2759* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

శనివారం – (6-5-23) వేవ కాలపు శ్రమదాన విశేషాలు - @2759*

        చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమంలో విశేషాలన్నీ సశేషాలే! 2-3 వేల వేకువ సమయాల మూణ్ణాలుగు లక్షల పని గంటల - సగటున 30-40 మంది శ్రమదాతల - ఏదో పనీ - పాటూ లేక కాదు గ్రామ సమాజ కర్తవ్య నిష్టాగరిష్టుల కృషిలో విశేషాలకేం కొదవ? అట్టివానిలో కొన్ని:

- నిన్నటి నిర్దేశిత బైపాస్ మార్గ శుభ్ర సుందరీకరణమే ధ్యేయంగా బ్రహ్మకాలమైన 4.15 కే 9 మంది HDFC బ్యాంకు దగ్గరకు చేరిక;

- నిముష క్రమంలో మరో 18 మంది కలయిక;

- అక్కణ్ణుండి నారాయణరావు నగర్ ప్రధాన వీధి దాక గంటన్నరకు పైగా స్వచ్ఛ కార్యకర్తల అపూర్వ శ్రమదాన దృశ్య మాలిక;

- దాలిపర్రు గ్రామస్తుడు బొందలపాటి శివ నాగేశ్వరావుతో బాటు హైదరాబాదు నుండి చుట్టపు చూపుగా వచ్చిన 10 వ తరగతి విద్యార్ధిని - వర్షశ్రీ నుండి చల్లపల్లి వీధికి దక్కిన శ్రమ వేడుక;

- బురదో, ఎంగిలాకులో, ఎన్నెన్ని రకాల కశ్మలాలో.. వేటికైనా సిద్ధపడిన ముగ్గురు డాక్టర్ల, సర్పంచి కుటుంబీకుల శ్రమదానోద్యమ ప్రవేశిక!

- మరొక విశేషం అగ్రహార ప్రముఖ వీధి బైపాస్ రోడ్డు మీదికి దిగే చోట నలుగురు సుందరీకర్తల గట్టి కృషితో బాటసారులకు, వాహన చోదకులకూ సౌకర్యాల అమరిక!

- ఇక అన్నిటినీ మించిన విశేషం కాంట్రాక్టర్ నాదెళ్ల వేణుకు ప్రభుత్వ ఖజానా నుండి ధనప్రాప్తి!

- అలాగని, ఆరేడు మంది కార్యకర్తలు నాలుగైదు గజాల పురుగుడు తీగల చుట్టను ట్రక్కులోని కెక్కించిన దృశ్యం తక్కువదేమీ కాదు!

        అసలీ పనులన్నిటికీ తూర్పు నుండి సూర్యనారాయణుడూ - పడమర నుండి అస్తమయ పూర్ణచంద్రుడూ ఒకేమారు సాక్షులుగా నిలిచిన మరొక ప్రాకృతిక విశేషం!

నాదేం పోతుంది - ఎన్ని పేజీలైనా నింపగలను –

ఇక 6.30 సమయపు సమీక్షా సభా విశేషాలు:

1) కృష్ణకుమారి - రాజేంద్రల తనయుడి నీలేష్ కృష్ణ జన్మదిన వేడుకను స్వచ్ఛ కార్యకర్తల సమక్షంలో జరపడమూ – ఆ మంచి సందర్భంలో స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం 1000/- విరాళమూ - సదరు జన్మదిన యువకునికి శ్రమదాతలందరి ఆదరాభిమాన పూర్వక ఆశీస్సులూ, స్వీట్ల పంపకమూ

2) డంపింగ్ యార్డులో సిమెంట్ రోడ్డుని వేయించి, శ్రమించిన, నేటి ఆర్థిక విజేత - నాదెళ్ల వేణుకు అందరి అభినందనలూ

3) ముక్కూ - మొహం తెలియని ఊరి వీధికి స్వచ్చ సేవనందించిన వర్షశ్రీకభినందనమూ

4) DRK గారు సమీక్ష నడుమ - ఐదారేళ్లనాటి కార్యకర్తల కఠినతర మురుగు పనుల్ని గుర్తు చేసి ఆశ్చర్యపోవడమూ వంటి విశేషాలెన్నో!

        రేపటి - ఆదివారపు శ్రమదానం కొరకు బైపాస్ వీధిలోని నారాయణరావు నగర్ ముఖ్య వీధి దగ్గరే కలుద్దాం!

        స్వచ్చోద్యమ ప్రయత్నం!

ఒద్దికగా పద్ధతిగా - పూదోటల ఉద్ధృతిగా

దోమ ఈగ - మురుగు కంపుతో నిండని గ్రామంగా

కులమతాల కుళ్లు లేని గొప్ప సమాజంగా ఈ

చల్లపల్లి నెట్లైనా సరిదిద్దాలనే గదా!               

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   06.05.2023.