2964 వ రోజు ...... ....

    పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!    

ఇది 2964* వ వేకువ చలి కాల శ్రమదానం!

        4:17 కే డజను మంది పూనుకొని, మరి 2 డజన్ల మంది చేరికతో సంఖ్య బలీయమై, 6.05 కు పని విరమణ ఈల మ్రోగినా, 6.15 దాక వదలక సాగిన పరిశ్రమానందం! ఆదివారాల్లో కార్యకర్తల బలగం 40 ని దాటుతున్నది నిజమే గాని, ఐదారుగురు ప్రముఖులు అన్నవరం కొండ మీద ఉండిపోయారు!

        “కొండ మీద శుభ్రంగానే ఉందా, ప్లాస్టిక్ వ్యర్ధాలు కనిపిస్తున్నాయా” అని వాళ్లక్కడ ఆరా తీస్తున్నట్లుంది! ఇక ఇక్కడ చల్లపల్లి - బందరు వీధిలోని సజీవ మత్స్య విక్రయ కేంద్రం చుట్టు ప్రక్కల ఈ వేకువ జరిగిన పనిపాటులెట్లున్నవో చూద్దాం.

        యధా ప్రకారం సుమారిరవై మంది చీపుళ్ళకే పని కల్పించారు. వాళ్లు ప్రోగులు చేసిన ఇసుక - దుమ్ము గుట్టలు లోడింగు కుదరక ఇప్పటికీ రోడ్డు మార్జిన్ల వద్ద కనిపిస్తున్నాయి. ఊడ్చుకుంటూ కొందరు, కత్తులకు పని చెప్పి, గడ్డీ, పనికిమాలిన మొక్కలూ తొలగిస్తూ కొందరూ రామాలయాన్ని సమీపించారు.

        NH 216 కు ఉత్తరం దిశగా చిన్న గల్లీ - బహుశా మాజీ వార్డు సభ్యురాలు ధనలక్ష్మి గారి ప్రస్తుత నివాస వీధనుకొంటా – ఊడ్చుకొంటూ - ఇద్దరు మురుగు కాల్వను బాగుచేస్తూ కన్పించారు.

        ముగ్గురు భారత లక్ష్మీ వడ్లమర వీధి పారిశుద్ధ్యం కోసం పని చేశారు గాని, 10 గజాల కన్న ఎక్కువ దూరం వెళ్లలేదు.  

        5.00 సమయం తర్వాత వేంకట రమణ నర్సరీ దగ్గరనే గట్టి శ్రమ సందడి కన్పించింది. కత్తులు - దంతెలు గోకుడు పారల్తో వంగొనీ, కూర్చొనీ, గడ్డిపరకల్లేకుండ, నేలని సమం చేయడానికి 10 మంది కష్టం అక్కరకొచ్చింది.

        మంచూ - చలి గాలీ జమిలిగా ప్రతాపం చూపించినా, పనిలో మునిగిన కార్యకర్తలకేం ఇబ్బంది? డిప్పల్తో లోడింగు చేస్తున్నా, వంగి కష్టిస్తున్నా చలేం చేయగలదు? అసలు స్వచ్ఛంద శ్రమదాత లెప్పట్నుంచో ఇలాంటి వైపరీత్యాల కతీతులు గదా!

        ఆదివారం అలవాటు బొప్పున 6.25 కు గ్రామ స్వచ్ఛ – సుందరోద్యమ నినాదాలు ధ్యానమండలి తరపున నాయుడు మోహనరావు వంతు! ఉషోదయ ప్రవచనకారుడు ఈ పూట మాత్రం భగవద్గీత శ్లోకాలనూ, వేమన పద్యాన్నీ ఆలపించాడు!

        బుధవారం వేకువ తూర్పు రామాలయం ఎదుట - మెకానిక్ షెడ్డు వద్ద కలుసుకొనే సంకల్పంతో నేటి శ్రమదాన సమాప్తి!

 

        స్పూర్తిమంత్రమని అందరు గమనిస్తే

ప్రధాన వీధులు పరిశుభ్రతతో పరువు నిలుపుతుంటే

అష్ట దిశల రహదార్లు పూలతో పలకరించుచుంటే

మానవ శ్రమతో చల్లపల్లిలో మార్పులు కనిపిస్తే

అది గ్రామాలకు స్పూర్తిమంత్రమని అందరు గమనిస్తే...

- నల్లూరి రామారావు

   సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   10.12.2023.