2763* వ రోజు....... ....

  పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

10-5-23 నాటి స్వచ్ఛోద్యమ పని దినాల వరుస సంఖ్య 2763*

            బుధవారం సైతం అష్ట సంఖ్యాక కార్యకర్తల పని వేళ 4.16 నుండి 6.05 నడుమే! వాళ్ళకు మరో 10 -11 మంది మాత్రమే తోడయ్యారు; ఊళ్లో వార్డుల సంఖ్య - 20 కన్నా కూడా నేటి శ్రమదాతల సంఖ్యే తక్కువ!

            అందుకొక చిన్న కారణం వాతావరణమైతే, పెద్ద కారణం బాగా ముమ్మరించిన పెళ్లిళ్లు!

            పని చేయక కూర్చున్నా, నించున్నా చెమటలు దిగ కారే ఉక్క సంకట స్థితి! ఇక గంటన్నరకు పైగా కత్తుల్తో, దంతెలతో, వంగీ - కూర్చోనీ - డ్రైనుల్లో దిగీ - డిప్పల కొద్దీ పనికిమాలిన పిచ్చి, ముళ్ల మొక్కల్ని నరికీ గుట్టలు పేర్చీ - ప్లాస్టిక్ వంటి ఎంగిలి పదార్థాలను ఏరీ - శ్రమించిన స్వచ్ఛంద శ్రమ ప్రదాతల సంగతి చెప్పాలా?

            వాళ్లు ఈ వేకువ ఆగింది సాగర్ టాకీసు మూలమలుపులో! పూనుకొన్నది రెండు భవంతుల, కట్టెల దుకాణాల 50 - 60 గజాల బైపాస్ దారి వ్యర్ధాల పని పట్టడానికీ, సుందరీకరణం సంగతి తేల్చడానికీ, రోడ్డు కూడలి సౌకర్యాలు పెంచడానికీ!

            వీరిలో - ఎవరెంత చెమటలు కార్చినా, మాటిమాటికీ మంచి నీళ్లు ఖర్చుపెట్టినా, కళ్లు - ముక్కుల మీదికి జారే స్వేద బిందువుల్ని తుడుచుకొంటూ, నా లెక్క ప్రకారం ఊరి కోసం శ్రమ తపస్సు చేస్తూ నేటి తమ లక్ష్యాన్నందుకొన్నారు!

పని వివరాల్లోకి పోతే:

1) రోడ్డు రెండు ప్రక్కలా అడితి వారు కాబోలు - దాచిన సిపాయి నిచెన్ల అండ చూసుకొని - ఇటీవలి వర్షాలకు గుబుళ్లుగా ఏపుగా పెరిగిన, అల్లుకొన్న గడ్డినీ - తీగల్ని తొలగించిన ఆరేడుగురూ,

2) బాట మార్జిన్లలోనూ, మురుగు కాల్వల అంచుల్లోనూ బలుస్తున్న మొక్కల్నీ, డ్రైనులోని అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాల్నీ అంతు చూసిన ఐదారుగురూ,

3) నాల్గు రోడ్ల కూడలి వద్ద గడ్డి చెక్కీ, అంతకుముందొకమారు సరిజేసినా రెండు ప్రక్కలా పడిన గుంటల్ని పూడ్చీ, చదును చేసి పాటుబడిన నల్గురు శ్రామికులూ,

4) బాట నూడ్చిన చీపుళ్ల వారూ, సకాలంలో బండెడు వ్యర్థాల్ని డిప్పల్తో ఎత్తి - మోసి ట్రక్కులో నింపిన లోడింగు ముఠా....

            ఎవరు మాత్రం అభినందనీయులు కారు? పంచాయతీ వల్ల సాధ్యపడక - ఎవరిళ్ల ఎదుట వాళ్లు శుభ్రపరుచుకొనక - తమ వీధిలో - దుకాణాల, ఇళ్ల ముంగిట వేరెవరో శుభ్రపరుస్తుంటే పట్టించుకోక - పేరుకుపోతున్న మురికిని నిర్లక్ష్యం చేస్తున్న కొందరు గ్రామస్తులు మాత్రం గుర్తించదగిన వాళ్లు కారా?

శ్రమ సందడి ముగిసి, కాఫీల సరదా గడిచి, 6.25 కు జరిగిన సమీక్షా సభలో:

- కార్యకర్తల అరుదైన శ్రమదానాన్ని సమీక్షకుడు ఆశ్చర్యపూర్వకంగా గుర్తించడమూ,

- శివబాబు నామక కార్యకర్త గ్రామ స్వచ్ఛ శుభ్ర - సౌందర్య సంకల్పాన్ని నినాద రూపంలో ప్రకటించడమూ,

            మన రేపటి వేకువ పారిశుద్ధ్య కృషి కోసం సాగర్ టాకీస్ మూలలోనే కలువాలనే నిర్ణయమూ.....

శుభమస్తు - విజయోస్తు - నిర్విఘ్నమస్తు!

స్వచ్చోద్యమ చల్లపల్లి సమరాని కవిఘ్నమస్తు!

బ్రహ్మకాల శ్రమదాన ప్రస్థానం శుభమస్తు!

గ్రామ స్వచ్ఛ సౌందర్యాకాంక్షలకును విజయోస్తు!

నవవసంత అవిశ్రాంత దీక్షకు నిర్విఘ్నమస్తు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   10.05.2023.