2765* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

గ్రామ కాలుష్యం మీద నేటి సమరం 2765* వ నాటిది!

            ఈ శుక్రవారం వేకువ 4:196:06 నడుమ విజేతలైన కార్యశూరులు 21+2 మంది! (ఈ చివరి ఇద్దరూ అతిథి దేవోభవులనుకొందాం!)

            సాగర్ టాకీసు రోడ్డులో - మెండు/తటవర్తి ఇళ్ల పరిసరాల్లో వ్యర్ధాల్నీ, పిచ్చి - ముళ్ల మొక్కల్నీ తీగల్నీ వదిలించుకొని, 100 నిముషాల పోరు పిదప పరిశుభ్ర సుందరంగా మారిన చోటు సాఫీగా మాత్రం లేదు.

            ఒక మురుగు కాల్వ, వాహనాలు నిలుపుదల వల్ల ఇరుకైన రోడ్డు భాగాలూ, వేగంగా నడిచే ద్విచక్ర వాహనాలూ, ఇసుక బళ్ళూ - వీటి నడుమ చాకచక్యంగా శుభ్రపరుచుకుపోతున్న 20 మంది అంకితులైన కార్యకర్తల్నీ చూస్తుంటే మాత్రం – “ఇది కదా అసలైన గ్రామ సామాజిక ప్రయోజనకర శ్రమదానమంటే

            వీళ్లు గదా నిస్వార్థ - నిరాడంబర - నిశ్శబ్ద సామాజిక కార్యకర్తలంటే - అనిపించదా?

            తటవర్తి భవనం ముందర ఖాళీ భాగం గడ్డినీ, వ్యర్ధాల్నీ తొలగిస్తూ ఒంటరి పోరాటం చేస్తున్న మెండు పాండురంగడు గానీ -

            నిచ్చెన్ల సాయంతో చెట్లను సుందరీకరిస్తున్న నల్గురు సుందరీకర్తలు గానీ

            సినిమా హాలు ప్రహరీ బైట ఉచ్ఛ మడుగుల కంపుల్నేవగించుకోక గ్రామ సామాజిక డాక్టర్లై, నర్సులై శుద్ధిచేసిన ఆరేడుగురు పుణ్యాత్ములు గానీ -

            పని ముగించాక చెమటలు దిగపోస్తున్న - నిలువునా ముద్దైపోయిన భారీ వృద్ధ కార్యకర్త (ఫొటో చూడుడు) గానీ - 

            దుకాణంలో పని భారం వల్ల మెలకువ రాక, ఆలస్యంగా వచ్చి - పశ్చాత్తాప పడుతున్న వ్యాపారి గానీ

            కూని రాగాలాపనల నడుమ గడ్డు ఉక్కవాతావరణాన్ని తేలిక పరుస్తూ ఊడుస్తూ - వీధి పారిశుద్ధ్యం నిర్వహిస్తున్న కార్యకర్తలు గానీ.......

            ఎంత అభివందనీయులు! ఎంత అనుసరణీయులు! గ్రామస్తులకెంతగా కృతజ్ఞతా స్పదులు! కనీసం ఆ వీధి జనులకెంత స్మరణీయులో గదా!

            ఇవన్నీ నిన్న - నేటి కొంగ్రొత్త సేవలు కాదు - 9 ఏళ్లకు పైబడిన ప్రాత సంగతులే!

            అందుకే 6.25 కు జరిగిన సమావేశంలో ప్రతిరోజు క్రమం తప్పక ఈ శ్రమదాన సమీక్షక వైద్యుడు ఆశ్చర్య అనంద - అభినందనలు తెలిపేది!

            ఈ ఉదయం ఆలస్యంగా వచ్చిన గోళ్ల వేంకటరత్నం బాగా బరువైన (10116/-) విరాళం చెక్కును స్వచ్చోద్యమానికందించిన సందర్భం - అతని వైవాహిక స్ఫురణగా!

            పనిలో పనిగా - అతడే ముమ్మారు చల్లపల్లి స్వఛ్ఛ - సుందరోద్యమ నినాదాలను కూడ పలికాడు!

            గ్రామ స్థాయిలో - రాష్ట్రంలోనే అతి పెద్ద కాలనీ పేరు గల చల్లపల్లి నారాయణరావు73 వ మృతదినం నేడట!

            రేపటి వేకువ మనం కలువదగిన చోటు - బైపాల్ వీధిలోనే - కాంపౌండర్ భోగాది సూర్యప్రకాశరావు ఇంటి దగ్గర!

            స్వఛ్ఛ కార్యకర్తకు

విద్యార్హత పనే లేదు, వృత్తి నిపుణ తసలు వలదు

వ్యాపారపు దక్షతతో అసలే అవసరం పడదు

కావలసినదల్లా స్వగ్రామంపై కొంత మమత,

సామాజిక సామూహిక శ్రమదానం పట్ల గురీ!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   12.05.2023.