2749* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

2749* వ నాటి బెజవాడ బాట పారిశుద్ధ్యం

            బుధవారం వేకువ - 6.06 నిముషాల దాక - అనగా గంట 45 నిముషాల పాటు జరిగిన స్వచ్ఛ వీరోచిత పోరాటమది! పోరాట యోధులు పాతిక మందే! అదీ ఎడతెగని ట్రాఫిక్ రణగొణ ధ్వనుల నడుమనే!

            అటు విజయా కాన్వెంటు మొదలు చండ్ర వికాస కేంద్రం దాక - 100 గజాల రహదారితో బాటు తూర్పు వైపున్న డ్రైనూ, ఆక్రమిత బడ్డీ కొట్ల సముదాయ ప్రాంతమూ, దారి మార్జిన్ల మీది మొక్కల పాదులూ ఈ 35 కి పైగా పని గంటల వ్యవధిలో బాగుపడినవి!

            మరి, ఇందుకు గాను ఒడలు వొంచి, దుమ్మూ - ధూళీ పీలుస్తూ  చెమటలు దిగగారుస్తూ, ఊరి సౌకర్యార్థం శ్రమించిని పాతిక మంది స్వచ్ఛ - శుభ్ర కృషీవలుల మాటేమిటి? తమ వీధిలో దుకాణాల - గృహాల దగ్గర ఇందరింతగా శ్రమిస్తుంటే - పట్టించుకోని, సహకరించని వారి సంగతేమిటి?

            అసలా సంగతేమీ సరకు చేయక తమ సుదీర్ఘ ప్రణాళిక ప్రకారం నిర్వికారంగా, నిశ్చలంగా, రాగద్వేషరహితంగా తమ పని తాము చేసుకుపోతున్న ఈ పాతిక మంది కర్మవీరుల 26-4-23 వ నాటి రకరకాల పారిశుద్ధ్య ప్రయత్నము లేవనగా:

1) విజయాకాన్వెంటు ఎదుట ప్రభుత్వ వైద్యశాల వీధి ప్రక్కన ముగ్గుర్నలుగురు 5.00 సమయానికే నేలను శుభ్రపరచి, మట్టి పరచి కొంగ్రొత్త అందం సంతరించిన తీరు,

2) డ్రైనులో దిగలేదు గాని, డజను మంది కత్తీ - దంతెధారులు కాల్వవ్యర్ధాల్ని బైటకు లాగి, పూల మొక్కల పాదుల గడ్డిని తొలగించి ఏ 30/40 డిప్పల గడ్డీ - చెత్తా - ప్లాస్టిక్ తుక్కుల్నో ట్రక్కులో నింపిన నేర్పు,

3) ఎగుడు - దిగుడు, గుంటల మయమైన రోడ్డును గంటకు పైగా వాహనాల్ని తప్పించుకొంటూ ఊడ్చిన నిపుణత,

4) బాట పడమర భాగాన్ని - ముఖ్యంగా 3 తూముల పూడికను తీసేందుకు సుందరీకర్తలిద్దరెంతగా శ్రమించారో మురుగు కంపునెంతగా భరించారో - అందులో ఒకాయన జర్రున జారి కూడపడకుండ నిలద్రొక్కుకున్నాడో - అంతిమంగా వాన నీటి మడుగును సన్న కాలువ త్రవ్వి డ్రైన్లోకెలా మళ్లించారో - అదొక శ్రమదాన పాఠ్య గ్రంధం! ఇవన్నీ తొమ్మిదేళ్ల స్వచ్ఛ - సుందరోద్యమంలో మరీ క్రొత్త సంగతులు కాకపోవచ్చు; పడి లేవడాలూ బట్టలకు మురుగంటుకోవడాలూ ప్రాత సంగతులేకావచ్చు; మరి ఈ పారిశుద్ధ్య/సుందరీకరణ ప్రయత్నాన్ని గ్రామస్తులికనైనా సీరియస్ గా పట్టించుకొంటారా అనేదే ప్రస్తుతాంశం!

            6.30 కి స్వచ్ఛంద శ్రమదానోద్యమ సందేశ నినాదాలిచ్చిన షణ్ముఖ శ్రీనివాసుడు గానీ కార్యకర్తల కష్టాన్ని సమీక్షించిన రామకృష్ణ వైద్యుడు గానీ - ప్రముఖంగా ప్రస్తావించింది గుట్కా ఖైనీ ప్లాస్టిక్ చిరు పొట్లాల వల్ల వచ్చే కాన్సర్ ప్రమాదాన్నే!

            చల్లపల్లి ఇరుగు - పొరుగూళ్లో 10 కిలోల గంజాయిని పట్టుకొన్న విషయాన్నెవరో ప్రస్తావించారు!

            తస్మాత్ జాగ్రత్త! పైమూడు మాదక ప్రామాదిక ద్రవ్యాల పట్ల గ్రామ పెద్దలంతా పారాహుషార్!

            రేపటి మన శ్రమదాన సన్నద్ధత నడకుదురు బాట ప్రక్కన గల ఇంధన నిలయంవద్ద నుండి ప్రారంభిద్దాం!

            ఇదేం ఖర్మ అనుకొనడే!

శ్రమదానం ఆయుధముగ - సహనం తన కవచంగా

ఉచ్చలు - పెంటల నడుమన ఉవ్వెత్తున దుర్వాసన

అనుభవిస్తు - శ్రమిస్తున్న అందరిలో ఇన్నేళ్లుగ

ఏ వాలంటరైనా ఇదేం ఖర్మ అనుకొనడే!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   26.04.2023.