2764* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

అప్రతిహతంగా ఊరి స్వచ్ఛ - సుందరోద్యమం – 2764*

            గురువారం (11-5-23) నాటి సదరు ఉద్యమ కారులు 24 మంది; ప్రారంభం వేకువ 4:15; ముగింపు 6:10, కార్యాచరణ స్థలం సినిమాహాలు ఉత్తర భాగం.

            4.15 కే కార్యక్షేత్రం చేరుకొనే ముందు వాళ్లెన్నింటికి మేల్కోన్నారో ఇతర పనులు త్వరగా ముగించారో వేటిని తాత్కాలికంగా వాయిదా వేసి, సామాజిక బాధ్యతకు పూనుకొన్నారో - కొన్నిటిని నేనూహించగలను! కార్యకర్తల సంకల్పానికి స్వార్ధాలూ - సొంత పనులూ ప్రక్కకు తప్పుకోవడం నేనెఱుగుదును!

            ఈ నాటి లోక రీతికి భిన్నంగా ఇందరు కార్యకర్తలు పూనుకొనడమే చల్లపల్లికి అదృష్టం! తొమ్మిదేళ్లకు పైగా ఆ అదృష్టం అవిఘ్నంగా కోనసాగడమే సామాజిక పరిశోధకులకు ఆశ్చర్యం! ఐతే - అనాయాసంగా, అయాచితంగా, అప్పనంగా తమ ఊరి వీధులూ - పరిసరాలూ పరిశుభ్ర సౌందర్యాల కాలవాలమైనందున ఇప్పటికీ కొందరు గ్రామస్తుల చిన్న చూపుకు కారణం?

            శారీరక శ్రమదానం విలువ తెలియకనా? సామూహిక సామాజిక ప్రయోజనకర సత్కార్యాచరణం నచ్చకనా? గ్రామస్తుల్లో ఇప్పటికీ సగం మంది ఎందుకీ స్వచ్ఛంద సేవా విధికి దూరంగా ఉంటున్నట్లు?

            ఈ బ్రహ్మకాల శ్రమదానంతో ముఖ్యంగా రెండు చోట్లు తమ కాలుష్య భారాన్ని తగ్గించుకొన్నాయి!

1) సినీ ప్రదర్శనశాల ఉత్తర భాగం ఆ మధ్య అక్కడి తొలగించిన గుడిసె పరిసరాలు ఎంత శ్రమిస్తే ఈ మాత్రంగా కనిపిస్తున్నవి?

2) CPM కార్యాలయ వీధి చిన్నదే గాని పిచ్చి చెట్లు, ప్లాస్టిక్ తుక్కులూ పెద్ద మొత్తమే!

3) ఆ వీధి పడమర సందులోని గుబురు చెట్లనూ, తీగల్నీ తొలగించేందుకూ - ఊడ్చేందుకూ డిప్పల కొద్దీ వ్యర్ధాలెత్తి - మోసి - ట్రక్కు నింపుకొనేందుకూ డజను మందికి గంట కాలం పట్టింది!

శ్రమదానానంతర సమావేశంలో:

1) భాగ్యనగర నివాసినీ, పదో తరగతి విద్యార్థినీ, వీరమాచనేని వర్షశ్రీ చిన్నతనంలోనే పాటుబడుతున్న సామాజిక కర్తవ్యానికి గుర్తింపు,

2) అడపా గురవయ్య ప్రవచిత సూక్తుల వల్లింపు,

     గట్టిగా స్వఛ్ఛ సుందరోద్యమ నినాదాల మ్రోగింపు,

3) నూతక్కి శివాబాబు క్లుప్తంగానూ, సూటిగానూ మూడు నీతి వాక్యాల పూరింపు.   

4) రేపటి వేకువ శ్రమదాన కేంద్రం సాగర్ బైపాస్ వీధిలో ఒకప్పటి చల్లపల్లి వైద్యశాలపరిసరాలనే ప్రకటన!

            అత్యద్భుతమనిపిస్తది!

ఎవరైనా చేయదగినదీ మాత్రం శ్రమదానం

కాకుంటే విడివిడిగా బిడియంగా తోస్తుందది

సామూహిక శ్రమ వేడుకె చాల సులభమనిపిస్తది

అది స్వార్థం లేనిదైతే అత్యద్భుతమనిపిస్తది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   11.05.2023.