2758* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

సంఖ్యాపరమైన లోటులో 2758* వ నాటి స్వచ్ఛోద్యమం!

            శుక్రవారం (5-5-23) నాటి ఇబ్బంది అది! చాలా మాసాలుగా 20 కన్నా తగ్గని స్వచ్ఛ కార్యకర్తల బలగం ఈ వేకువ 19 కి కుదించుకున్నది! ఒకే ఒక్క మహిళా కార్యకర్తతో బాటు - 8 మంది హాజరు 4.20 కే - HDFC బ్యాంకు వద్ద!

సంఖ్యకూ స్ఫూర్తికి సంబంధం లేకుండా :

1) సాగర్ టాకీస్ సినీ ప్రదర్శన శాల మార్గంలో 5060 గజాల దాకా,

2) బందరు జాతీయ రహదారిలోని బురద మట్టి పనీ సజావుగా జరిగిపోయినవి.

3) బైపాస్ వీధిలోని మండల పాలనా కార్యాలయం దగ్గరి ఉద్యానవనంలో - టాన్స్ఫార్ల దగ్గర గలీజు సైతం తొలగిపోయింది.

            నలుగురు బందరు బాటలోని ఎండిన మురుగు మట్టి ఎన్ని ట్రక్కులెత్తి వచ్చారో తెలియదు గాని, 5.30 కు వాళ్లు బైపాస్ వీధిలో కార్యకర్తల కత్తులకూ, దంతెలకూ, చీపుళ్లకూ బలై పడి ఉన్న గుట్టల్నెత్తి ట్రాక్టర్ నింపారు.

            బ్యాంకు ముందు లారీ చక్రాలు దిగి, గుంటలు పడ్డ మార్జిన్ ను ఒక ఎక్కటి వీరుడు గంటన్నరలో సమతలం చేశాడు!

            గత 10 రోజుల్లోని అకాల వర్షాల వల్లనేమో ఏడెనిమిదేళ్ల స్వచ్చ కార్యకర్తల ప్రణాళికాబద్ధ కృషితో ఏర్పడ్డ బైపాస్ రోడ్డు ప్రక్కన ఉద్యానాలు పసిమి మిసిమితోను రంగు రంగుల రకరకాల పూల కలిమితోను కళకళలాడుతున్నాయి!

            ఈ వేకువ కార్యకర్తల శ్రమతో వీధీ, దాని మార్జినూ బాగుపడి ఆ వీధి శోభ ఇనుమడించింది. మరి, పదే పదే మన DRK వైద్యుడు ప్రస్తావించేట్లూ, నా బోటి వాడెవడో శ్రమ మూల మిదం జగత్అని ప్రాత సామెతను తిరగ వ్రాసినట్లూ ఇందరి నిస్వార్థ శ్రమ ఊరికే పోతుందా?

            చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదానంలో ప్రస్తుత లోపమొక్కటే - క్రొత్త కార్యకర్తలు, ముఖ్యంగా యువతీయువకులు అంతగా ప్రవేశించకపోవడమే!

            ప్రస్తుత మేమాసంలో అధికంగా పెళ్లి ముహూర్తాలున్నవట! నేటి కార్యకర్తల సంఖ్యా బలం సన్నగిల్లడానికదొక కారణమైతే - ముగ్గురు వైద్యులూ, ఇద్దరో ముగ్గురో నర్సులూ

1) అనారోగ్య,

2) ఆస్పత్రి డ్యూటీ సమస్యల వల్ల రాలేకపోయింది రెండో కారణం!

            6.30 కి పని భారంతో నీరసించిన బృందావన వైద్య సహాయకుడు గట్టిగానే ముమ్మారు వినిపించిన స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలూ,

            ఒకరిద్దరి సమీక్షా వచనాలతోబాటు శనివారం నాటి శ్రమ పాఠంభం కూడ HDFC బ్యాంకు నుండే అనే నిర్ణయమూ జరిగిపోయినవి!

     ఊరి పరువు శ్రమతోనే నిలుచునయా!

చలన చిత్రములలో వలె - స్వప్నలోకమందు వలే

కాల్పనిక కవిత్వం వలె కట్టు కథారచనల వలె

స్వచ్చోద్యమ ముండదయా! శ్రమతోనే సాధ్యమయా!

ఒంటి బిగువు - ఊరి పరువు శ్రమతోనే నిలుచునయా!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   05.05.2023.