2742* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

చెత్త కేంద్రక సుందరీకరణ ప్రయత్నం - @2742*

            బుధవారం(19.4.23) వేకువ 4.21 కే 10 మందితో అది మొదలై - 5AM కు ముందు 21 గానూ, 6.00 కు ముందు 28 గానూ బలం పుంజుకొన్నది. ఆ బలగంలో నలుగురు చెప్పుకోదగ్గంత వృద్ధులూ, నలుగురు మహిళలూ, ముగుర్నలుగురు ట్రస్టు కార్మికులూ, మిగిలిన వారిలో రైతు - వ్యాపార - ఉద్యోగ వర్గాల వారూ! ఉదయం పూట బడుల మూలంగా ఉపాధ్యాయ సోదరులంతగా కనిపించలేదు!

            నేటి కార్యకర్తల చెమట బొట్లకు నోచుకొన్న చోటు - చెత్త సంపద కట్టడానికి తూర్పు గానూ చెత్త కేంద్రానికి చేరువ గానూ, దక్షిణ దిశలోని దహన వాటి కల దగ్గరగానూ!

            మొదటి కార్యక్షేత్రంలో కత్తుల, దంతెల సందడులూ - రెండవ చోట కంచె వెదుళ్ల సంస్కరణమూ, మూడవ స్థానంలో డజను మందిది ఖాళీస్థలం బారునా చెత్త ఏరుడూ, పిచ్చి మొక్కల నరుకుడూ, దక్షిణపు కంచె దగ్గరి గడ్డీ - పిచ్చి తీగల నరుకుడూ! మూడు చోట్లా ఒకరిద్దరు చొప్పున చీపుళ్ల వారి ఊడ్పులూ!

            వాతావరణమైతే కొంత సంక్లిష్టంగా! తూర్పు నుండి డంపింగ్ కేంద్రపు సెగలూ - పొగలూ, నింగి నుండి భారీ హిమపాతమూ! చెమటతో వళ్లు తడిసి, మంచుతో తలలు తడిసి, ఊడుస్తున్న పారల్తో చెక్కుతున్న దుమ్ములంటుకొని కార్యకర్తల ముఖాలూ, ఆకారాలూ ఆ గంటన్నర శ్రమ తరువాత చూడాలి!

            ఏమైతేనేం గ్రామ ప్రెసిడెంటమ్మ కాస్త భావుకతో చెప్పినట్లు - ఈ సువిశాల చెత్త కేంద్రం గాని, శ్మశానం గాని, వేస్ట్ మేనేజ్మెంటు స్థలం గాని - అడుగడుగునా - అణువణువునా కార్యకర్తల శ్రమోపార్జితాలు! అవి చల్లపల్లికి ఎనలేని ప్రతిష్టాత్మకాలు! ఇక రెండు మూడు వేల పనిదినాల గ్రామ శుభ్ర సుందరీకరణలంటారా - అవి స్వచ్చోద్యమకారులు మానలేని మంచి వ్యసనాలు! పాతిక వేల మంది గ్రామస్తుల ఆహ్లాద - ఆనందాల కవి శ్రీరామరక్షలు!

            తొమ్మిదేళ్లు గడుస్తున్నా మీ శ్రమదానానికి విరామమివ్వరాఅని స్వచ్ఛ కార్యకర్తల్ని గాని,

            మీకోసం ముందు తరం కోసం సుదీర్ఘ కాలంగా మీ గ్రామంలో మీకళ్లెదుట జరిగే సామాజిక స్వస్తతా కృషిలో మచ్చుకు ఒక్క రోజు ఒక్క గంటైనా పాల్గొనరాఅని సగం మంది గ్రామసోదరుల్ని గాని

            అడిగి ఏం ప్రయోజనం? కార్యకర్తలు ఒంట బట్టించుకొన్న శ్రమదానాన్ని మానరు; గ్రామస్తుల్లో ఒక భాగం తమ బద్ధకాన్ని వీడరు!

నేటి శ్రమదానానంతర సమావేశంలో ముఖ్యవిషయాలు:

- 3 రోజులు భాగ్యనగరంలో గడిపి, సన్ షైన్ ఆస్పత్రి పని తీరు గమనించి వచ్చిన డాక్టర్ డి.ఆర్.కె. గారు యంత్రజీవి (రోబోట్) సహకారంతో మోకాలి చిప్పల శస్త్ర వైద్యాన్ని మెచ్చుకొంటూ చేసిన వివరణ ఎంత బాగుండెనంటే - మోకాలి బాధిత పెద్దలొకరిద్దరు టెంప్టయేంతగా!

- ఇటీవల స్వచ్ఛ - సుందరోద్యమానికి - కమ్యూనిస్టు వీధికి చెందిన అజ్ఞాతదాత 50,000/- విరాళాన్ని – (బహిరంగంగా ప్రకటించరాదనే షరతు మీద) అందించడం!

            ఇలా ఎందరో అజ్ఞాత ఆర్ధిక సహకరులు - అందరికీ మన వందనాలు!

            రేపటి వేకువ సైతం మన శ్రమ సమర్పణ చెత్త సంపద కేంద్రం దగ్గరే!

            గొప్ప ధన్యమూర్తులే!

పనిమంతుల, ఆత్మ తృప్తి శ్రీమంతుల, తమ ఊరికి

అనునిత్యం త్యాగధనుల అడ్రస్ కనిపెట్టారా?

వారెవరో కారు సుమా! స్వచ్ఛ కార్యకర్తలే

కుల - మతాల గొడవెరగని గొప్ప ధన్యమూర్తులే!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  19.04.2023.