2966 వ రోజు ...... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా?

రెస్క్యూ దళ శ్రమ విన్యాసాలు - @2966*

మంగళవారం వేకువ 4.20 - 6.15 మధ్యస్త శ్రమ పరాక్రమం సైతం - నిన్నటి తరువాయిగా నాగాయలంక రహదారిలోని బండ్రేవుకోడు డ్రైను వంతెన వద్ద ప్రారంభమై, దక్షిణ దిశగా పయనంచింది!

తమ ఎదుట ఈ పూట పూర్తిచేయవలసిన పనులేమో ఎక్కువగానూ, తమ సంఖ్యేమో తక్కువగానూ ఉన్నవి గాని, మరి రెస్కూ టీమ్ అంటే ఏమిటి? పనిని చూసి వాళ్ళు కాదు - వాళ్లను చూసి పనే భయపడాలి! పైగా అసలు కార్యకర్తలకు పూర్తి స్థాయి మద్దతునిచ్చే ఇద్దరు పెద్దోళ్లూ, చలికాలపు నడక నాస్వాదిస్తున్న మరో నలుగురు సుందరీకర్తలనబడే వారూ కలిసొస్తిరి!

ఇక ఆ ప్రకారంబున వంతెనకు దక్షిణ, రోడ్డుకు పడమర భాగంలో 50-60 గద్దగోరు చెట్ల, వాటి మధ్య గడ్డీ, పిచ్చి మొక్కల - అటు సుందరీకరణమూ, ఇటు పరిశుభ్రీకరణమూ జరిగేపోయాయి!

లెవెల్ చూసి, కత్తెరతో సమంగా చెట్ల కొమ్మలు కత్తిరించేదొకరూ, క్రింద మంచుకు తడిసిన గడ్డీ - మట్టి మీద కూర్చొని, కత్తితో చిన్న కొమ్మల్ని నరికేదింకొకరూ, తెగి, డ్రైన్ లోకి జారుతున్న కొమ్మల్ని ఒడిసి పట్టి, క్రమ బద్ధీకరిస్తూ ఇద్దరూ - ఇదీ గంటన్నరకు పైగా కార్యకర్తల వరస!

6.00 కు గాని పని ముగించాలా! కాని అంతలో మరుగు దొడ్ల వద్ద రెండు ముళ్ల – గద్ద గోరు చెట్ల కొమ్మలు తొలగించే పని బడి, 6.30 కు గాని గస్తీ గది వద్దకు చేరి, మాలెంపాటి డాక్టరు గారి నినాదాలు పునరుద్ఘాటించి గాని ఇళ్ళకు చేరలేదు!

బుధవారం వేకువ మనం కలుసుకొని, శ్రమించదగినది బందరు రహదారిలోని తూర్పు రామాలయం ఎదుటనే!

 

ఎంత చూసిన తనివి తీరని వింతగొ

సమాజంలో గొప్ప వెజ్జులు, ప్రబోధాత్మక పనుల ఒజ్జలు

డెబ్బదెనుబది ఏళ్ల పెద్దలు, గడపదాటి గృహిణులింద

ఊరి కోసం వచ్చి ఇంతగ శ్రమించే సుమనోజ్ఞ దృశ్యం

ఎంత చూసిన తనివి తీరని వింత గొలిపే సన్నివేశం!

- నల్లూరి రామారావు

   సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   12.12.2023.