ఏవి తల్లీ చల్లపల్లీ!
విధులన్నీ బోసిపోయిన – దోమ లీగలు వృద్ధి చెందిన
కళాకాంతుల కరవు పెరిగిన – నీ గతాన్నీ నెమరు వేస్తే – ఆ గతాన్ని పోల్చిచూస్తే
॥ ఏవి తల్లీ! నేడు విరిసిన స్వచ్ఛ - శుభ్రతలేవి తల్లీ!
ఎక్కడమ్మా! బాధ్యతెరిగిన ఈ మహోన్నత కార్యకర్తలు – ఏరితల్లీ ॥
ఊరి మేలుకు తొమ్మిదేళ్లుగ ఉద్యమించిన వీరులెక్కడ?
ప్రతి దినం నీ సేవలోనే పరవశించిన ధీరు లెక్కడ?
వట్టిమాటలుకాక నిన్ను ఉద్ధరించిన దృశ్యమెక్కడ
ఉంది చూపించూ!
॥ ఏవి తల్లీ! నేడు మురిసిన స్వచ్ఛ శుభ్రతలేవి తల్లీ ॥
హరిత సుందర కానుకలతో పుష్ప శయ్యల మార్గములతో
కనుల పండుగ చేసినట్టి ఘట్టముందా గతం లోపల – తీసి చూపించూ!
॥ ఏవి తల్లీ నేడు మురిసిన స్వచ్ఛ శుభ్రతలేవి తల్లీ!
ఎక్కడమ్మా! బాధ్యతెరిగిన ఈ మహోత్తమ కార్యకర్తలు – ఏరి తల్లీ!
భ్రష్ట సంస్కృతి రూపు మాపే - శిష్ట సంస్కృతి మేలు కొలిపే
శ్మశానాలను సంస్కరించే - మురుగు గుంటల నుద్ధరించే
కార్యకర్తలు నీ గతంలో కాన రారేమీ?
॥ ఏవి తల్లీ! నేడు విరిసిన స్వచ్ఛ– శుభ్రతలేవి తల్లీ!
ఎక్కడమ్మా! బాధ్యతెరిగిన ఈ మహోత్తమ కార్యకర్తలు – ఏరి తల్లీ ॥
శ్రమ త్యాగం, సమయదానం సుదీర్ఘంగా నిరూపించిన
పుత్రులిందరు నీ గతంలో పుట్టి ఉన్నారా?
గతం నీవొక చల్లపల్లివె - వర్తమానం స్వచ్ఛ - సుందర
చల్లపల్లని లోకమంతట చాటి చెప్పారా?
॥ ఏది తల్లీ! నేడు వెలిగిన స్వచ్ఛ సంస్కృతి ఏది తల్లీ!
ఎక్కడమ్మా! నీ గతంలో బాధ్య తెరిగిన కార్యకర్తలు – ఏరి తల్లీ ॥