2753* వ రోజు....... ... ... ....

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్కులు వాడనేల?

42 మందికి చెందిన 2753 వ నాటి స్వచ్చ సుందరోద్యమం.

         ఇది ఆదివారం, (30-4-23) అది రెవిన్యూ కార్యాలయ ప్రాంగణం, తొలుత 4.15 కే అక్కడ కనిపించిన 14 మంది కాక - 3 ప్రక్కల్నుండి - 3 ఊళ్ల నుండి వచ్చిన 22 మంది కాక పని ముగింపు దశలో బందరు నుండి 5 గురూ, 108 వాహనానికి చెందిన 3 గ్గురూ (ఈ చివరి వాళ్లు పావుగంట వంగి పనిచేశారు కూడ!) - అలా చివరి మీటింగు వేళకు సమూహం సంఖ్య 40 దాటింది!

         ఇటీవలి రోజుల్లో ఐతే - ఇలా ప్రతి వేకువ సమయాన నిర్దిష్ట వీధిలో పాటుబడే వాళ్ల లెక్క 25 - 30 మధ్య, శని, ఆది వారాల్లోనైతే 30 - 40 నడుమ ఉంటున్నది.

         చల్లపల్లిలో కాక వేరే చోట్లనైతే ఇది పెద్ద సంఖ్యే - ఎలాగంటే - చాల మీటింగులకి పాల్గొనే వాళ్లకు లంచాలిచ్చి - బ్రతిమాలి తెచ్చుకొనే పరిస్థితి ఉంది. మరి చల్లపల్లి శ్రమదానమైతే - అది పూర్తి స్వచ్చందం - పైగా స్వచ్ఛ కార్యకర్తలే తమ శ్రమతో బాటు - ఇవ్వగలినంత ధనవస్తు సహకారం గ్రామం మంచి కోసం ఇస్తుంటారు!

         అలా కాక ఈ మురికి, కరకు శ్రమదానం కోసం 2753* రోజులు ఎవరు ఎవర్నైనా మొహమాటపెట్టో, ప్రలోభపెట్టో రప్పించగలరా?

         ఇంతకీ ఈ ఆదివారం వేకువ ఇందరు కార్యకర్తలు తమ ఊరికి చేసిన నిర్వాకమేమిటి? అంటే :

1) రెవెన్యూ కార్యాలయం బైటా,

2) మండల ప్రజాపరిషత్ వెలుపలా, లోపలా

3) నడకుదురు బాట జంక్షన్ మొదలు బైపాస్ వీధి వరకూ అపరిశుభ్రతల అస్తవ్యస్తాల - కశ్మలాల నడ్డి విరగ్గొట్టడమే! అది దుర్గంధ మయ మురుగు కాల్వ గావచ్చు - గోడలకానించి వదిలిన మూత్ర విసర్జనల చోటులు కావచ్చు - ఎంగిలాకుల ఆహార వ్యర్థాల కంపులు కావచ్చు తొమ్మిదేళ్ళుగా రాటుదేలిన కార్యకర్తలకేం లెక్క?

         వాళ్ళింత కన్నా క్లిష్టమైన బస్ ప్రాంగణాలూ, శ్మశానాలు ఎన్నిటి మురికి వదలగొట్టలేదు?

         ఈ అనేక వృత్తుల వాళ్ల ప్రవృత్తి ఒక్కటే - అది తమ ఊరు అన్ని విధాలా శుభ్ర -సుందరంగా – నివాసయోగ్యంగా మారాలనే!

         ఈ వేకువ - ఇందరి శ్రమ ఫలితంగా రెవెన్యూ భవనాల పరిసరాలు బాగుపడిన ఋజువుగా - ఒక పెద్ద ట్రాక్టర్ నిండుగా సకల వ్యర్థాలతో చెత్త కేంద్రానికి

చేరింది!

         ధ్యానమండలి తరపున రాయపాటి రమ గారి స్వచ్చోద్యమ నినాదాలు వెలువడ్డాయి!

         6.10 కి పని విరమించి, మండలాభివృద్ధి కార్యాలయ ద్వారం వద్ద జరిగిన సమీక్షా సభలో:

         బందరు నుండి కైనటిక్ హోండా విద్యుద్వాహన విక్రేతల వ్యాపార విషయమూ, కార్యకర్తల్లో ఒకరిద్దరా ద్విచక్ర వాహన కొనుగోలుకు ముందుకు రావడమూ, నేటి శ్రమదాన సమీక్షలతోబాటు –

         బుధవారం ఉదయాన అందరం HDFC బ్యాంకు ఆవరణలో కలిసి విజయవాడ బాట స్వచ్ఛ – సుందరీకరణ కొనసాగించాలనే నిర్ణయమూ జరిగాయి!

         అందని ద్రాక్షో ఐతే

ఇదొక వేళ అసాధ్యమో - అందని ద్రాక్షో ఐతే

అతిలోకమొ - అసంబద్ధ, ప్రేలాపనమో ఐతే

ఈ సాదా మనుషులెట్లు అవలీలగ చేసినారు?

ప్రజ్వలించు శ్రమ సంస్కృతి బాటనెలా నిర్మింతురు?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త – N. రామారావు,

   30.04.2023.