2750* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

నేటికి (27.4.23 - గురువారం) 2750* రోజుల శ్రమదానం!

         అట్టి దాతలు 28 మంది, శ్రమదాన పరిగ్రహీత కోమలా నగర్ 1-2-3- వీధుల కెదురుగా - బెజవాడ మార్గంలోని

 1) చండ్ర వికాస కేంద్రమూ,

2) విద్యుదుపకేంద్రమూ,

3) నందమూరి వారి పేరిట గల పార్కు,

4) పెట్రోలు బంకూ,

5) వీటికి దూరంగా చెట్ల క్రమబద్ధీకరణము!

         ఈ వేకువ ఇక్కడ చెత్త బండి కనిపించలేదని ఆలోచిస్తే - అది ఇక్కడి పని చోటికి దూరంలో - ఐదారుగురికి చెట్ల కొమ్మల్ని తొలగించేందుకు వేదికగా మారిందని తెలిసింది!

         ఇద్దరు బడి పంతుళ్లు, ఒకవ్యాపారి, ఒక ITC ఉద్యోగితో సహా - ఏడెనిమిది మందికి పెట్రోలు బంకు మిల్లు నడిమి మురుగు కాల్వనూ - JCB చుట్టూ దట్టంగా పెరిగిన పిచ్చి కంపనూ రకరకాల తుక్కునూ ఊడ్చి, పరిశుభ్ర పరిచి, పీకి - లాగి, గుట్టలు చేయడానికే గంట సమయం పట్టింది!

         వికాస కేంద్ర రహదారి భాగాన్ని తీర్చిదిద్దిన చర్యలు ముగ్గురివి! విద్యుత్కేంద్రం ఎదుటి డ్రైను గట్టును నలుగురు కార్యకర్తలెంత పట్టుదలగా - గడ్డికోసి, రోడ్డుమీది మట్టిని గోకుడు పారల్తో తుడిచి, దంతెల్తో పోగులు పెటుతున్నారో.. వాళ్ల ముఖాలూ - చొక్కాలూ ఎంతగా చెమట కంపుగొడుతున్నవో కూడ గమనించాను!

         ఐతే - ఇన్నేళ్లు, ఇన్ని వేల రోజులు సామాజిక బాధ్యత లేమిటో - వట్టి కబుర్లు కాక, గట్టి మేలు చేస్తున్న శ్రమదాన పరమార్ధమెందుకో - ఇప్పటిదాక ఈ 1% కన్న తక్కువ మంది తమ ఊరి కోసం ఏం సాధించారో -  ఏం సాధించనున్నారో.. గతమ్ గతఃఅనుకొని ఇప్పటి నుండైనా మిగిలిన సగం మంది చల్లపల్లి వాస్తవ్యులు తమ వంతుగా ఏం సహకార మందించగలరో నిర్ణయించుకొనక తప్పదు! 

         నేటి మరొక విశేషమేమంటే : బెజవాడ ప్రక్కన కొండపల్లి నుండి అవసరార్థం అనుకోకుండా వేకువ 4.30 కే చల్లపల్లి వచ్చి, బెజవాడ రోడ్డు మీద అప్పటికే పాతిక ముప్పై మంది కార్యకర్తల బాధ్యతా నిర్వహణాన్ని చూసి, 2 గంటలు వారితో గడిపి, ఒక అరుదైన అనుభూతికి లోనైన నాగరాజుఅనే యువకుడు!  అతడిని ఈ నమ్మశక్యం గాని  శ్రమదానం ఎంతగా కదిలించిందో - అతని మాటల్లోనే - రేపటి సంచికలో చూడవచ్చు!

          6.25 కు విజయ జూనియర్ కళాశాలోపన్యాసకడు వేముల శ్రీనివాస గళ వినిర్గళ త్రివిధ స్వఛ్ఛ- సుందరోద్యమ నినాదాలూ,

         గ్రామ స్వచ్చోద్యమ సంచాలకుని ఆనంద పరవశ సమీక్షా వచనాలూ యధాతథంగానే!

         రేపటి మన శ్రమదానం కూడ NTR పార్కు - పెట్రోల్ బంకు - నడకుదురు రోడ్ల కూడలి నుండే!

         రోడ్ల కూడలి

కంటిలోని నలుసు రీతి - పంటి క్రింది రాయి వలే

అడుగడుగున కాలుష్యం, అంద విహీన తలన్నీ

అలముకొన్న చల్లపల్లి అనే గతం గుర్తుందా!

అది తప్పించుటకే మన అహర్నిశలు శ్రమదానం !

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   27.04.2023.