2751* వ రోజు....... ... .......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

నేటి(శుక్రవారం - 28-4-23) పని దినం సంఖ్య - @2751*

            ఇష్టపడి - ఇన్ని వేకువ కాలాలుగా ఆ పారిశుద్ధ్య కృషికి పాల్పడిన వారి నేటి సంఖ్యేమో 23 కు పరిమితం! ఎక్కడా చూడలేని - సామాజిక కోణంలో ఒక అత్యుత్తమ శ్రమదాన కృషికి ఏలాటి స్పందనున్నదో ఆ సంఖ్య తెలియజేస్తున్నది!

            ఒక మంచి పని కొనసాగించాలనుకొన్నప్పుడు - ఒంటరిగానైనా సరే సాగిపోఅని రవీంద్ర కవీంద్రుడు చెప్పిన సూక్తి ఇందిరా గాంధి వంటి ఉక్కు మహిళకు ప్రేరణనిచ్చిందంటారు! మరి - మన చల్లపల్లి చాల నయం కదా - 23 గ్గురైనా ఈ వేకువ 4.19 - 6.05 నడుమ - తమ కోసం కాక ఊరంతటి మేలు కోసం శ్రమించారు!

            అందుకు గాను వాళ్ళు వేకువ ఏ 3-3-30 కు మేల్కొన్నారో - ఈ బెజవాడ - నడకుదురు బాటల కూడలికి ఏ 2 - 3 కిలోమీటర్లు గడిచి వచ్చారో - ఎంత చెమట చిందించారో - అది వేరే కథ!

            స్వచ్చ కార్యకర్తల శ్రమదానానికి అంతిమ ప్రమాణమే మంటే ఏనాటికానాడు వాళ్ల అంతఃకరణ సంతృప్తే!

            బెజవాడ రహదారినీ, నడకుదురు బాటనూ కొంత శుభ్రపరిచినా, కార్యకర్తల నేటి శ్రమ కేంద్రీకరణ మాత్రం

1) పెట్రోలు బంకు,

2) NTR పార్కు వెలుపలి డ్రైనూ వద్దనే!

            బంకు లోపల సువర్ణ గన్నేరు పూల మొక్క బాగా పూచి పచ్చగా కళకళలాడుతున్నా, పైనున్న కరెంటు తీగల్నందుకోబోతున్నందున నలుగురైదుగురు సుందరీకర్తలకు ఆ పూల చెట్టు పనే సరిపోయింది! దగ్గర్లో ట్రాన్స్ఫార్మర్లుండమే అందుక్కారణం!

            ఈ నెలలో పడిన 2 అకాల వర్షాల ప్రోత్సాహంతో పూల మొక్కల కన్నా గడ్డీ - పిచ్చి మొక్కలెక్కువగా పెరగడం వల్ల - NTR పార్కు వెలుపలి మురుగు కాల్వ గట్లు దాదాపు పది మంది కార్యకర్తలకు పని కల్పించాయి! 

            ఒక ఖాళీ ఇసుక ఎడ్ల బండి స్వచ్ఛ - చల్లపల్లి ట్రాక్టర్ కు తగులుకొని, బళ్లవారి, ఏడెనిమిది మంది కార్యకర్తల ప్రయత్నంతో గానీ విడివడ లేదు!

నేటి శ్రమ సమీక్షా సమావేశంలో :

- మాలెంపాటి అంజయ్య గట్టిగా ఉరిమిన గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలూ - అందుగ్గానూ ఒకరు ఉలిక్కిపడడమూ,

- కోడూరి వేంకటేశ్వరావు గారి మనుమరాండ్రు - 5, 3 తరగతుల చిన్నారులు - సంవత్సరం పాటు తాము పొదుపు చేసి దాచుకొన్న కిడ్డీ - బ్యాంకులను చల్లపల్లి స్వచ్చోద్యమ ఖర్చులకు అప్పగించడమూ,

- మనుషుల కొచ్చే యోగం - భోగం రోగంలక్షణాలను అడపా గురవయ్య చమత్కరించడమూ.....

- ఇవన్నీ చూస్తుంటే ఈ గ్రామ స్వచ్ఛంద శ్రమదానం ఏదో భారంగా లాక్కొచ్చే బండి కాదనీ - సరదా ప్రయాణ మనీ ఎవరికైనా అర్ధం కావడమూ.....

            రేపటి శ్రమ త్యాగ నిమిత్తం మనం మరొక మారు విశాలమైన పెట్రోలు బంకు ఆవరణలోనే కలుద్దాం!

            కలలు సాకారం కావాలని

ఎప్పటికైనా గ్రామం తలరాతను మార్చాలను

క్రొత్త సంస్కృతిని ఊళ్లో క్రొత్త తరము కివ్వాలను -

సకలాంధ్రకు మోడల్ గా చల్లపల్లి నిలవాలను

స్వచ్ఛ కార్యకర్త కలలు సాకారం కావాలని....

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   28.04.2023.