2743* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

2743* వ నాటి చెత్త కేంద్ర స్వచ్ఛతా పునరుద్ధరణ!

            అది ఏప్రిల్ మాసపు 20వ దినం గురువాసరం - వేకువ 4.18 సమయం - అప్పటికే చిల్లలవాగు దక్షిణాన, చెత్త సంపద కేంద్రకాన, డజను మంది గ్రామ సేవాతత్పరుల సంచలనం! తదాదిగా - ఉదయం 6.05 దాక క్రమంగా తోడైన 13 మందితో పాతిక మంది నిర్వహించిన స్వచ్ఛ సుందరీకరణం!

            సూర్యోదయ సమయానికే విధిగా బాగుపడిన కాలువ గట్టు 50 గజాలూ, చెత్త సంపద భవనపుటుత్తర తూర్పు భాగమూ!

            తూర్పున కర్మ సాక్షి ఉదయించినంత వాస్తవంగా - చల్లగాలికి చెట్లు తలలూపినంత సహజంగా - తొమ్మిదేళ్లుగా ఊళ్లో ఏదోక మూల స్వచ్ఛ కార్యకర్తలు చేస్తున్న ఊరి బాగుదల ప్రయత్నం!

            పొగలు చిమ్మే - వెగటు వాసన వెదజల్లే డంపింగ్ కేంద్రం ప్రక్కనే ఈ వేకువ సమయాన పాతిక మంది కార్యకర్తల ప్రయత్నమే నేటి విశేషం!

చల్లపల్లి గ్రామస్తులు ఎప్పటికైనా తమకు తాము వేసుకొని, సక్రమ సమాధానం వెదకదగిన ప్రశ్నేలేమంటే:

- ఈ స్వచ్ఛ కార్యకర్తలకు హాయిగా నిద్రపోవడమూ సొంత లాభానికి వెంపర్లాడడమూ - బట్టనలగని, చెమట పట్టని, దుమ్ము కొట్టుకోని - ఇంతకన్నా మంచి పనులుండవా?

- మొదట్లో కొందరు కనిపెట్టినట్లుగా - నిజంగానే ఈ శ్రమదానంతో కీర్తి ప్రతిష్టల కోసమో, (పాపం శమించుగాక -) చందాలు దండుకొనేందుకో ఈ లబ్ద ప్రతిష్టులు కష్టిస్తున్నారా?

- లేక, నిజంగానే 4 లక్షల పని గంటల శ్రమదానంతో ఎప్పటికైనా ఊరి రూపు రేకలు మార్చగలమనే నమ్మకంతో - నిస్వార్ధంగా శ్రమిస్తుంటారా?

            ఊళ్లో సగం మంది ఇలాంటి సందేహాలెప్పుడో తీర్చుకొన్నారు. కార్యకర్తలకు బహు విధాలుగా సహకరిస్తున్నారు! మిగిలిన సగం మనుషుల సంగతి?

            గ్రామ జన సంఖ్యతో పోల్చుకొంటే బొత్తిగా స్వల్ప సంఖ్యాకులైన ఈ పాతిక మంది శ్రమదాతల నేటి కృషి వివరాలివి:

- పది మందిది మరీ డంపింగ్ సెగ తగిలే చిల్లలవాగు గట్టు మీద గడ్డీ, పిచ్చి మొక్కలూ తుదముట్టించే పని! గంటకు పైబడిన కాయకష్టంతో వాళ్లు అంచనా మేరకు శుభ్రపరిచారు.

- నలుగురిది చెత్త సంపద కట్టడం ముందు మామిడిచెట్ల దగ్గర సుందరీకరించే కృషి! వాళ్లే లోటూ చేయలేదు.

- మిగిలిన వాళ్లది తుక్కు సంపద కేంద్రపుటుత్తరంగా - బాగా దట్టంగా పెరిగిన పెద్ద వృక్షాల ప్రక్కగా ముళ్ల మొక్కలూ, ఇతర చెత్తలూ తప్పించడమూ, ఏరడమూ .

- నలుగురు చీపుళ్ల వాళ్ల పని యధాతథం!

            సమీక్షా కాలంలో DRK డాక్టరు గారు అన్ని రోజుల్లాగే ఇవాళ సైతం ఇంత మురికి - మొరటు పనులు చల్లపల్లి కార్యకర్తలు కాక ఇంకా ఎవరైనా చేయగలుగుతారా....అని ఆశ్చర్యపోవడమూ

- తాతినేని (మొక్కల) వేంకటరమణుడైతే ముమ్మారు విస్పష్టంగా గ్రామ స్వచ్చ - సుందరీకరణ నినాదాలు పలికి ఊరుకోక - కార్యకర్తలెవరైనా తక్కువ చోటులలో, లేదా స్థలం లేకుంటే, డాబాల - వరండాల - గోడల - మీద కూరలు పండించాలనుకొంటే - ఉచితంగా సులభ పద్దతుల్ని (మొక్కలు వారే కొనవలసుంటుంది!) తెలుపగలనని ప్రకటించడమూ...

            చల్లపల్లి స్వచ్చంద శ్రమదానంలాగానే దానికి వచ్చే విరాళాలూ కొంత వింతగానే ఉంటాయి.

            చినకళ్ళేపల్లికి చెందిన రైతు గుత్తికొండ రామారావు గారు ప్రతి సంవత్సరం లాగే రైతు మనస్తత్త్వాన్ని ప్రతిబింబిస్తూ ఒక ధాన్యం బస్తా విలువను స్వచ్చోద్యమం కోసం సమర్పించడం కాస్త క్రొత్తగా లేదూ?                                                                                                                                                                                                                                                                                                                                                                                           

            రేపటి శ్రమదాన వేదిక - నడకుదురు బాట నుండి శ్రీనగర్ వీధిలోని ఈద్గా ప్రాంతమే!

          అనగలరా?

ఈ వీధిలో కార్యకర్త ఎన్నడు శ్రమ పడలేదని-

సంత - రైతు బజార్ పట్ల శ్రద్ధ చూపనే లేదని- 

పార్కుల - ఉద్యానమ్ముల ప్రగతి అతని పనికాదని” 

ఇంగిత మున్నట్టి మనుజు లెవ్వరైన అనగలరా?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   20.04.2023.