13.12.2023....           13-Dec-2023

 ఇంకెవడయ్య! స్వచ్ఛ సైనికుడు!

 

ఊరి శుభ్రత కోరి ఉద్యమించేవాడు

 చీపుళ్లతో వీధి చెత్తనూడ్చేవాడు

పారిశుద్ధ్యం చేసి పరవశించెడివాడు

మురుగు కాల్వలు ముందుకురికించు మొనగాడు

      ||ఎవడయ్య ఎవడు వాడు- ఇంకెవడయ్య! స్వచ్ఛసైనికుడు||

గ్రామ సామాజిక క్షేమాన్ని కాంక్షించి

 బ్రహ్మ కాలములోనె వల్లకాడుకు పోయి

పచ్చదనమును పెంచి పరవశించేవాడు

సౌకర్యములమర్చి సంతసించెడివాడు

                    || ఎవడయ్య! ఎవడు వాడు ||

కుల మతాలొదిలేసివిలువల్ని పెంచేసి

ఐకమత్యంతోనే అడుగు ముందుకు వేసి

శ్రమదానముతో ఊరు చక్కదిద్దేవాడు

 వేల రోజుల పాటు విశ్రమించనివాడు

               || ఎవడయ్య! ఎవడు వాడు ||

తన స్థాయి మరచి - హోదాలు ప్రక్కన బెట్టి

పేడ- పెంటల నెత్తి - వీధుల్ని మురిపించి

మురిసి పోయేవాడు- మైమరచి పోయేవాడు

ఊరిమేలే తనదు మేలు అనుకొనువాడు

                 ||ఎవడయ్య! ఎవడు వాడు ||

"సొంతమేల్ తగ్గించిపొరుగు మేల్ చూడు" అను

గురజాడ కవితలకు సరియైన వారసుడు

మన సమాజానికి నవమార్గ దర్శకుడు

అభినందనీయుడూ- అభివందనీయుడూ

      ||ఎవడయ్య- ఎవడువాడూ ఇంకెవడయ్య- స్వచ్ఛ సైనికుడు ||

విందు భోజనముల పసందుల్ని వదిలేసి

ప్లాస్టిక్కు గ్లాసుల్ని-ప్లేటుల్ని వెలివేసి

జాగ్రత్త పడువాడు- చైతన్యవంతుడూ

పర్యావరణముకై పాటుబడుతుంటాడు

||ఎవడయ్య! ఎవడువాడు- ఇంకెవడయ్య! స్వచ్ఛసైనికుడు ||