2963 వ రోజు ..........

    పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!    

                       శనివారం-9-12-23 - నాటి శ్రమ సంకేతం - @2963*

          సంకేతాలు పొడవూ-వెడల్పాటి బందరు రహదారిలో కన్పించాయి. సందేశమిచ్చిన కార్యకర్తలు ఏకంగా 38 మంది - అందులో ఒకామె - బొబ్బా లక్ష్మీకుమారి(75) గారిది ఈ ఊరూ, వాడా కాదు - ఇక్కడికి సుదూర కౌతవరం. (మీకు గుర్తుండే ఉంటుంది - 76 ఏళ్ల శంకర శాస్త్రి గారూ ఇంతే- 8 ఏళ్ళనాడు బెజవాడ నుండి చుట్టం చూపుగా వచ్చి అనుకోకుండా రోడ్డు మీద శ్రమదానం సంగతి తెలుసుకొని - ఈ శ్రమోద్యమాని కంకితుడైపోయిన సంగతి!)

          నేటి పనివేళ 4.17-6.10 నడిమి సమయం! వీధి కాలుష్యమ్మీద తొలి వేటు వేస్తున్న డజను మందీ, మలిపోటు పొడిచిన పాతిక మందీ వేకువ వేళ నిద్రపట్టక - చల్లగాలికి రోడ్డెక్కిన వాళ్లేంకాదు- వాళ్లదొక ఉమ్మడి ఆశయం- ఏమైనాసరే తమ ఊరి వీధులు నిస్తేజంగా, చప్పగా ఇక ఉండిపోరాదనీ, శుభ్రంగా- సజీవంగా ఊరి వారి కాహ్లాదం పంచుతూ ఉండాలనీ!

          దాని కోసమేగదా – దశాబ్దకాలంగా 30-40-50 మంది చొప్పున ప్రతి వేకువలోనూ, వాళ్లు కష్టిస్తున్నది! 'శ్రమయేవజయతే' అని పదేపదే ఋజువు చేస్తూ సుదీర్ఘంగా ప్రస్థానిస్తున్నది! స్వార్ధం బోరవిరుచుకుని,రంకెలేసి, విర్ర వీగుతున్న ఈ నిరాశామయ దుర్మార్గకాలంలో కనీసం ఒక్క చల్లపల్లిలోనైనా సరే - అలాంటి ఉద్యమానికి మద్దతు దొరకడం విశేషమే మరి!

నేటి వేకువ చీకట్లో ఇందరు కార్యకర్తలు సాధించినదే పరమార్థం - ఊరికి దక్కినదే ఫలితం - అని విచారిస్తే:

- ఎదురెదురుగా ఉన్న 2 నర్సరీల వెలుపలి పనే ముఖ్యమైనది. అందులో ఒక దాని ప్రక్క ఖాళీ స్తలం బాగు చేయడం మరొకటి.

ఆడా-మగా కార్యకర్తలీ 2 చోట్లనే 20 మంది శ్రమించారు.

- విరిగిపోయి, మిగిలిపోయి, మనుషుల కదలికల కడ్డుపడుతున్న అడ్వర్టైస్మెంట్ పోల్  మూలాన్ని పెకలించిన కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే ! మలాటుతో కాంక్రీటు దిమ్మెను బలంగా మోదుతున్నది సుందరీకరణ బృంద ముఖ్యుడు!

          సమీక్షా  సమయంలో 37 మందితో స్వచ్చోద్యమ నినాదాల్ని పలికించిన వారు పసుపులేటి ధనలక్ష్మి! ప్రధాన సమీక్షకుడూ – కోనేరు హంపి తాతగారి (87*) స్పందనను తెలిపిన వారూ DRK వైద్యుడు! రేపటి శ్రమ దాన స్థల నిర్దేశం – ఇదే వీధి – ఇదే దంత వైద్యశాల అని చేసిన వారు అందరూ!

       పక పక నవ్వుచు

గంగులపాలెం వీధికి కళ మళ్ళీ పెరుతోంది

బంతులు –చేమంతులాది బహు జాతుల పూల సొగసు

పక పక నవ్వుచు మనలను ప్రశ్నిస్తూ ఉన్నది –

‘మానవ శ్రమ మరు భూమిని మార్చెను చూసి తిరా’ అని!  

- నల్లూరి రామారావు

   సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   09.12.2023.