2741* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమంలో 2741* వ దినచర్య!

       ఇది మంగళవార(18-4-23) మైనందున రెస్క్యూ టీమ్అనబడే స్వచ్ఛ కార్యకర్తల రోజు. అందువల్ల సదరు భద్రతా దళానికి చెందిన 6 గురు అసలు వాళ్లూ, నలుగురు కొసరు వాళ్లమూ 4.30 - 6.30 నడుమ ఇటు బందరు - అటు అవనిగడ్డా రహదార్లలో చేసిన కృషి!

       ఈ వేకువ సమయపు శ్రమదానం ప్రధానంగా స్వచ్ఛ - సుందర పబ్లిక్ టాయిలెట్లన బడే విస్తృత ప్రజా ప్రయోక మరుగుదొడ్ల సంగతి గ్రా - గ్రామేతరులకు తెలియజెప్పే నామఫలకాల ఏర్పాట్లే!

       అంటే - అక్కడి కదేదో చిన్న పనైనట్లూ - ఇంత మంది రెండేసి గంటలు చేయవలసిందా నీ భావించకండి! (అసలీ కార్యకర్తలే అంచనా కట్టారట - ఆఁ! ఇదొక పనా, అరగంటలో ముగియదా - అని!) ట్రాక్టర్ మీదకెక్కి, చిన్న కార్ల స్టాండు దగ్గర - ఇటు సంత వీధికీ - అటు 3 రోడ్ల సెంటరుకూ కనపడేట్లు - ఎత్తుగా, దృఢంగా కట్టిన సంగతి స్వయంగా చూస్తే గాని తెలియదు - అందులో సాధక బాధకాలేమిటో!

       అవనిగడ్డ రోడ్డు - నూనె మిల్లు ఎదుటి టాయిలెట్ల ప్రచారక నామ ఫలకమూ అంతే! స్వచ్ఛ కార్యకర్తలు ½ గంట శ్రమిస్తుంటే- అక్కడి ఆటో చోదక మిత్రులూ - ఇతరులూ అదేదో తమ పని కానే కాదన్నట్లు కంటి చూపులు ప్రసరించారే తప్ప - కల్పించుకోలేదు!

       పని మీద సెంటరు కొచ్చే గ్రామస్తుల, పొరుగూళ్ల జనుల - ముఖ్యంగా మహిళల ఇబ్బందుల పరిష్కారంగా లక్షల డబ్బు ఖర్చుతో కనీసం 3 చోట్ల ఇంత అందమైన మరుగుదొడ్లు స్వచ్ఛ కార్యకర్తలు నిర్మించనేల? కొందరు మహనీయులు నకారాత్మక కోణంతో ఏవేవో విమర్శలు చేయనేల?

       6 .40 కి మళ్లీ ఈ దళం గస్తీ గది వద్దకు చేరి, సహ కార్యకర్తలకు గ్రుడ్లు, పాలు పంచిన తాతినేని (మొక్కల) రమణుడే నినదించిన స్వచ్ఛ - సుందరీకరణ ప్రతిజ్ఞలు వల్లించి, 7.00 కు ఇళ్లకు చేరిరి!

       మళ్లీ 9.30 కు ఈ స్వచ్చ కార్యకర్తలే గంగులవారిపాలెం వీధి మొదట 9 వ నాటి మజ్జిగ పంపిణీ పనికి హాజరౌతున్నారు!

       బుధవారం నాటి స్వచ్చ - సుందర ప్రక్రియ కోసం మనం డంపింగ్ కేంద్రం దగ్గర కలుద్దాం!

       తరలింపుడు ఇకనైనా!

ఆర్టీసీ ప్రాంగణమా! అద్భుత శ్మశానమా!

రహదారి వనమ్ములార! రమ్య శుభ్ర వీధులార!

ప్రతిదీ శ్రమ ఫలితమనుచు ప్రకటింపుడు- చల్లపల్లి

ప్రజలను శ్రమదానానికి తరలింపుడు ఇకనైనా!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  18.04.2023.