2740* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

2740* వ నాటి ఆరేడుగురి శ్రమదానం!

        చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమంలో సోమ - మంగళవారాలంటే రెస్క్యూ దళం వంతు! కనుక వారు తాము బాగు చేయాలనుకొన్న గంగులవారిపాలెం బాటలోని ఆస్పత్రి ఎదుటి ఖాళీ స్థలం దగ్గర సకాలంలో ప్రత్యక్షమయ్యారు!

        అది 17 - 18 సెంట్ల జాగా - అందులో తాతినేని వేంకటరమణుడు మొక్కల పెంపక - విక్రయ కేంద్రాన్ని నెలకొల్పుతున్నాడట! సదరు నివేశన స్థల యజమాని, దాని చుట్టూ ప్రహరీ నిర్మించదలచి - అందు కడ్డుపడిన పెను వేప చెట్టును కొట్టించాలనుకొన్నప్పుడు - వీధి సుందరీకరణలో భాగంగా రెస్క్యూటీం వారందుకు పూనుకొన్నారు.

        ‘మనకోసం మనం ట్రస్టుకారణంగా - అసలే ఈ వీధి వేల కొద్దీ పూలమొక్కలతో - పచ్చదనం పరవళ్లతో - ఇతర హంగుల్తో ఇప్పటికే సగం జిల్లాలో మారుమ్రోగిపోతున్నది. చల్లపల్లి సందర్శకుల్లో వీలైన ప్రతి వాళ్లూ పని గట్టుకొని వీధి సౌందర్య వీక్షకులు గానో పాదచారులు గానో దాని కభిమానులైపోతుండగా..

        క్రమంగా ట్రాఫిక్ కూడ పెరుగుతుండగా...

        ఇప్పుడీ బజారుకు నర్సరీ హంగులు కూడ తోడన్నమాట!

        గంటన్నరకు పైగా ఈ వీధి భద్రతా కార్యకర్తలు మరరంపంతో కోశారో గొడ్డలే వాడారో - కత్తులకే పని చెప్పారో... గాని - వాళ్ల చొక్కాలు మాత్రం ఘర్మజలంతో తడిసి పోయాయి! చెట్టు నేల కూలింది; ఇంకా కొన్ని కొమ్మల పని మిగిల్నట్లుంది! బహుశా అది రేపు పూర్తి కావచ్చు!

        కార్యకర్తల ఈ వేకువ శ్రమ సంగతిని డబ్బుల్తో కొలవరాదు గాని, ఆ పనే చేయాల్సి వస్తే ఖర్చు నాలుగంకెల్లోనే ఉండవచ్చు!

        కనుక - ఇందుమూలముగా యావన్మంది వార్డు జనులకున్నూ, గ్రామ ప్రజలకున్నా మా అభ్యర్థనేమంటే

        “ఏదీ తనంత తానై నీదరికి రాదు - శోధించి సాధించాలీ....” (శ్రీ శ్రీ)

        ‘మనకోసం మనమేమన ఊరి మెరుగుదల కోసం శ్రమించాలి!

        ఈ నాటి గ్రామ స్వచ్ఛ - సుందరీకరణ నినాదాల వంతు (BSNL) గౌరుశెట్టి నరసింహ నామధేయుడిది!

        రోజొక్కటి వస్తుందని

నా ఊరని నా వీధని, నేను - నా దేశం అని,

హక్కులతో బాటు గ్రామ బాధ్యతలూ ఉన్నాయని

స్వచ్చ కార్యకర్తలతో సహకరించి చూద్దామని

ప్రతి పౌరుడు గుర్తించే రోజొక్కటి వస్తుందని...

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  17.04.2023.