2761* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

2761* - అనగా సోమవారపు రెస్క్యూ సేవలు!

            8-5-23 వేకువ సంత వీధి సువ్యవస్థీకరణ కోసం - 4.30 కే సినిమా హాలు దగ్గరున్న 5 గురు కాక, మధ్యలోనూ - పని ముగింపు దశలోనూ - మొత్తం 8 మందితో కూడిన వీధి కృషి అది!

            చల్లపల్లి, రామానగరం, దూరంగా ఉన్న శివరామపురం అనే 3 ఊళ్లకు చెందిన కార్యకర్తలు పని కొట్టుకొని, రైతు బజారులోని పోలీసు కార్యాలయాల వద్ద సంత రోజున వేల మంది సౌకర్యార్థం గంటన్నర పాటు చేసిన శ్రమ!

            అయాచితంగా దొరికిన పెంకులు రాతి ముక్కలు - సిమెంటు మిశ్రాల రద్దును ట్రక్కులో నింపుకొని, ఒక ప్రైవేటు ఆస్పత్రి నర్సు గారి అభ్యర్థన మేరకు నారాయణరావు నగర్ లోని ఆమె వీధి గుంటల్లో సర్ది వచ్చిన రెస్క్యూ టీం సభ్యులు అభినందనీయులు!

            మళ్లీ ఈ బృందంలో పొరుగూరి కార్యకర్తకూ, వయోధికునికీ కొంత అనారోగ్యాలు కూడ!

            వాళ్ళ చిన్నపాటి సమస్యలు ప్రక్కన బెట్టి, వేకువ సమయాన నడుం బిగించి, ఉక్క వాతావరణంలో చెమటలే చిందించారో - ఒంటికీ, బట్టలకీ దుమ్మే అంటించుకొన్నారో - ఏమైతేనేం తామనుకొన్న గ్రామ సామాజిక ప్రయోజక కృషి నెరవేర్చారు గదా?

            చల్లపల్లి గ్రామం పట్ల తమ స్వచ్చ - శుభ్ర సౌందర్య సంకల్పాన్ని చాటే నినాదాలను కస్తూరి శ్రీనివాసుడు అందుకొనగా - అందరూ బదులు పలికి 6.30 దాటాక ఇళ్లకేగారు.

   శ్రమ సంస్కృతి బాటనొకటినిర్మిస్తే

కదులుతున్న స్వచ్చోద్యమ ఘన రథాన్ని గమనిస్తే

ప్రతి వేకువ వీధుల్లో శ్రమదానం పరికిస్తే

వర్తమాన - వర్ధమాన సమస్యలకు స్పందిస్తే

ప్రజ్వలించు శ్రమ సంస్కృతి బాటనొకటినిర్మిస్తే.....

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

08.05.2023.