2744* వ రోజు....... ... ....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

రమ్జాన్ ముందర ఈద్గా సమీప స్వచ్చ - సుందరోద్యోగం (ఉద్యోగం = ప్రయత్నం!) - @2744*

            శుక్రవారపు (21.4.23) శ్రమదానం కూడ యధాప్రకారమే 4.30 కు కాక - 4.17 కే శ్రీనగర్ లోని ఈద్గా వీధిలో - ఏ12 మందితోనో ప్రారంభోత్సవం జరిగి, నిముషాల వ్యవధిలో - వడి వడిగా వచ్చిన, 15 మందితో మొత్తం 27 మందీ తలా 100 నిముషాల వీధి పారిశుద్ధ్య/సుందరీకరణం జరిగిపోయింది!

            అసలీ నాటి శ్రమదానం చిల్లలవాగు దక్షిణపు గట్టు వద్దనే జరగవలసియుండగా రంజాన్ ప్రార్ధనల నిమిత్తం ఈద్గా లోపల శుభ్రం చేసుకొంటూ - ముస్లిం సోదరులు దాని ముందరి వీధి పరిశుభ్రత కోసం నిన్న స్వచ్చ కార్యకర్తల్ని కలిసి రావాలనడమూ - నిరుడిదే సమయాన ఆరేడు రోజులు అక్కడే శ్రమించిన కార్యకర్తలు సమధికోత్సాహంతో ఈ వేకువ ఆ పని పూర్తిచేయడమూ జరిగిపోయాయి!

ఇక - నేటి వేకువ శ్రమదానం లెక్కల సంగతి :

- కార్యకర్తల చేతిలో బాగుపడిన వీధి సుమారు 60 - 70 గజాల వరకే గాని - అక్కడ దొరికిన గడ్డీ గాదం, చెత్తా చెదారం పెద్ద బండెడు!

- కారణం బేమనగా - ఇన్నేళ్ల స్వచ్ఛ సుందరోద్యమం తర్వాత సైతం కొన్ని మారుమూల వీధుల్లో ఇంకా చిన్న చెత్తకేంద్రాలుండుట, డ్రైన్లలో ఏ ఛండాలాన్నైనా విసిరే అలవాటు ప్రజల్ని వదలకుండుట! మరొక కారణము  - సుందరీకర్తల మనస్తత్వమే! (వాళ్లకి పైపైన శుభ్రపరచడం చేతకాదు సశాస్త్రీయంగానూ, సమూలంగానూ ప్రతి అంగుళాన్నీ సుందర శిల్పంగా చెక్కుతుంటే - కాస్త ఆలస్యం కాక తప్పదు గదా!)

- ఆ 200 అడుగుల వీధిలోనే - కొన్ని చోట్ల ఖాళీ కొబ్బరి బొండాలు, పిచ్చి ముళ్ల కంపలు, మధ్యాంద్ర దేశ కీర్తి ప్రతిష్ఠల్ని చాటుతున్న ఖాళీ మందు సీసాలు, టిఫిన్ పొట్లాలు, ఎండు పుల్లలు....

            అందువల్ల - ఒక ప్రక్క కత్తుల నరుకుళ్లు, చీపుళ్ల ఊడ్పులు, ప్లాస్టిక్ తుక్కుల ఏరుళ్లు, మురుగు కాల్వ గట్టు సుందరీకరణలు... వీటితోనే సూర్యుని ఆగమనమూ!

            ఇంకొక విశ్లేషణ మేమంటే: ఎత్తైన ట్రాక్టర్ మీద మరింత ఎత్తైన తుక్కుల మీద నిలిచి, సర్దుతున్న కార్యకర్త ఒకాయన మైకు పాటకనుగుణంగా - తుక్కు త్రొక్కడాన్నే నృత్య భంగిమలో చేస్తుండడం! (అదేమంత చెప్పుకోదగ్గ నాట్య నైపుణ్యం కాదు గాని ఈ నిత్య శ్రమదానం కార్యకర్తలెంత సంతోషంగా చేస్తారో తెలియజేయగలదు!)

            మరో వంక 5.30 నుండి ఒక్కొక్కరు గాను, జట్లు గాను రమ్జాన్ దీక్షితులు వచ్చి, దర్గా లోపల శుభ్రపరచడం! చివరికి 6.00 వేళకు ఆ ప్రాంతం ఎలా మారెనంటే – ‘ఏ ప్రార్థనా ప్రదేశమైనా ఇంత చక్కగా ఉండాలిఅనేంతగా!

నేటి శ్రమదాన సమీక్షా సభలో కొన్ని విశేషాలు:

1) ప్రముఖ ముస్లి౦ పెద్ద నసీం ఘోరీ ముమ్మారు గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు ప్రకటించడమూ, ఇంత సుదీర్ఘ - నిబద్ద గుణాత్మక - స్వార్థరహిత ఆదర్మ శ్రమదాన చల్లపల్లి కారకులైన స్వచ్ఛ కార్యకర్తల్ని మరీ ముఖ్యంగా స్వచ్చ - సుందర డాక్టరమ్మ డాక్టరయ్యల్ని పదే పదే ప్రశంసించడమూ

2) రామకృష్ణ వైద్యుడైతే - 33 ఏళ్ల నాటి, బాబరీ మసీదు విధ్వంసక సందర్భ అఖిలపక్ష - అఖిల వర్గ సభలో నాటి మస్జిద్ కమిటీ అధ్యక్షుడు అమానుల్లాఖాన్ గారి ఆణిముత్యపు మాంత్రికవాక్యం – “రేపు బాబ్రీ మసీదు సంగతెలా ఉన్నా చల్లపల్లిలో మనమంతా సామరస్యంగానే బ్రదుకుదాంగుర్తుచేసుకోవడమూ

3) ఇక నేనైతే - ప్రస్తుత పాపిష్టి దేశ - కాల పరిస్థితుల నేపథ్యంలో. ఒక అద్భుత సేవానంతర సమావేశంలో 74 మంది (27+47) పాల్గొన్న దృశ్యాన్ని మనసారా కీర్తించి - 33 ఏళ్ల నాటి మత సామరస్య సౌమనస్య అఖిలపక్ష సమావేశాన్ని గుర్తుచేయడమూ......

4) ఉభయ మతస్తులూ (దేనికీ చెందని అసలే మతాన్నీ పాటించని కొందరం కూడ ఈ సమూహంలో ఉన్నాం!) పరస్పర శుభాకాంక్షలందించుకోవడమూ.....

            కార్యక్రమం చివర జనాబ్ నసీం ఘోరీ గారు స్వచ్ఛ కార్యకర్తలందరికీ రమ్జాన్ శుభాభినందనలతో పాటు సాంప్రదాయానుగుణంగా ఖర్జూరాల పంపకం కూడా చేశారు.

            చివరగా రేపటి స్వచ్ఛంద శ్రమదాన కేంద్రం చెత్త కేంద్రంఅనుకోవడమూ...

       ఆప్త బంధువుల రీతిని

ఏ దేవుళ్ళీ ఊరిని ఇంతగ దీవించితిరా?

ఏ నేతలు తమ ఊరికి ఈ మాత్రం శ్రమించారా?

ఆప్త బంధువుల రీతిని అండదండలిచ్చితిరా?

చల్లపల్లి స్వచ్చోద్యమ సచ్చరిత్ర వ్రాసితిరా?         

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   21.04.2023.