2958 వ రోజు ...... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా?

విజయవంతమైన శ్రమదానం - @ 2958*

శనివారం (2-12-23) వేకువ 4.20 - 6.14 ల మధ్య – 31 మంది తమ ఊరి సంక్షేమం కోసం చేసుకొన్న వీధి పారిశుద్ధ్య కార్యక్రమమది. 6 వ నంబరు పంట కాల్వ హద్దుగా - బందరు రహదారిలో – పింగళి వారి కళా నర్సింగ్ హోమ్ దాక సాగించిన శుభ్ర - సుందరీకరణ ప్రయత్నం అభివందనీయం!

ఉడత్తు సోదరుల ఆర్థిక సౌజన్యంతో నియమించిన కార్మికుడు ఈ 200 గజాల వీధిని ఠంచనుగా ప్రతి వేకువా శుభ్రపరుస్తున్నందున ఈ వీధి చాల వరకు బాగా కనిపిస్తున్న మాట నిజం! ఐతే - పండ్ల, టిఫిన్ బండ్ల, ఇతర తినుబండారాల విక్రయ/ కొనుగోళ్ళెక్కువై, ఆస్పత్రుల, కార్యాలయాల వల్ల వినియోగదార్లెక్కువై, సదరు కార్మికుని కలవి గాక  మిగిలిపోతున్న వ్యర్ధాల పనిబట్టడమే నేటి శ్రమదాన విశేషం!

అసలింత పెద్ద వీధి రెండు ప్రక్కలా ఇసుక - దుమ్ము - ప్లాస్టిక్ వ్యర్థాలూ ఊడ్చేందుకే సగం మంది కార్యకర్తలకు సమయం చాల్లేదు! దానికి తోడు ఎవరో నరికేసిన కొమ్మలూ, మురుగు కాల్వల ఒడ్డున గడ్డీ, షాపుల ముందు వాళ్లే ప్రొగులు చేసి, బిగుసుకుపోయిన మట్టి గుట్టలూ!        

రెండు దుకాణాల ఎదుట ఎక్కడివో - ఎవరివో రాతి ముక్కల గుట్టలూ, SBI ఎదుట ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడ పెరిగిన గడ్డీ, ప్లాస్టిక్ తుక్కులూ! పంట కాల్వ పడమర గట్టు – మినీ  గార్డెన్ దగ్గర కాగితాలూ, టీ కప్పులూ వగైరాలూ.

మరి, బాగా కన్పించే బందరు రహదారిలోనే ఇన్ని రకాల చెత్తలుంటే – ఊళ్ళో లోతట్టు వీధుల మాటేమిటి? చిన్న గుడుల దగ్గరి వ్యర్ధాల సంగతేమిటి?

నేటి సామాజిక బాధ్యతల నిర్వహణం చూస్తుంటే -

1) శ్రావ్య ఆస్పత్రి ఆవరణనూ, కొబ్బరి బొండాల కొట్టునూ డజను మంది క్షుణ్ణంగా బాగుచేయడం చూసినా,

2) రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుటా, మెకానిక్ షెడ్ల ముందరా కార్యకర్తల శ్రద్ధను గమనించినా – ఏ గ్రామస్తునికైనా “ఎక్కడబడితే అక్కడ వ్యర్ధాల్ని విరజిమ్మకూడదు” అనే స్పృహ కలగాలి.

            చెత్త లోడింగు కాస్త ఆలస్యమై, ఆరుంబావుకు పని ముగించి, అందరూ పనిముట్లతో తిరిగి వస్తున్న దృశ్యం చూసే వాళ్లకు ప్రేరణ కలిగించి తీరాలి!

నేటి అంతిమ సమావేశంలో:

1) గ్రామ పథమ పౌరురాలు త్వరత్వరగా నినాదాలివ్వడమూ,

2) పల్నాటి అన్నపూర్ణ తన తృతీయ పుత్రుని జన్మదిన జ్ఞప్తిగా కార్యకర్తలకు బిస్కట్ల విందు చేసి, ఉద్యమ ఖర్చుల నిమిత్తం గౌతమ్ హర్ష పేరు మీద ఇచ్చిన 1000/- విరాళమూ,

3) ఇది వాస్తున్న వాని జామకాయల పంపకమూ వంటి విశేషాలు!

అందరూ చర్చించి, తీసుకొన్న నిర్ణయం - రేపటి వేకువ శ్రమదానం ‘సజ్జా వారి వీధి’ దగ్గర నుండి మొదలుపెట్టాలని!

 

విరమణ సబబౌతుందా?

ఉన్న ఊరి పరిశుభ్రత, పచ్చదనం, ఆహ్లాదం

పరిపూర్ణత చెందనపుడు - ప్రజలింకాకదలనపుడు

స్వచ్చోద్యమ ప్రస్థానం సగంలోనె ఉన్నప్పుడు

విశ్రాంతికి చోటుందా - విరమణ సబబౌతుందా?

- నల్లూరి రామారావు

   సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   02.12.2023.