2747* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

రెస్క్యూ టీమ్ ప్రాభాత వీధి నవీకరణ చర్య - @2747*

            సోమ (24-4-23), మంగళవారాలొస్తే ఆరేడుగురి వీధి శుభ్రతా/భద్రతా కృషి షరామామూలే గదా! ఉదాహరణకి గంగులవారిపాలెం బండ్రేవు కోడు ఉత్తరపు గట్టు రోడ్డు - అప్పటికీ అది రాలిన పూలతో చినుకు పడి వెలిసిన తడీ - పొడీ స్థితిలో నాకైతే మళ్లీ మళ్లీ చూడాలన్నంత ముచ్చటగానే ఉంది!

            ఐతే, స్వచ్చ కార్యకర్తల - అందులోనూ రెస్క్యూ వాలంటీర్ల రూటే వేఱు - వాళ్ల చూపే పత్యేకం గనుక గతవారం వీధి మార్జిన్ చెట్ల, పూల మొక్కల సుందరీకరణం ఈ వేకువ కూడ కొనసాగించారు!

            డజనుకు పైగా అదుపు తప్పుతున్న వాటిని క్రమబద్ధీకరించారు, అకాలంగా వచ్చిన స్వల్ప వర్షంతో కొన్ని నిముషాలు పని ఆగినా - వాళ్ల గంటన్నర శ్రమదానంతో ఆ వీధిలో ఇంకొన్ని గజాలు శుభ్రపడి, వ్యర్ధాలు ట్రక్కులోకి చేరి 6.00 తరువాత వీధి శుభ్ర సౌందర్యాల్లో కొంత పురోగతి!

            ఈ 7.00 తదుపరి ఎవరైనా అటుగా వెళ్లేవారు కాస్త నిదానించి చూస్తే ఇప్పటి దాకా మెరుగైన వీధి భాగానికి వంతెన దాక మిగిలిపోయిన చోటుకీ స్పష్టమైన తేడా కనిపెడతారు!

            సదరు ప్రయాణికులు ఏమిటి వీళ్ల కాయకష్టం? రహదార్ల మీద, మురుగు కాల్వల్లోన, ఊరి ముఖ్య ప్రదేశాలన్నిట్లో 2747* దినాల నుండీ కూటికో గుడ్డకో పనికి రాని ఇంత శ్రమదానం దేనికి?....” అని ఆలోచిస్తే గాని.....

            తక్కిన వేల - లక్షల ఊళ్లకూ చల్లపల్లికీ వ్యత్యాసమేమిటో - ఒక స్వార్ధ రహిత సుదీర్ఘ సామాజిక సామూహిక కర్తవ్యం విలువేమిటో గ్రహించగల్గుతారు!

            6.35 వేళ ఈ ఐదుగురు శ్రామికులూ నాబోటి పైమనుషులు ముగ్గురూ పద్మాభిరామం దగ్గర కస్తూరి శ్రీను మార్గదర్శకత్వంలో ముమ్మారు తమ స్వచ్చోద్యమాశయ నినాదాలను పలికి శంకర శాస్త్రి సమర్పిత మర్యాదలందుకొని, గృహోన్ముఖులయ్యారు!

            రోజక్కటి రావాలని.

ప్రచారాలకై కాదని స్వార్ధ మందులో లేదని

పదవీ వ్యామోహంతో పరుగులెత్తు పని కాదని

అది కేవల సామాజిక బాధ్యత మాత్రంగా నని

ప్రతి పౌరుడు తెలుసుకొనే రోజక్కటి రావాలని..... 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   24.04.2023.