2739* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

2739* వ (ఆదివారం) నాటిది ఈ శ్మశాన- డంపింగ్ కేంద్రాల సంస్కరణ!

            16.4.23 నాటి ఆ సంస్కర్తలెవరు - ఎందరు –  సంస్కరణ విధం బెట్టిది?... అని ఆరా తీస్తే :

            5.10 కి అర్ధాంతరంగా నిష్క్రమించిన ఇద్దరు వైద్య ప్రముఖులూ, విశ్రాంత వయోధిక ఉద్యోగులూ, రైతులూ, గృహిణులూ, తదితర వృత్తికారులూ - మొత్తం 28 మంది.

            మరి వేకువ 4.20 కే శ్మశాన, దహన వాటికల ప్రక్కన వాళ్లకేం పని బడిందయ్యా అంటే శుభ్ర పరచడానికి ఊరి వీధులూ, మురుగు కాల్వలూ దొరకలేదా అనుకొంటే- సెంటిమెంటల్ గా - ఈ రుద్రభూమి ప్రమధగణాల సరసనే చీకట్లో ఎందుకు పనిచేస్తున్నారని ప్రశ్నించుకొంటే-

            ఈ చిల్లలవాగు గట్టు మీది కైలాస క్షేత్రానికొక బ్రహ్మాండమైన శ్రమదాన గతం ఉన్నది! రాష్ట్రంలోని వేలాది శ్మశానాల కన్న దీని కొక ప్రసిద్ధి ఉన్నది!

            - ఏడేళ్ళ క్రితం గణనీయ సంఖ్యలో స్త్రీ పురుష కార్యకర్తలు ఉదయ - సాయంత్రాల్లో జట్టు జట్లుగా శ్రమించి నెలల తరబడీ తీర్చిదిద్దిన శ్రమైక జీవన చరిత్ర ఉన్నది!

            అందుకే నేటి శుభ్ర - సుందరీకరణ ప్రయత్నంలో అడుగడుగునా స్వచ్ఛ కార్యకర్తల అనుభూతులు!

            10 మంది చెత్త సంపద కేంద్ర - దహన వాటికల ప్రాంతాన చెట్లు, పూల మొక్కల నడుమ కలుపుతీస్తుంటే -

            ఏడెనిమిది మంది కత్తులు, దంతెలు ప్రయోగించి, పాతిక సెంట్ల ఖాళీ జాగాలోని గడ్డినీ పిచ్చి కంపనీ - తీగల్ని తొలగిస్తుంటే..

            గ్రామ సర్పంచమ్మతో సహా ముగ్గురు మహిళలు చీపుళ్లతో సిమెంటు బాటల్ని ఊడుస్తుంటే -

            చిల్లలవాగు ఉత్తరపు గట్టును నలుగురు బాగు చేస్తుంటే -

            ఇద్దరు మాత్రం సిమెంటు బాట మార్జిన్ను అద్దంలా మెరిపిస్తుంటే -

            ఈ గంటన్నర కాలపు సార్వకాలిక ఆదర్శ శ్రమదాన వేడుకను చూస్తూ నాబోటి వాళ్లకు మనసు జలదరిస్తుంటే -

            మరొక వృద్ధ భావుకుడు ఈ దృశ్యాలను ఫోను కెమేరా కంట్లో బంధిస్తుండగానే తూర్పున సూరీడు మేల్కొన్నాడు!

            చెత్త సంపద కేంద్రం తూర్పును ఐదారేళ్ల క్రిందట ఒంగోలు వైద్య కురు వృద్ధుడు నల్లూరి రంగారావు, GBR ఫౌండేషన్ వ్యవస్థాపక వైద్యుడు గోపాళం శివన్నారాయణుడు నాటిన ఫల ప్రదములైన ఆమ్ర వృక్షాలు,           

            అప్పుడిక రెండు చిన్న ముఠాలు తాము కష్టపడి శుభ్రపరచిన చోటుల్ని ఏదెలా ఉందోనని పోల్చి చూసుకొని - మిగిలిన వారికి చూపించుకొని, మురిసిపోతున్నారు! (పాపం - అత్యల్ప సంతోషులు!)

            ఉదయం 6.10 దాక సాగిన శ్రమదానంతో భళ్లున తెల్లారాక దృశ్యాలేమంటే:

            - మెరుగులు దిద్దుకొన్న 3 సిమెంటు రోడ్లు,

            - పచ్చని చెట్లు, పూల మొక్కల నడుమ ఆహ్లాదకరంగా 2 ఖాళీ స్థలాలూ,

            - ఇంకో వైపున డంపింగ్ కేంద్రపు పొగలూ,

            -  వాటి నడుమ తమ నేటి కాయకష్టఫలితంగా శుభ్ర- సుందరీకృత ప్రదేశాల్ని సంతృప్తిగా చూసుకొంటున్న పాతిక మంది పైగా స్వఛ్ఛ - సుందరోద్యమ కారులు!

6.40 దాక జరిగిన సమీక్షా కాలపు విశేషాలు:

1)  రావెళ్ల, గుత్తికొండ ఉపాధ్యాయ దంపతుల పప్పుండల - నువ్వుండల పంపకమూ,

2) లంకే సుభాషిణీ ప్రాయోజిత ములగకాయల వితరణమూ,

3) అస్మదీయ నాణ్యమైన - లేలేత కరివేపాకు ప్రదానమూ,

4) ధ్యానమండలి ప్రతినిధి నాయుడు మోహనుడి చెవికింపైన స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలూ,

            చల్లపల్లి స్వచ్ఛోద్యమం తరపున ధ్యాన మండలివారు 10 వ తరగతి ముగించిన విద్యార్థుల కోసం మంద గమన ద్విచక్ర (స్లో సైకిలింగ్) పోటీల (ఈ సాయంత్రం 4.00/5.00 నడుమ -  స్వచ్ఛ కార్యకర్తలందరూ ఆహ్వానితులే!) ప్రకటనమూ...

            ‘బుధవారం వేకువ కూడ కార్యకర్తల కృషి శ్మశాన చెత్త సంపద కేంద్రాల దగ్గరఅనే సమాచారమూ...

            ఎన్నాళ్ళీ అమాయకం?

బ్రహ్మకాల శ్రమదానం ఫలిత మిచ్చునని తెలిసి

ఆ ఫలితా లారోగ్యం ఆనందం అని గ్రహించి

వందలాది క్రొత్తవాళ్లు వచ్చి సహకరించరేమి?

ఎన్నాళ్ళీ అమాయకం? ఇదేం ఖర్మ మన ఊరికి?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  16.04.2023.