2746* వ రోజు....... .......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

                      మన ఊరి స్వచ్ఛ-సుందరోద్యమ వికాసం-@2746*

ఆ వికాసం ఆదివారం (23-4-23) నాటిది, సమయం 4.20-6.12 నడుమ, స్థలం – 6 వ నంబరు పంటకాలువ నుండి 1) సచివాలయ 2) గాంధీ స్మృతివన  3) ప్రభుత్వోన్నత విద్యాలయ 4) విజయోన్నత పాఠశాలల పర్యంతం బెజవాడ దారిలో! దాని నిడివి 200 గజాలు, దాని స్ఫూర్తి ప్రశ్నార్థకమూ !

          స్ఫూర్తి గ్రహీతలెందరోగాని, స్ఫూర్తి ప్రదాయక  కార్యకర్తలు 13+4+5+7+4+4+2 = 39 మంది (చివరివారు అతిధి పాత్రధారులు!) ఆసలిందరికి వేకువ సమయాన-బెజవాడ రోడ్డులో – మురుగుకాల్వల్లో, పంట కాల్వ గట్లమీద - వంటి చెమటకు దుమ్ము కొట్టుకుపోయే గంటా 50 నిముషాల మురికి పనులా ?  “తొమ్మిదేళ్ల నుండీ క్రమం తప్పకుండా ఎంత ఖర్మ పట్టింది వీళ్లకి?” అని దయచేసి ఎవరూ ప్రశ్నించకండి!

        ఈ గ్రామాన్ని ఏలిన్నాటి శనిలా పీడిస్తున్న బాహ్య విసర్జనల, పారిశుద్ధ్య రాహిత్యాల,  హరిత సౌందర్య లోపాల ఖర్మను వదిలించడానికే ఈ కార్యకర్తల 2746* రోజుల  శ్రమదానం !  "మన కోసం మనం"పేరిట ఉన్న ధార్మిక సంస్థ  "నభూతో న భవిష్యతి”  లాంటిప్రయత్నం!  ఈ శ్రమదాన యజ్ఞం చల్లపల్లి కేంఒరగబెట్టిందో- రానున్న కాలంలో ఏమేరకు విజయవంతమౌతుందో- గ్రామస్తుల సహకారమెంతగా లభిస్తుందో- కాల పురుషుడే నిర్ణయిస్తాడు!

          ఇప్పటికైతే " కర్మణ్యేవాధి కారిస్తే-మాఫలేషు కదాచన...." (ఎవరికైనా సత్కర్మాచరణలకే  తప్ప వాటి ఫలితాలపై అధికారం లేదు) అనేదే స్వచ్ఛ కార్యకర్తల సిద్ధాంతం!

          కార్యకర్తల సంఖ్య ఈ ఆదివారం పెరగడమూ, నెలరోజుల్నాడే  వీళ్ళొకమారు శుభ్రపరచడమూ, వేరెవరో బాటకు తూర్పు డ్రైన్ ను  మట్టి త్రవ్వడమూ కారణాలుగా - ఎంత ఉక్క వాతావరణమైనా ఈ స్వఛ్ఛ కృషీవలుల ప్రయత్నం బాగానే నెరవేరింది!

          చీపుళ్ల దుమ్ము చెమట చొక్కాల కంటుకోవడమూ, లోతైన మురుగు కాల్వ దగ్గర చెత్త ఏరే- చెట్లను సుందరీకరించే - డిప్పల్తో నానాజాతి వ్యర్ధాల్నెత్తి ట్రాక్టర్ లో నింపే - రోడ్ల అంచుల మట్టిని గోకి,  బాటను విశాలపరచే- ఒంట్లో నీరు చెమటగా ఆవిరై, సీసాల కొద్దీ నీళ్లు త్రాగే ఈ సామాజిక కర్తవ్య పరాయణుల్తో కలిసి పని చేస్తేనే గాని ఈ శ్రమ విలువేమిటో, ఊరికి ఆ అవసరమేమిటో- ఉద్యమకర్తలకీ ‘ ఖర్మ’ ఏమిటో పూర్తిగా అర్థంకాదు!      

          నేనీరోజు గమనించిన కార్యకర్తల కాయ కష్ట విశేషాలు కొన్ని:

- సచివాలయం ఎదుటి బెజవాడ బాటను ముగ్గురు చీపుళ్ల వారు - ఒక్కటి కాదు రెండు, మూడు మార్లు పట్టి పట్టి శుభ్రం చేయడం !

- లోతైన డ్రైనులోని పుల్లా-పుడకా - ఆకులలములూ-ప్లాస్టిక్ తుక్కులూ తలదీపాల వెలుగులో ఊడ్చి- డిప్పల కెత్తి ట్రక్కులో  నింపడమూ !

- మామూలు వాళ్ళు సరే - వయోధికులూ, విద్యాధికులూ, అసూర్యం పస్యలూ తదేక దీక్షతో పారిశుద్ధ్య  పనికి దిగడమూ!

          మౌన గాంధీ ముని సాక్షిగా-పావుగంటకు పైగా జరిగిన శ్రమసమీక్షా సమయంలో:

 - గోళ్ల వేంకట రత్నం ప్రకటించిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలూ,

- ఈ ఉద్యమ సంచాలకుడు నేటి కృషి పూర్వాపరాలను వివరించి గత నెల ఉద్యమ ఖర్చుల - రాబడుల సంగతి వివరించడాలూ...

- ఇద్దరు గాయకులు మంచి మంచి గీతాలాపనతో ఈ సభనొక వేడుకగా మార్చడాలూ....

 ఈ సంగతులతో పాటు కోడూరు వేంకటేశ్వర మహోదయుడు  నెలవారీగా చెల్లించే 520/- రూపాయల సమర్పణమూ..

తదుపరి బుధవారం వేకువ మన శ్రమదాన గమ్య స్థలాలు

1) విజయా కాన్వెంట్ –

2) వికాస కేంద్రం –

3) విద్యుత్ సబ్ స్టేషన్ –

4) పెట్రోలు బంకూ వగైరాలుగా నిర్ణయించడమూ...!

              ఐకమత్యం నిలువ వలెనోయ్!

జాగృతములై - శక్తిమయమై జన పదంబులు మెలగవలెనోయ్

శుభ్రముగ - ఆహ్లాదకరముగ – శుభం కరముగ వెలగ దగునోయ్

స్వచ్ఛ శ్రామిక కార్యకర్తల ఐకమత్యం నిలువ వలెనోయ్

స్వచ్చ - సుందర చల్లపల్లే  జానపదులకు ఉదాహరణోయ్ !  

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   23.04.2023.