2745* వ రోజు....... .......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

          శ్మశాన పరిశుభ్ర - సుందరీకరణ ముగింపు - @ 2745*

           శనివారంతో 27 మంది సుస్థిర మనస్కులు రాజీ లేని కృషితో

1) చెత్త కేంద్రం  2) దహనవాటికల తూర్పు భాగం  3) రెండు సిమెంటు బాటలు  4) రెండు మూడొందల  గజాల చిల్లల వాగు దక్షిణపు గట్టు  5) చెత్త సంపద భవన పరిసరాలు వారం రోజుల క్రితం కన్నా బాగా కనిపిస్తున్నాయి.

          రహదార్ల మీద, మురుగు కాల్వ గట్ల మీద చేసే పనులొక ఎత్తైతే ఈ వారం రోజులుగా పాతిక - ముప్పై-నలభై మంది చొప్పున జరిగిన శ్రమదానం మరొక తీరు!

          చీకట్లో ఇక్కడ చెత్త కేంద్రపు దుర్వాసనా, పొగలూ, మానసికంగా రుద్ర భూమి సెంటిమెంట్లూ వంటివి అధిగమించవలసి ఉంటుంది. 8-9 ఏళ్లుగా స్వచ్ఛ కార్యకర్తలకు, ట్రస్టు ఉద్యోగులకు ఈ అంతిమ ప్రస్థాన స్థలంలో ఏ మూలన - ఎప్పుడే పని బడుతుందో - ఏ సమస్య నెలా పరిష్కరించాలో తెలుసు!

          ఆ మాట కొస్తే- ఊరి వీధులూ, బైటి 7 రహదార్లూ, మురుగు కాల్వ వంతెనలూ... ఎక్కడే అవసర మొచ్చి పడుతుందో,  ఎంత శ్రమ చేయాల్సొస్తుందో, 50-60 మంది కొక అవగాహనా,  ప్రణాళికా ఉండనే ఉంటాయి! అవేమీ లేకుండానేఅల్లాటప్పా, అర కొరా సంసిద్ధతతో ఇంత పెద్ద ఊరు - ఇన్నేళ్లుగాఇంత ఆహ్లాదకరంగా నిలుస్తున్నదా?

          40 దినాలకు పైగా -ఏ రెండువేల పనిగంటలో జరిగిన శ్రమదానమే చూడండి ! చల్లపల్లి నడిబొడ్డు నుండి సుమారు 2 కిలో మీటర్ల బెజవాడ బాటనే పరిశీలించండి ! ఏ పల్లెలో, ఏ రహదారి ఇంత స్వఛ్చ-శుభ్ర- సుందర-హరితంగా, రంగుల పూల మయంగా, " ఇదీ నిజమైన పల్లెటూరు బాట ఉండదగిన తీరు" అనిపించేంతగా ఉంటే చెప్పండి!

          అదీ స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల కాయ కష్టమంటే – పట్టుదలంటే ! ఇప్పటికే ఈ చారిత్రక గ్రామం రాష్ట్ర దేశ ప్రసిద్ధమైపోయింది! ఇక మీద కూడ ఈ ఉద్యమం ఇలా సాగితే - మరిందరు శ్రమ దాన సంసిద్ధులైతే- అప్పుడీ గ్రామం పరిస్థితేమిటి ? ఈ ఏప్రిల్ మాసపు 22 వ (శనివారం) నాటి శ్రమదాన విధంబెట్టి దంటే:

1) చెత్తకేంద్రపు పొగల-సెగల ప్రక్కన చిల్లల వాగు గట్టున 10 మంది ప్రయత్నం మరికొంత మేరకు జరిగింది. దాన్నంతటితో ఆపి, మిగిలిన కొద్ది భాగాన్ని ట్రస్టు కార్మికులకు కేటాయించి, 10 మందీ శ్మశానం ఉత్తరాన కాల్వగట్టు మెరుగుదలకు పూనుకొన్నారు.

2) నాలుగైదునాళ్లు చేసిన సుందరీకరణలో ఇంకేం మిగిలిందనో – ఆ బృందం వాళ్లు మళ్లీ చెత్త సంపద భవనం దగ్గరే తమ పనితనం చూపించారు!

3) రావి- మర్రి జంట చెట్ల కొమ్మల క్రమబద్ధీకరణకు మరి కొందరు పూనుకొన్నారు!

4) 6.25 నుండి శ్రమ సమీక్షా సభలో అందరూ పాల్గొన్నారు;

5)  మెండు శ్రీను గర్జించిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాల్ని అందు కొన్నారు. 

6) ఈ ఊళ్లో - ఇన్నివేల రోజుల - ఇంత కాయ కష్టం ఎలా జరిగిందని దాసరి వారు ఆశ్చర్యపడుతూ సమీక్షిస్తుంటే విన్నారు.

7) అందరూ ముస్లిం సోదరుల ఖర్జూర పండ్లనందుకొన్నారు!

8) పనిలో పనిగా శంకరశాస్త్రి నివేదిత పప్పుండల్నీ గౌరవించారు!

9) అమెరికానివాసి- మేకావారి పాలెం వైద్యుడూ - మేకా శేషగిరి రావు గారి లక్ష విరాళాన్ని స్వాగతించారు!

10) రేపటి శ్రమదాన వేదిక బెజవాడ రోడ్డు లోని గాంధీ స్మృతి వనం దగ్గర అని నిర్ణయించారు.

11) ఇళ్ల దగ్గర్నుండి బయల్దేరిన సుమారు 2 ½   గంటల తరువాత తమ ప్రయత్న సాఫల్యాన్ని ఆనందిస్తూ గృహోన్ముఖులయ్యారు!

        ఊరికి శని పట్టిందా?

ఏ అదృష్టమో పట్టీ- ఇంతమంది కార్యకర్త

లిన్నేళ్లుగా చల్లపల్లి నింతగ మార్చేస్తుంటే-

ఆ సదాచార మందుకొనక - సగం మంది పట్టనట్లు

ఉండడమా! ఇదేం ఖర్మ! ఊరికి శని పట్టిందా?        

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   22.04.2023.