2967 వ రోజు ...... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా?

2 గంటల పాటు - 2 వీధుల్లో స్వచ్ఛ సుందరోద్యమం - @2966*

బుధవారం - అనగా 13.12.23 వేకువ 4:17-6.12 వేళ, ఇటు బందరు వీధి, అటు వడ్లమర అడ్డ వీధి - 28 మంది స్వచ్ఛ కార్యకర్తల పాద, కర స్పర్శలతో ధన్యమైపోయినవి!

నిజం చెప్పాలంటే - వీటిలో మొదటి దాన్ని నాలుగైదార్రోజులుగానూ, 2 వ దాన్ని గతాది వారం వేకువా ఈ వాలంటీర్లు తమ శ్రమతో పూజించినవే! రైసు మిల్లు బాటైతే అకాల దివంగత వా. కో. (వాకో లేక కోవా = వాసిరెడ్డి కోటేశ్వరరావు) అనబడే ఒక విశ్రాంత ఉపాధ్యాయోద్యోగి కష్టార్జిత స్వచ్ఛ సుందరోద్యానమే! సమాజ సేవలో అతడొక ఏక మనుష్య సైన్యమే’! (one man army!)

ఈ గజ గజ చలి వేళ రెండు వీధి భాగాల హుందాతో పరాచికాలాడుతున్న వెకిలి కాలుష్యాల మీద మువ్విధాలుగా జరిగిన స్వచ్ఛ సైనికుల దాడి ఎట్లున్నదో చూడుడు!

1) దంత వైద్యశాల దగ్గర 2+2 మంది ఇళ్ళ ముంగిటి వాన నీరు డ్రైనులో కలువక నిలవుంటుంటే - అవసరమ్మేర అక్కడి కాంక్రీటును కూడా పగల గొట్టి - దారి చూపిన వైనం. అక్కడ అసలు పని వీరుడికి సహాయంగా ఒకామె డిప్పనే కుర్చీగా అలంకరించీ, మరొకామె పారతో మట్టి నెత్తుతూ శ్రమించిన దృశ్యం!

2) ఏడెనిమిది మంది దివారం నాటి స్వచ్ఛ - సుందరీకరణకు మరింత మెరుగులు దిద్దుతూ – చీపుళ్లతో ఇంకా ఇంకా శుభ్రం చేస్తూ – ఏ వంకా పెట్టలేనంతగా బందరు వీధిని తీర్చిదిద్దడమూ,

3) మిగిలిన డజను మందీ వాసిరెడ్డి కష్టార్జిత ఉద్యాన సుందరీకృత వీధిలో గడ్డి తొలగించి, పిచ్చి మొక్కల పని బట్టి, ప్లాస్టిక్ తుక్కులేరి, సదరు ‘వన్ మాన్ ఆర్మీ’ కి శ్రమపూర్వక నివాళులర్పించుట,

మరి - ఇన్ని పనులు వాటేసుకొంటే – 6.00 కు పని ముగుస్తుందా? షరా మామూలుగానే 6.12 దాటింది! ఇక - అప్పుడు కాఫీలు ముగించి, DRK గారి ఆరోగ్య సూచనలూ, హెచ్చరికలూ విని, ఒక అజ్ఞాత దాత స్వచ్చోద్యమానికిచ్చిన 10 వేల విరాళం గురించి తెలుసుకొని,

కొర్రపాటి వీరసింహుని లయబద్ధ నినాదాలకు ప్రత్యుత్తరమిచ్చి,

రేపటి పారిశుద్ధ్య కృషి నిమిత్తం మళ్ళీ కొప్పుల - తూర్పు రామాలయం వద్దనే కలవాలని సంకల్పించి – తాత్కాలిక సెలవు తీసికొనిరి!

 

ఇంకెవడయ్య! స్వచ్ఛ సైనికుడు!

 

ఊరి శుభ్రత కోరి ఉద్యమించేవాడు

 చీపుళ్లతో వీధి చెత్తనూడ్చేవాడు

పారిశుద్ధ్యం చేసి పరవశించెడివాడు

మురుగు కాల్వలు ముందుకురికించు మొనగాడు

      ||ఎవడయ్య ఎవడు వాడు- ఇంకెవడయ్య! స్వచ్ఛసైనికుడు||

గ్రామ సామాజిక క్షేమాన్ని కాంక్షించి

 బ్రహ్మ కాలములోనె వల్లకాడుకు పోయి

పచ్చదనమును పెంచి పరవశించేవాడు

సౌకర్యములమర్చి సంతసించెడివాడు

                    || ఎవడయ్య! ఎవడు వాడు ||

కుల మతాలొదిలేసి, విలువల్ని పెంచేసి

ఐకమత్యంతోనే అడుగు ముందుకు వేసి

శ్రమదానముతో ఊరు చక్కదిద్దేవాడు

 వేల రోజుల పాటు విశ్రమించనివాడు

               || ఎవడయ్య! ఎవడు వాడు ||

తన స్థాయి మరచి - హోదాలు ప్రక్కన బెట్టి

పేడ- పెంటల నెత్తి - వీధుల్ని మురిపించి

మురిసి పోయేవాడు- మైమరచి పోయేవాడు

ఊరిమేలే తనదు మేలు అనుకొనువాడు

                 ||ఎవడయ్య! ఎవడు వాడు ||

"సొంతమేల్ తగ్గించి, పొరుగు మేల్ చూడు" అను

గురజాడ కవితలకు సరియైన వారసుడు

మన సమాజానికి నవమార్గ దర్శకుడు

అభినందనీయుడూ- అభివందనీయుడూ

      ||ఎవడయ్య- ఎవడువాడూ ఇంకెవడయ్య- స్వచ్ఛ సైనికుడు ||

విందు భోజనముల పసందుల్ని వదిలేసి

ప్లాస్టిక్కు గ్లాసుల్ని-ప్లేటుల్ని వెలివేసి

జాగ్రత్త పడువాడు- చైతన్యవంతుడూ

పర్యావరణముకై పాటుబడుతుంటాడు

||ఎవడయ్య! ఎవడువాడు- ఇంకెవడయ్య! స్వచ్ఛసైనికుడు ||

 

- నల్లూరి రామారావు

   సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   13.12.2023.