2954 వ రోజు ...... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెన్నాళ్లు వాడుదాం?

2954* వ నాటి వీధి పారిశుద్ధ్యం!

సదరు వీధి విజయా కాన్వెంట్ - ప్రభుత్వాస్పత్రి నడిమిది, శ్రమ 3 నాళ్లుగా పట్టు వదలని రెస్క్యూ టీం అనబడే కొందరు కార్యకర్తలది, ఆదివారం నుండీ వేకువనే వచ్చి ఈ ఆరేడుగురెక్కడి వారో- ఎందుకు కష్టించి – ఏం సాధించారో – పట్టించుకోని నిర్లక్ష్యం ఆ వీధి నివాసులది. ఇంతకీ ఈ ప్రస్తావన తొమ్మిదేళ్ల పైబడి జరుగుతున్న గ్రామ స్వచ్ఛ - సుందర – శ్రమదానోద్యమానిది!

ఆదివారం వేకువ 4.00 కు ముందూ, ఈ మంగళవారం ఉదయం 6.20 తదుపరీ ఈ వీధిలో ‘అరె! ఈ రోడ్డంతా భలేగా ఉందే’ అని యాదాలాపంగా అనుకొనే వారుంటే – ఎందుకీ వీధి నెల నాళ్ల నుండి కాలుష్యపరమైన అష్ట దరిద్రాలనుభవించిందో, ఇప్పుడీ పరివర్తన ఎలా సాధ్యపడిందో లోతుగా ఆలోచించాలి! ఇన్ని వేల దినాలుగా ఇంతటి బ్రహ్మ ప్రయత్నం జరుగుతున్నా - మచ్చుకు కొన్ని రోజులైన పట్టించుకోని కారణం చెప్పాలి!

స్వచ్ఛ కార్యకర్తలదేముంది - చల్లపల్లి వీధి పరిశుభ్రతకీ, రహదార్ల పచ్చదనాలకీ, రోడ్ల గుంటల పూడ్చివేతలకీ, ప్రజా సౌకర్య కల్పనకీ ఎప్పుడో అంకితులైపోయారు. తేల్చుకోవలసింది సగానికి పైగా గ్రామస్తులమే!

ఈ మంగళవారం - 28-11-23 శుభ వేకువలో మురుగ్గుంటల ఒడ్డున – కొమ్మల్ని పైకి లాగి, సైజులుగా నరికి, పనికొచ్చే కట్టెల్ని ప్రోగులుగా పేర్చి, పనికి మాలిన వాటిని ట్రక్కులోకెక్కించి, ఆకులూ తదితర వ్యర్ధాల్ని ఊడ్చి, చలి గాల్లోనూ మంచి నీళ్లు పదే పదే త్రాగిన ఐదురుగురిదెంత సౌజన్యం!

వాళ్లూ, వాళ్ల కష్టమూ ఈ గ్రామానికి మరికొంత కాలం అవసరం. వాళ్లు నిండు సంక్షేమ – ఆయు – రారోగ్యాలతో ఉండాలని కోరుకొందాం!

కార్యకర్తలందరం బుధవారం వేకువ గంగులవారిపాలెం వీధిలోని సన్ ప్లవర్ అడ్డ వీధి దగ్గర కలుద్దాం!

నేటి 11-00 గంటల తర్వాత అందరం రాముడుపాలెంలోని సోదర స్వచ్ఛ కార్యకర్త వీరసింహుని చూసి వద్దాం

సుందరీకరణెందుకంటే

ఎక్కడెక్కడి సొగసులన్నీ ఇక్కడే సమకూర్చుకొందుకు

క్రిక్కిరిసినట్లున్న చోటా మొక్కలను ఇరికించెటందుకు,

వేల జాతుల పుష్ప శయ్యల నిచట చొప్పించేందుకే

పూల ఘుమఘుమ, హరిత మధురిమ ఊరిలో నిలిపేందుకే!

- నల్లూరి రామారావు

   సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   28.11.2023.