చల్లపల్లిలో క్రమంగా వ్యాపిస్తున్న “హరిత వేడుకలు”!....           25-Mar-2022

 చల్లపల్లిలో క్రమంగా వ్యాపిస్తున్న హరిత వేడుకలు!

స్వచ్ఛ - సుందర - చల్లపల్లి కోసం జరుగుతున్న శ్రమదానం వయస్సు నేటికి 2390* రోజులు! ప్రధాన వీధుల్ని, డ్రైనుల్ని, జనసమ్మర్దం ఉండే ప్రతి చోటును శుభ్రపరుస్తూ - గోడల్ని సుందరీకరిస్తూ రహదార్ల ప్రక్కన పచ్చదనాల పందిళ్ళు వేస్తూ వేలకొద్దీ పూల మొక్కలు పెంచుతూ.... స్వచ్ఛ కార్యకర్తల 3 లక్షల పనిగంటల శ్రమతో ఆ గ్రామం ఇప్పటికే ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో కూడ ఉదాహరణ యోగ్యంగా మారింది.

కార్యకర్తలతో బాటు ఊరి జనుల్లో సైతం ఇటీవల పర్యావరణ స్పృహ గణనీయంగా పెంపొందుతున్నది! మిగిలిన అన్ని కశ్మలాలకన్నా విందు - వేడుకల్లో ఒక్కమారు వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులే పర్యావరణానికీ, తద్ద్వారా మానవాళి భవిష్యత్తుకూ పరమ శత్రువులు!

పెడసనగంటి వేంకన్నబాబు - నాగలక్ష్మి (పద్మావతి ఆసుపత్రి ఉద్యోగిని) దంపతుల కుమార్తె నవ్యసాయి! వివాహవేడుక చండ్ర  వికాస కేంద్రంలో నిన్న! (24.03.2022) అక్కడ జరిగిన విందు, వేడుక ప్లాస్టిక్ రహితం! ఒక్క ఫ్లెక్సీ లేదు, అసలు ఏ బ్యానర్ పెట్టలేదు, ప్లాస్టిక్ విస్తర్లు గాని, గ్లాసులు గాని, భోజనం బల్లల మీద ప్లాస్టిక్ పేపర్లు గాని, కప్పులు, స్పూన్లు గాని లేని ఒక నిరాడంబర ఆదర్శ పర్యావరణ హిత హరిత వేడుక!

ఒక్కనాటి తమ సంతోషం కోసం వందల ఏళ్లు భూమిలో కరగని హానికర ప్లాస్టిక్ లు లేకుండ వేడుక నిర్వహించిన వధూవరులకు, నిర్వాహకులు స్వచ్ఛ - సుందర చల్లపల్లి కార్యకర్తల అభినందనలు!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   25.03.2022.