 3 గంటల శ్రమదానం సరే - వారిలో అత్యధికులు మిగతా వేళల్లోనూ ఈ ఊరికింకా - ఇంకా ఏం చేయగలమని ఆలోచిస్తున్నారా లేదా?    

            శ్రమదాన మొకటేనా? వాళ్లు చేస్తున్న ఆర్ధిక - మేధో పరిశ్రమల సంగతేమిటి? తొలి నాళ్లలో సరే - మలి నాళ్లలో సైతం వాళ్ల కృషికి స్తన శల్యపరీక్షలెన్ని? ఒక తాజా ఉదాహరణ - గత నాలుగైదు రోజులు బెజవాడ రహదారి పారిశుద్ధ్యం తరువాత ఈ వేకువ ఊక లారీ కిలోమీటర్ల కొద్దీ బాట నిండా పొట్టు వెదజల్లితే - కిమ్మనకుండా మళ్లీ దాన్ని ఊడ్చారు గదా!

            ఎన్ని మురుగు కాల్వలు, పబ్లిక్ స్థలాలు, ఆలయాలు, విద్యాలయాలు, శ్మశానాలు ఈ కార్యకర్తల శ్రమతో - చెమటలతో పునః పునః పవిత్రీకరణ పొందాయో గదా!

            నమ్మశక్యం గాని ఈ సేవా దృశ్యాలన్నీ మనకోసం మనంట్రస్టు బాధ్యుడూ, శ్రమదాన తొలి ప్రారంభకుడూ దాసరి రామకృష్ణ వైద్యుడెన్నెన్ని మార్లు ఆశ్చర్యానంద చకితుడయ్యాడో గదా!

నేటి పాతిక మందికి పైగా శ్రమజీవుల పాద స్పర్శతో పులకిత ప్రాంతాలు  -

1) చిల్లల వాగు వంతెన,

2) కమతావాని గూడెం (వక్కలగడ్డ) రోడ్డు దాక పడమటి డ్రైను,

3) తూర్పు మురుగుకాల్వలో అంచూ.......

            మీరు గమనించదగినవి 6.00 తరువాత వంతెన నుండి ప్రక్క పంచాయతీ వైపుగా మళ్లీ మళ్లీ చూడాలనిపించే బెజవాడ రోడ్డూ, పడిపోతే పునః ప్రతిష్టించిన కొన్ని మైలు రాళ్ళూ, పచ్చదనంతో ఆకట్టుకొంటున్న తరిగోపుల ప్రాంగణ పరిసరాలూ.... ఇంకా ఈ ఉదయం 1 కిలోమీటరు దాక విన్పించిన కోడూరి వేంకటేశ్వరుని స్వచ్ఛ - సుందర గ్రామ నినాదాలూ......

            రేపటి ఉదయం దాసరి స్వర్ణలత గారి స్మృతికంకితంగా మన శ్రమదానం బైపాస్ వీధిలోని కమ్యూనిస్టు బజారు దగ్గరే!

            ఆరాటం ఎవ్వరిది?

స్వచ్చ - సుందరోద్యమమును సాకుచున్నదెవ్వరు?

గ్రామ హరిత సౌభాగ్యపు కర్తలెవరు - కర్మలెవరు

ఊరి స్వర్ణ భవిత గూర్చి ఆరాటం ఎవ్వరిది? -

అన్ని ప్రశ్నలకు బదులొక స్వఛ్ఛ - మాన్య సైన్యమే.

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  13.04.2023.