2738* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

2738* (శనివారం) నాటి శ్రమ సౌందర్యం!

            15.4.23 వ వేకువ 4.20 & 6.10 నడుమనే ఆ సౌందర్య సాక్షాత్కారం! ఆ దృశ్యం కనపడినది చల్లపల్లి - వక్కలగడ్డ గ్రామాల సరిహద్దైన చిల్లలవాగు ఉత్తరపు గట్టు, కమతావాని గూడెం రోడ్ల వద్ద! 25+2 మంది కార్యకర్తలు శ్రమించిన, స్వేదం చిందించిన ఫలితమది!

అన్ని సంఘటనల్ని కాదు గాని, కొన్ని ముఖ్య సన్నివేశాల్ని తెలుసుకొందాం :  

- నేటి వేకువ శ్రమదాన రంగస్థలం మీద మొదట చెప్పుకోదగిన దృశ్యం - నాలుగైదు నాళ్ల పోరాట ఫలితంగా బాగా మెరుగుపడిన పడమటి డ్రైను, దాని గట్టు. ఈ ఉదయం ఏడెనిమిది మంది ఎన్ని ప్లాస్టిక్ తుక్కులేరి, ట్రాక్టర్లో నింపారో వీడియో సాక్ష్యంగా చూడవచ్చు! ఇంకొక ఫోటోలో “చల్లపల్లి డ్రైనంటే ఇలా శుభ్రంగా - గట్టున పచ్చదనం ఉట్టిపడేలా ఉంటుందనీ - అందుకు మూలకారకులు ఎంత సంతృప్తిగా ఉన్నారనీ” తెలిపే ఋజువు!

- మగ కార్యకర్తలుండగా, ఒక యువ నర్సు చిట్టూరి లక్ష్మీ ఎత్తైన చెత్త బండెక్కి, క్రమపద్ధతిలో రకరకాల తుక్కుల్ని సర్దుతున్న దృశ్యం! పని ముగించి, ఆమె ట్రక్కు నుండి లాఘవంగా క్రిందికి దూకిన విషయం!

- ఇక ఎప్పట్లాగే – తమ ముంగిట ఇందరు కార్యకర్తలు శ్రమిస్తున్నా – పట్టించుకోక – పాల్గొనక - చోద్యం చూసిన సమీప గృహస్థులూ, ప్రయాణికులూ!  

- బెజవాడ దారికి తూర్పుగా మాత్రం ఎంతగా గణనీయ శ్రమదానం జరిగింది! 16 - 17 మంది గంటన్నరకు పైబడిన కృషికి ప్రత్యక్ష సాక్షిని నేనే! ముళ్ల - దురద మొక్కలడు నడుమ, ఎగుడు దిగుడు అసమస్థలాన, మురుగు కాల్వ బురద అంచున – ఆ వేకువ సమయపు శ్రమ త్యాగమేమిటో - వంచిన కొన్ని నడుములు అంత సేపెలా కత్తి పనులు చేస్తాయో చూద్దామని నేను సైతం 20 నిముషాలు వంగి స్వయం పరీక్ష పెట్టుకొన్నాను! మర్యాదగా విరమించి - ఒడ్డుకొచ్చాను!

- సుందరీకరణం వారివీ నాజూకు పనులేమీ కావే! అడ్డదిడ్డంగా బాట ప్రక్కన పడి ఉన్న ఎండు చెట్లను వాళ్లు కదిపి, అందంగా సర్దిన బరువు పనులూ చూడదగినవే!

            ఈ పాతిక ముప్పై మంది సామాజిక బాధ్యుల రోజువారీ పనుల్ని నేనేదో పని గట్టుకొని - గోరంతలు కొండంతలు చేసి - ఆకర్షణీయ పదాల్తో వర్ణిస్తున్నానని అనుకొంటే తప్పు లేదు గాని, దేశంలో ఎక్కడా జరుగని - 2738 రోజుల అరుదైన శ్రమైక  నిస్వార్థ జీవన దృశ్యాలను చూస్తూ – ఈ మాత్రం కూడ వివరించకపోతే ఎలా? (నాకు మాత్రం చక్కగా నిద్రపట్టొద్దా?)

            కావాలంటే గ్రామస్తులే రోజైనా వచ్చి - వీళ్ల గ్రామ బాధ్యతా నిర్వహణనీ, ఏరోజుకారోజు శ్రమించి – శుభ్రపరచిన చోటుల్ని చూసుకొని వాళ్లెంత సంతృప్తి పొందుతున్నదీ ప్రత్యక్షంగా చూడవచ్చు! ఇన్ని వేల వేకువల - తొమ్మిదేళ్ల తరువాత ఎలాగూ ఈ వింత ఆగేదేమీ కాదులే!

            ఏమైతేనేం – నెల రోజుల ప్రయత్నం తరువాత ఏ 15 - 16 వందల గంటల కష్టం తర్వాత ఈ 2 కిలోమీటర్ల బెజవాడ రోడ్డు - మురుగు కాల్వలూ, మార్జిన్లతో సహా బాగుపడినవి! (తిరిగి ఇంటికి వస్తూ మాత్రం - 7.00 వేళ ఉభయ అపార్ట్మెంట్లు దాటాక – రోడ్డు మీద మళ్లీ పడిన వ్యర్ధాల – గోనె సంచుల కట్టల సంగతో?)

            6.30 దాటిన నేటి శ్రమ సమీక్షా సభలో ముందుగా సొంతూరు స్వచ్చ – సుందర వైభవ నినాదాలు దంచి కొట్టిన వంతు గంధం బృందావనుడిది! “ఈ గ్రామమూ, వీధులూ, బైట రహదారులూ ఇంత ప్రత్యేకంగా ఉన్న కారణం కేవలం కార్యకర్తల నిస్వార్ధ శ్రమే” అని ప్రశంసించినది డాక్టర్ దాసరి రామకృష్ణుల వారు! కార్యకర్తలకు షిరిడీ ప్రసాదము BSNL వాని ద్వారా పంచినది BDR ప్రసాద్.

            రేపటి శుభోదయ శ్రమదాన వేదిక శ్మశానపుటుత్తరాన చిల్లలవాగు గట్టే!

            ఇదేం ఖర్మ మన ఊరికి?

తొమ్మిదేళ్ల స్వచ్ఛోద్యమ ప్రస్థానం పిదప గూడ –

వీధుల్లో చెత్త బండి ప్రతి రోజూ తిరుగు చుండ –

కొన్ని కొన్ని దుకాణాల ముందింకా చెత్తుంటే –

ఎన్నాళ్ళీ దుస్థితి? ఇదేం ఖర్మ మన ఊరికి?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   15.04.2023.