2760* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

2760* సంఖ్యకు చేరిన గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమం!

        ఆదివారం నాడు (7-5-23) - 36 మంది శ్రమదాన కర్ణులు 4.20 - 6.12 నడుమ సాగించిన సామాజిక బాధ్యత అది. బైపాస్ వీధిలోని నారాయణరావు నగర్ ప్రధాన వీధి మొదలు - ఒక కట్టెల అడితీ, మరొక భవంతి మినహా - సాగర్ సినీ ప్రదర్శనశాల దాక – సకల విధ కశ్మలాల మీద స్వచ్ఛతా పోరాటమది!

        ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చల్లపల్లి సంబంధీకులు ఇప్పటికీ నమ్మలేక సందేహిస్తున్న విషయం ఈ 2760* నాళ్ల అవిచ్ఛిన్న శ్రమదానం కాదు; ఇన్నేళ్ల – ఇన్ని నాళ్ల - ప్రతిరోజూ 30 - 40 మంది కార్యకర్తల చిత్తశుద్దీ  కాదు; వాళ్లెన్నుకొన్న పనివేళ మాత్రమే!

        “ఈ పిదప బుద్ధుల - పిదప రోజుల్లో అసలెవరు మేల్కొంటారు వేకువ 3.30 కు ముందే? ఉన్న ఊరికి ఉడతా సేవచేస్తున్న ఒకే ఒక్క మనః తృప్తి తప్ప – ఏదీ ఆశించక - నిర్ణీత 4.30 కాలం కన్న ముందే - 4.15 కే గ్రామంలో ఏదో ఒక మురుగు కాల్వనో – శ్మశానాన్నో - రహదారి గుంటల్నో సంస్కరించేందుకు ఎలా చేరుకొంటారు? అసలా ముహూర్తం కాయకష్టం చేయదగిందేనా ?....” అనేదే వాళ్ల ధర్మ సందేహం!

        మరి - ఈ స్వచ్చ - సుందర కార్యకర్తలెవరు? పగలు తీరికే చిక్కని గృహిణులు, ఉద్యోగులు, డాక్టర్లు, రైతులు, నర్సులు, తదితర వృత్తికారులు! ఈ అందరికీ అమవైన - అలవాటైన - ప్రశాంతమైన, శక్తి వంతమైనదే ఈ బ్రహ్మ ముహూర్తం!

        ఈ ఆదివారపు ముఖ్య శ్రామిక ప్రదేశం బైపాస్ వీధే గాని – పాతిక ముప్పై మంది శారీరక – మేధో శ్రమ సమర్పణం 150 గజాల బాటే గాని, నలుగురైదుగురు మాత్రం అత్యవసరం ఆహ్వానిస్తే బందరు రహదారి మీద మురుగు మట్టిని ఎత్తి, దానవసరం పడిన గంగులపాలెం వీధిలోకి చేర్చి వచ్చారు; ప్రధాన శ్రమదాన స్రవంతిలో కలిసి - వ్యర్థాల లోడింగుకు పూనుకొన్నారు!

        బెజవాడ - బందరు మార్గాలను అనుసంధానించే బైపాస్ వీధిలో ఎవరు - ఎక్కడ – ఏ మురుగు పనికి దిగారో, వ్యర్ధాల కంపులు భరించారో, ఎవరి బట్టలు ఎంతగా చెమటకు తడిసి, మట్టి కొట్టుకుపోయాయో - ఎవరి వదనాలు మనః సంతృప్తితో కళకళలాడినవో - పేరుపేరునా వివరించాలని ఉన్నా - ఈ కాగితమ్మీద స్థలం చాలడం లేదు! ఎప్పటికైనా - తీరుబడిగా ఈ శ్రమదాన వైభవాన్ని గురించి ఒక నాటకమో - కావ్యమో - నవలో వ్రాస్తే తప్ప – ఈకాస్త చోటులో చెప్ప వీలుకావడం లేదు!

        ఐనా – 9 ½ ఏళ్ళ నాడు గంగులపాలెం వీధిలో అంకురార్పణ జరిగిన - సొంత ఊరి సంస్కరణే ధ్యేయంగా సాగుతున్న ఈ శ్రమదానం గురించి - చల్లపల్లిలో ఎవరికి - ఏమని వర్ణించి చెప్పాలి? “వీలైన ప్రతీపౌరుడూ - వీలైన రోజున ఒక్కగంటైనా వీధి పారిశుద్ధ్యానికి రండి మహాప్రభో!” అని ఎన్ని మార్లు బొట్లు పెట్టి పిలవాలి?

        6.35 కు 34 మంది శ్రమ సందేశకర్తల సమక్షంలో ఆహ్లాదకరంగా జరిగిన ముగింపు సమావేశంలో :

        BSNL నరసింహారావు తీరుబడిగా మ్రోగిన గ్రామ స్వచ్ఛ - సుందర సంకల్ప నినాదాలూ,

        ఏడెనిమిదేళ్ళుగా ఈ బైపాస్ వీధికి ఇందరు కార్యకర్తల శ్రమ వివరాలను శ్రమదానోద్యమ ప్రారంభకుడు ప్రస్తావించడమూ,

        భావుకుడైన ఆస్థాన గాయకుడు అలపించిన పాటలూ,

        బుధవారం వేకువ శ్రమదాతల కలయిక సాగర్ టాకీస్ ఎదుటి రోడ్డులో అనే నిర్ణయమూ –

        ఊరికి శని పట్టిందా!

ఏ అదృష్టమో పట్టీ ఇంత మంది కార్యకర్త

లిన్నేళ్లుగ చల్లపల్లి నీ రీతిగ మార్చుతుంటె

సదాచార మందు కొనక – సగం మంది పట్టనట్లు

ఉండడమా - ఇదేం ఖర్మ! ఊరికి శని పట్టిందా!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   07.05.2023.