2762* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

మంగళవారం(9-5-23) నాటి వీధి పారిశుద్ధ్యం - @2762*

            పారిశుద్ధ్య కర్తలు 6గురు, కార్మిక కాలం 4.31 - 6.00 నడుమ, స్థలం నిన్నటి వలెనే - అనగా సంత/రైతు బజార్ రోడ్డు దగ్గర!

            ఎత్తింది పెద్ద బండెడు రద్దు, అద్దానిని చేర్చింది 2 కిలోమీటర్ల దూరంలోని నారాయణరావు నగర్ వీధిలోనికి, అది ఉపయోగపడింది.......కి!

            మనం గుర్తించవలసిందీ. పదే పదే ఆలోచించ దగ్గదీ - ఈ సంఖ్యలు కాదు, కాలమానాలు కాదు, శ్రమ కొలతలు కావు, మొహమాట పడి కీర్తించదగింది చల్లపల్లి స్వచ్చోద్యమాన్ని కూడ కాదు!

            స్వచ్ఛ కార్యకర్తలు 9 ½  ఏళ్లుగా తమది కాని పనికి ఎందుకింత దీక్ష పూనాలి? సొంత సమయ ధన - శ్రమ - దమాదివి ఊరి కోసం ఎందుకు ఖర్చుపెట్టాలి? ఈ కార్యకర్తలేమైనా అధికారులా? మహానేతలా ? పరి పాలకులా? ఏ హోదాతో ఇంతటి గ్రామసేవలు?.... అని మాత్రం అందరం లోతుగా ఆలోచించాలి, చర్చించాలి!

            అను నిత్యం గ్రామ సమాజం పోకడలు  గుర్తించీ, మరిన్ని మంచి సౌకర్య కల్పన గురించీ మధనపడే స్వచ్ఛ కార్యకర్తలదేముంది - వాళ్లు యధాప్రకారంగానే

- గంటన్నర పాటు కఠిన శ్రమపడ్డారు,

- పైకెగుస్తున్న దుమ్మూ ధూళీ పీలుస్తూనే బరువు - తేలిక పాటి రాళ్లనూ - రద్దునూ ఎత్తి, ట్రక్కులో చేర్చవలసిన చోటికి చేర్చారు,

- 6.25 కు మళ్లీ గస్తీ గది దగ్గర తూములూరి లక్ష్మణరావు స్వచ్చ సుందర నినాదాలకు బదులిచ్చారు,

- తాతినేని వేంకటరమణుని అల్పాహార సత్కార మందుకొన్నారు.

            మన రేపటి స్వచ్ఛ - సుందరోద్యమం సాగర్ టాకీస్ దగ్గర్నుండే మొదలుకానున్నది!

            వినీతమా - పునీతమా -

ప్రచలితమా - విచలితమా స్వచ్చోద్యమ చల్లపల్లి?

ప్రమోదమా - ప్రమాదమా - బ్రహ్మ సమయ శ్రమదానం

వినీతమా - పునీతమా - స్వచ్ఛ సైన్య పోరాటం?

విశేషమా సశేషమా - వీరోచిత శ్రమదానం?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  09.05.2023.