2748* వ రోజు....... .......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

                  ముగిసిన గంగులవారి పాలెం వీధి సపర్యలు  - 2748*

           కిలోమీటరుకు తక్కువగా ఉన్న ఆ వీధికి రోజూ 6-7-8 మంది రిస్కు తీసుకొని చేసిన సుందరీకరణ – క్రమ బద్ధీకరణ సపర్యచర్యలు (7/8 రోజులకు పైగా -) నేటి ఉదయం 6.30 కు  ఫలప్రదమై, ఏమాత్రం సౌందర్య పిపాస కలవారి నైనా ఈ వేసవి కడ దాక అలరిస్తూనే ఉండగలవు.

          అలాంటి సహృదయులు ఈ బాటపై నడుస్తూ హ్లాద మనస్కులైనపుడు - ఈ సుమ సుందర వాతావరణం వట్టి మాటల్తో సమకూడలేదనీ, వందల కొద్దీ శ్రమ గంటల కష్టంతో- నైపుణ్యంతో - చెమటలతో - స్వచ్ఛ కార్యకర్తల సంకల్ప సిద్ధేననీ గుర్తుచేసుకోవడమే న్యాయం!

      "అగాధమౌజలనిధిలోన - ఆణిముత్యమున్నటులే

       'కష్టాల' మరుగున దాగీ- సుఖమున్నదిలే

        ఏదీ తనంత తానై - నీదరికి రాదు

      శోధించి సాధించాలీ - అదియే ధీరగుణం”

        అని ఒక సినీ (శీశ్రీ?) కవి చెప్పినట్లు -

ఈ శ్రమైక జీవన సంగీతాన్నీ - ఈ ఊరిసామాజిక, సామూహిక కర్తవ్య నిర్వహణ సౌందర్యాన్ని విజ్ఞులు పట్టించుకోకపోతే ఎలా?

ఈ వేకువ కూడ :

- వాతావరణం చల్లగా ఉన్నట్లు తోచినా, తాము కార్చిన చెమటల్ని సీసాలకొద్దీ నీటీతో భర్తీచేసుకొన్నారు!

-  ఇద్దరు 60 + కార్యకర్తలు బాటను ఊడ్చారు!

- వాళ్లు తొలగించకపోతే ఒక మంచి చెట్టు కరెంటు కార్మికుల చిరాకుకు బలయ్యేదే!

- ట్రాక్టరు డోరు అంచున నిలిచి ఒకాయన సదరు చెట్టును సుందరీకరించిన వైనం చూసి తీరాల్సిందే!

          పనులు ముగించాక 6. 35 కు మాలెంపాటి వైద్యుననుసరించి ఉద్యమ నినాదాలిచ్చారు!

అంతకుముందు తాతినేని వారి కుక్కుటాండ- పానీయాలను కూడ చవి చూశారు!

           రేపటి బృహత్తర వీధి పారిశుద్ధ్య బాధ్యతలు బెజవాడ రోడ్డులోని ఆకుల దుర్గా ప్రసాదు సిమెంటు - నాపరాళ్ల దుకాణం దగ్గర ఆగి నిర్వర్తిద్దాం!

        రెండు రెళ్ళు నాలుగు

రెండు రెళ్ళు నాలుగనే లెక్క ఎంత ఖచ్చితమో

మలయ పవన చల్లదనం మాట ఎంత వాస్తవమో

‘శ్రమ మూలమిదంజగత్’ సామెతెంత సార్థకమో

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   25.04.2023.