2891* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

2891*వ శ్రమదాన సారాంశం!

            సోమవారం (25.9.23) కనుక - సదరు శ్రమ రెస్క్యూ టీమ్ వారిది! అది కాస్తా 4.24 AM కే మొదలై - 6.10 కి విజయవంతంగా ముగిసింది! ఈ వేకువ వాళ్లెంచుకొన్న పని గంగులవారిపాలెం ఉత్తరాన – NH 16 కు ఉత్తరంగా - అటు పంట పొలం మురుగు నీరూ, ఇటు వర్షం నీరూ ఏకమైన చోట!

            3 నెలల క్రితం అక్కడ హైవే అధారిటీ అనుమతితో ఖరీదైన - అరుదైన పెద్ద మొక్కలు నాటినా చవిటి మట్టి కారణంగానో నిలవ నీటి వల్లనో అందులో కొన్ని మృతి చెందగా - వాటిని పునః స్థాపించే ప్రయత్నమన్నమాట!

            మీరొక్కమారు జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంవాట్సప్ చూడండి బురదలో - వేకువ 4 ½ పనిలో మునిగిన రెస్క్యూ దళం వాళ్ళని గుర్తించండి. తమ చల్లపల్లి ఆహ్లాదం కోసం వాళ్ల పట్టుదలను పట్టించుకోండి - వాళ్ల కష్టానికి పొగడ్తలూ, తెగడ్తలూ వద్దు గాని, కొన్ని క్షణాలు వాళ్ల అంతరంగాల్లోకి తొంగి చూచి - అంతటి నిబద్ధత ఎందుకో ఆలోచించండి?

            రోడ్ల గుంటలు కావచ్చు - తుక్కడ్డం పడ్ల డ్రైన్లు కావచ్చు క్రుంగుతున్న రోడ్ల మార్జిన్లు కావచ్చు - నాటుతున్న మొక్కలు కావచ్చు - తమకు చాతనైనంతలో వాళ్లే ఇంజనీర్లు, వాళ్లే ఎస్టిమేటర్లు, డిజైనర్లు, ఎగ్జిక్యూటర్లు, అంటే వాళ్లే రాజులు - వాళ్లే బంటులు!

            ఇదేదో ఒకటీ రెండూ పదీ నాళ్ల వ్యవహారం కాదు సుమా! 9 - 10 ఏళ్ల శ్రమదాన చరిత్ర! అందరూ చదివి - ఆలోచించి - ఆచరించదగ్గ అనుభవ పాఠం!

            క్రొత్తగా తెలిసిన విషయమేమంటే చల్లపల్లి స్వచ్చోద్యమాన్ని ఆరేడేళ్ళుగా నరనరాన వంటబట్టిచ్చుకున్న ప్రాతూరి శంకర శాస్త్రి గారి పునరాగమనం ఈ వారంలో ఉంటుందట.    

            ఒక రిటైర్డ్ BSNL నరసింహారావు ప్రకటించిన గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలతో వాళ్ల నేటి శ్రమ వేడుక ముగిసింది.

            ఇదేదో ఒక పూటదా?

అలసి సొలయుట నిత్య కృత్యం, కాఫీ సౌఖ్యం అనుభవించుట

జమా ఖర్చులు నెలల వారీ చదవడం ఒక విధాయకమట!

గొర్రొ చీపురొ పట్టి వీధులు గూళ్లు నొప్పులు పుట్ట ఊడ్చుట

ఇదేదో ఒక పూటదా - ఇది వేల దినముల వరుస ముచ్చట!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   25.09.2023.