2752* వ రోజు....... ... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

ఇది 2752* వ నాటి శ్రమదాన విశేషం!

            శనివారం (29-4-23) వేకువ 4.17 - 6.10 వేళల మధ్య 26 మంది శ్రమదాతల ప్రయత్నం విశేషమెందుకయిందంటే

1) స్వఛ్ఛ కార్యకర్తలకు తప్ప వేరెవరికీ అది అనువు కాని సమయం,

2) పని జరిగిన చోటులు కూడ మురుగ్గుంటలూ, ఉచ్ఛ కంపులూ విలసిల్లినవే తప్ప ఏమంత ఆహ్లాదకరం కానివి.

3) అసలీ వేసవి వాతావరణంలో - చెమటలు దిగగారుతున్న ఉక్కలో ఇంత చెత్త - దుమ్ము పనులెవరు చేస్తారు గనుక!

            ఈ శుభోదయాన డజను మంది కార్యకర్తలు తొలుత హాజరయింది రెండు రోడ్ల కూడలిలోని పెట్రోలు బంకు ఆవరణలో; మరో 14 మందితో గలిసి, పారిశుద్ధ్య కృషి నెరవేర్చింది సగభాగానికి పైగా నిన్నటి చోటనే!

            చేసిన చోటనే మళ్ళీ ఎందుకు వంగ వలసొచ్చిందంటే - ఒక కారణం పాఠశాల పిల్లలు ఈ ఏటికి బడి శని వదలిందనే సంతోషంతో ఆఖరి పని దినంచీటీలను చండ్ర వికాస కేంద్రం మొదలు చాల చోట్ల వెదజల్లడమైతే, గ్రామస్తుల - ప్రయాణికుల ప్రమత్తత మరో కారణం!

            నిన్న రాని ఇద్దరు సుందరీకర్తల ఆలోచనతో నిన్న అందగించిన, పెట్రోలు నిలయం దగ్గరే ఆరేడుగురికి ఫుల్ టైమ్ ఉద్యోగాలు (అనగా ప్రయత్నాలు) దొరికాయి. అక్కడి బండ రాళ్లను అమర్చడమూ, పూల కుండీల పునః సుందరీకరణాల వల్ల!

            రెవెన్యూ కార్యాలయం ప్రక్కన - అనావిష్కృత NTR విగ్రహం దగ్గర డజను మంది గంటకు పైగా చేసిన పారిశుద్ధ్యమే క్రొత్తగా చూసే వాళ్ల మనసులు జలదరించేది! ఎందుకంటే - ఆడ్రైను అలాంటిది డ్రైను గట్ల మీద జానెడెత్తున చేరిన కాలుష్యాల లాంటివి. ఇలాంటి శ్రమదాన దృశ్యాల్ని చూసే గదా చాల మంది ఈ ఉద్యమాన్ని అనితరసాధ్యంఅనేది!

            ఇక - చండ్ర వికాస కేంద్రం దగ్గర్నుండి బెజవాడ రోడ్డు మీది కాగితమ్ముక్కల ఘనత స్కూలు పిల్లలదైతే - విసుగూ విరామం లేక, ఏరి - ఊడ్చి - డిప్పల్తో ఎత్తిన ఓర్పు 4 గురు కార్యకర్తలది!

            నేటి పాతిక మంది శ్రమ విలాసాల్ని నేను వివరించడం కన్నా - ఇద్దరు ముగ్గురు కరుడుగట్టిన కార్యకర్తలు ఇరుకు మురుగ్గుంట దగ్గర - ఎంత దట్టమైన అంక ఛండాలపు కశ్మలాన్ని కూర్చొని ఎలా తొలగిస్తున్నదీ మచ్చుకొక వాట్సప్ ఛాయా చిత్రంలో చూడండి!

నిన్నటి చిన్నారులిద్దరి కిడ్డీ బ్యాంకులసంగతి:

ఆ లెక్క 505, 678 రూపాయలుగా తేలింది. ఇవేవో చిన్నపాటి మొత్తాలూ, చెప్పుకోదగని త్యాగాలుగా అనుకోవద్దు అంత చిన్న వయసు వాళ్ల సామాజిక బాధ్యతగా భావించండి!

            నేటి గ్రామ స్వచ్చ - శుభ్ర - సౌందర్య నినాదాల పాఠాలు వల్లించిన ఉపాధ్యాయిని శ్రీమతి కోట పద్మావతి!

            రేపటి వేకువ మన కలయిక రెవిన్యూ కార్యాలయం ఆవరణలో!

            ఎవరు సాహసించినారు

ఎవరు సాహసించినారు ఈ నికృష్ట మురికి పనికి?

ఎవ్వరు పాల్పడగలరీ వేకువ శ్రమదానాలకు!

ఎంతటి పట్టుదలుంటే - ఇదొక ఉద్యమముగ సాగు!

ఊరు పట్ల ఎంత శ్రద్ధ ఈ రీతిగ పరిణమించు?

           

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   29.04.2023.