2962 వ రోజు ...... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా?

బందరు వీధిలోనే శుక్రవారం వేకువ కూడ! - @2962*

డిసెంబరు 8 వ రోజున 34 మంది కార్యకర్తల ఉనికితో కళకళలాడిన NH216 లోని 200 కు పైగా గజాల భాగం. రోడ్డు మార్జిన్లలో బురద - నీళ్లతోనూ, కర్మల భవనం ఆవరణలో కాళ్ల కంటుకొంటున్న జిగట మట్టితోనూ, వైజయంతం ప్రహరీ బారునా కాలేస్తే ఉబుకుతున్న నీటిలోనూ ఇంతమందికి చేసేందుకేం పనుందనిపిస్తుంది.

గాని, నిన్న శ్రమించిన మునసబు వీధిలో ఇంకే పని మిగిలిందని గాని మనబోటి వాళ్లకనిపించవచ్చు గాని, 4.17 నుండి 6.10 దాక ఎవరైనా స్వయంగా అక్కడ ఉండి, పరిశీలిస్తేనే తెలుస్తుంది - స్వచ్ఛ కార్యకర్తల పని స్వభావమేమిటో, ఎవరెవరి ప్రయత్నమేమిటో!

- జమీందారు భవన తూర్పు ప్రక్కన కరెంటు తీగల్ని అందుకొంటున్న గానుగ చెట్టు కొమ్మల తొలగింపూ - అందుకు ఒక విశ్రాంతోద్యోగి తెగింపూ చూస్తేనూ,

- ఈ పూట కూడ కర్మల భవనానికి తూర్పు భాగాన్ని ఏడెనిమిది మంది ఒక్క ఆకు లేకుండ – పుల్ల కన్పించకుండ – నున్నటి అద్దంలా తీర్చిదిద్దడం చూస్తే,

- ఇద్దరు విశ్రాంత ఉద్యోగ దంపతులు బరువు డిప్పల్తో ఇసుక - దుమ్మూ మోసుకెళ్ళి బాట మార్జిన్ గుంటలు పూడుస్తుంటేనూ,

- శుభ్రంగానే ఉన్న రోడ్డు మీద మట్టి మరకల్ని తొలగించి మరో మారు ఊడుస్తున్నప్పుడూ,

- దారి ఉత్తరాన వైజయంతం గోడ పొడుగునా బురదలోనే గద్ద గోరు పూల మొక్కల్ని అలంకరిస్తుండగానూ,

- పీకిన గడ్డిని దంతెల్తో లాగి, గుట్టల్ని డిప్పలకెత్తి ట్రాక్టర్ నింపుతున్న కొందర్శి చూస్తుంటేనూ....

ప్రతి వేకువా ఠంచనుగా జరిగే ఈ శ్రమదాన కార్యక్రమమెంతటి ప్రయోజనకరమో - ప్రతి ఊరికీ ఇదెంత ఆవశ్యకమో తెలిసిపోతుంది!

మురుగుకంపు పనులు చేసి కూడ ఈ కార్యకర్తలెంత చలాకీగా... సంతోషంగా ఉంటారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది!

ఒక్కోరోజైతే – సమీక్షా కాలంలో వాళ్ల చతురోక్తులూ, శివబాబు – గురవయ్యల సూక్తులూ వినబుద్ధేస్తుంది!

            రెండు – మూడు ఏళ్ళనాడు గుంటూరులో కార్యకర్తలకు సన్మాన సందర్భంలో ఒకాయన సక్సెస్ ఫుల్ గ్రూపుకు, యూస్ ఫుల్ గ్రూపుకు వివరించిన తేడాను డా.డి.ఆర్.కె గుర్తు చేస్తున్న సంగతి బాగున్నది.  

ఈ ఉదయం నినాదాల వంతు శివబాబుది.

రేపటి వేకువ కూడా మనం కలువదగిన చోటు బందరు వీథిలో భగత్ సింగ్ గారి ఆస్పత్రి  ఎదుటే!

 

       మరీ అంత కష్ట మౌతుందా

సంక్లిష్టంగాలేదే స్వచ్ఛోద్యమ శ్రమదానం!

షరతులు లేనట్టిది గద చల్లపల్లి ఉద్యమం!

మరీ అంత కష్ట మౌతుందా మన గ్రామస్తులకు -

సొంత ఊరి బాధ్యతలను కొంత పంచుకోవడం?  

- నల్లూరి రామారావు

సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

08.12.2023.