2737* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

గ్రామ స్వఛ్ఛ - సుందరీకరణంలో మరొక ఘట్టం - @2737*

            శుక్రవారం నాటి ఆ ఘట్టానికి 11 మందితో - బైపాస్ వీధిలోని కమ్యూనిస్టు బజారు దగ్గరే తెరలేచింది; వాహనాలకు ఆతిథ్యమిచ్చిందీ, 10 మంది కార్యకర్తల సేవల్ని చూరగొన్నదీ మా ఖాళీ స్థలమే! ఎక్కడెక్కడి శ్రమదాన పక్షులో అక్కడికి చేరి చివరికి సజాతీయ పక్షుల సంఖ్య 40 దాక పెరిగి, అటు బైపాస్ దారిలోనూ, ఇటు సామ్యవాద వీధిలోనూ సందడే సందడి!

            సహనానికీ, సౌమ్యతకూ అగ్రతాంబూలమిచ్చే సొంత మేలుకు కాక ఊరంతటి స్వస్తత ధ్యేయంగా సుదీర్ఘ కాలంగా ఏ మాత్రం ఆలోచించగలిగే వాళ్ల మన్ననలైనా పొందగలిగే ఒక సాత్త్విక సందడి! వేల దినాలుగా ఊరి హరిత సౌందర్యాల కోసం రెక్కలు ముక్కలు చేసుకొంటున్న స్వచ్యోద్యమ పక్షుల కిలకిలారావాల ఈ సందడే ఇక ముందు ప్రతి గ్రామంలోనూ జరగవలసింది!

            నేటి స్వచ్ఛ కార్యకర్తల శ్రమదానం చిరస్మరణీయ దాసరి స్వర్ణలత గారి కంకితంగాఅని నిన్న నేను వ్రాసింది ఏదో యదాలాపంగా కాదు స్వచ్చోద్యమ చల్లపల్లినీ, కార్యకర్తల కుటుంబాన్నీ ఆమె అభిమానించి, పొదువుకొని, ఆశీర్వదించి, ఎన్నెన్నో ఆర్థిక దానాలు చేసిన (చివరి కామె పార్థివ దేహాన్ని కూడ సంప్రదాయ విరుద్ధంగా వైద్య పరిశోధనలకే అప్పగించిన) స్మృతి కోసం నేటి స్వచ్ఛోద్యమకారుల శ్రమదానమన్న మాట!

ఇవాళ్టి వేకువ శుభ్ర - సుందరీకృత గ్రామ భాగాలు మూడు :

1) సామ్యవాద వీధిలోని అస్మదీయ నివేశన స్థలంలో 10 - 12 మంది కత్తుల, దంతెల వారు ఆ 10 - 12 సెంట్ల జాగాలోని గడ్డీ, మొక్కలూ తొలగించేశారు (వారికి అనుమతులతో పనేముంది)

2) సాగర్ టాకీస్ వీధిలోని 70 - 80 గజాల బారునా అప్పటికే ఉన్న స్వచ్ఛ - శుభ్రతల్ని మెరుగులు దిద్దుతూ మరింత దర్శనీయంగా చేయడం రెండవది!

3) వీధి ఉత్తర దిక్కున - ఫెన్సింగ్ లోపలి పూల మొక్కల్నీ, నడుమ గల తుక్కుల్నీ బాగు చేసిన 10 మందిదీ దొడ్డ ప్రయత్నమే!

            అసలు చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమమంటే గమ్యం లేని ప్రయాణమనో, చుక్కాని లేని పడవ నడకనో భావించవద్దు. ఎంతో ప్రణాళికతో - సమయ స్పృహతో ఈ అతి పెద్ద పంచాయితీని ఈ మాత్రం మారుస్తున్న ఒక నిబద్ధత! ఒక 100 మంది కార్యకర్తలకు చెందిన గ్రామ సామాజిక సామూహిక బాధ్యత!

1 గంటా ఏభై నిముషాల శ్రమ వేడుక ముగిసి, 6:15 కు జరిగిన సంకల్ప సమీక్షా సభలో:

86 ఏళ్ల శివప్రసాదు డాక్టరు ప్రవేశమూ, 91 ఏళ్ల స్వచ్ఛ కురువృద్ధుడు దాసరి రామమోహనరావు గారి లక్ష రూపాయల విరాళమూ, ఆ కుటుంబ బాధ్యురాలు తరిగోపుల పద్మావతి గారి ఉద్యమ నినాదాలూ, చివరగా దాసరి కుటుంబీకులు కార్యకర్తల కందించిన విందూ...

            (అదుగో మళ్ళీ 9 ½ - 1 ½ నడుమ స్వర్ణలత గారి గౌరవ స్మరణగా ఆమె కుటుంబ వారసుల మజ్జిగ పంపిణీ కూడా)

            రేపటి వేకువ మన శ్రమదాన రంగస్థలం చిల్లలవాగు దాటి - వక్కలగడ్డకు చెందిన బెజవాడ రోడ్డు మీద!

            సంక్షుభిత ప్రపంచాన....

సంక్షుభిత ప్రపంచాన సమ్మోహిత ఉద్యమమిది

అయోమయ ప్రదేశాన అత్యవసర ప్రయత్నమిదే

నిర్వీర్య వ్యవస్థలోని నిస్తేజ గ్రామాలకు

చుక్కానిగా పనికి వచ్చు స్వచ్చోద్యమ మిదే ఇదే!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  14.04.2023.