2965 వ రోజు ...... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా?

2965* వ పని దినం సంగతులు!

ఈ సోమవారం నాటి ఐదారుగురి శ్రమదాన విశేషాలవి! వాళ్ల దృష్టిలో పడిన అస్తవ్యస్తత నాగాయలంక రోడ్డులోని స్వచ్ఛ - సుందర పబ్లిక్ టాయిలెట్ల దగ్గరది. తుఫాన్ భీభత్సానంతరం అక్కడి మినీ ఉద్యానాలలోనూ, వీధి మార్జిన్లలోనూ చప్పుడు లేకుండా పెరిగిపోతున్న కలుపు మొక్కల - పిచ్చి మొక్కల, తీగల నిర్మూలనమే నేటి పని!

అసలా రోడ్డు నిడివెంత, ఉద్యానాల బారెంత, వాటిని బాగుపరచాలని బయల్దేరిన రెస్క్యూ దళ సభ్యులెందరు? సమీప గృహస్తులూ, వ్యాపారులూ స్వచ్ఛ సుందరోద్యమం మీద దయ చూపి, “శాశ్వతంగా స్వచ్ఛ కార్యకర్తలదే ఊరి మెరుగుదల బాధ్యతఅనుకోవడం మానేసి, ఏ 50 - 60 మందో కలిసొస్తే - నేటి వీధి పునః సుందరీకరణం ఒక కిలోమీటరు మేర విస్తరించదా?

ఉన్న ఈ కొద్దిమంది కార్యకర్తలే-

- అవనిగడ్డ రోడ్డుకు పడమరగా - పాగోలు పంచాయతీ పరిధిలోని ప్రతిష్మాత్మక - ప్రయోజనాత్మక మరుగు దొడ్ల ప్రక్క ఎంత గడ్డిని పీకి, సరికి, రోడ్డు పైకి వ్యాపిస్తున్న చెట్ల కొమ్మల్ని ఖండించి, పేవర్ టైల్స్ మీద పేరుకుపోతున్న ఇసుక - దుమ్ముల్ని గోకి, ఊడ్చి శ్రమించారో!

- ఈ గుప్పెడు మంది గ్రామహితకారుల 4.19 - 6.10 నడిమి కృషితో సదరు రహదారి భాగమెంత బాగు పడిందో గమనించండి!

తిరిగి, గస్తీ గది దగ్గర 2965* వ నాటి గుడ్డ బ్యానర్ సాక్షిగా - 6.25 సమయంలో ముక్తకంఠాలతో - అంకితభావంతో తమ ఊరి మెరుగుదల ఆకాంక్షిస్తూ ఎలా నినదించారో వాట్సప్ లో చూడండి!

 

పరిమితమై పోవడమా!

సుస్యందన మెక్కి రాజ వీధులందు ఊరేగగ

దగినది ఈ శ్రమదానం - ఎదుగు బొదుగులేనట్లుగ

పాతిక ముప్పై మందికి పరిమితమై పోవడమా!

కార్యకర్త రాకకు ప్రతి వీధి ఎదురు చూడడమా!

- నల్లూరి రామారావు

సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

11.12.2023.