2968 వ రోజు ...... ....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా?

2 వీధులూ + 2 గంటలూ, 33 మంది సిబ్బందీ - @2968*

అది గురువారం (14.12.23) నాటి శ్రమదాన సంగతి క్లుప్తంగా! ఆ మాట కొస్తే పైపైన చూసే వాళ్లకు కాస్త అటూ ఇటూగా ఏ రోజైనా ఇలాగే కన్పించవచ్చు!

            ఊరంతటి స్వచ్ఛ - శుభ్ర - సౌందర్యాలు ఈ పూట బందరు రహదారి (NH 216) లాగా కంటి కింపుగా కనిపించే దాక - మొత్తం జనాభాకు శ్రమదాన స్ఫూర్తి వదలకుండా అంటుకొనే దాక స్వచ్ఛ సైనికుల పరిశ్రమ ఆగకపోవచ్చు! సదరు శుభ ముహుర్తమెప్పుడనేదే సమాధానం దొరకని కోటి రూకల ప్రశ్న!

            అప్పటి దాక ఈ 30-40-50 మంది నిష్క్రియగా కూర్చోక - ఇలా ట్రక్కులో పనిముట్లు నింపుకొని, కళ్లలో ఆశల్ని పులుముకొని, తమకు తోడుగా ప్రేరణదాయకమైన పాటల మైకును ప్రక్కనుంచుకొని, ఈ గ్రామ వీధుల మురికినీ, ప్రజల చైతన్య రాహిత్యాన్నీ వదిలించే పని మానరు!

            “ఇంకా కొందరు గ్రామస్తుల్లో చైతన్య రాహిత్యమూ, కార్యకర్తల సామాజిక శ్రమ శౌర్యమా ఏది అంతిమ విజేత?” అనేది తేలాలంటే భవిష్యత్కాలమనే యవనిక మీద ఓపికగా చూడవలసిందే!

            2968* వ వేకువ గణనీయ సంఖ్యలో కార్యకర్తలు ఉభయ వీధుల్లో జరిపిన కృషి ఏదో చూద్దాం!

1) నిన్న దంత వైద్యశాల ఎదుట వాన నీటి కొక కాలువ త్రవ్వినట్లే ఈ పూట కూడ, రాయపాటి వారి ఇంటి ఎదుట కూడ ఆ పనే జరిగింది. మొక్కల రమణుని నర్సరీ ఎదుట ఇసుక మిగిలిపోతే బండెడు ఇసుకనూ అతడొక్కడే వీధి రెండో ప్రక్కన ఖాళీ స్తలంలో గుట్టపోయడమొక పని!

2) రహదారి ఉత్తరాన ఎగుడు దిగుడు స్తలాన్ని చదును చేయుట మరొక

3) ఎక్కువ మంది శ్రమకు గురైనది భారతలక్ష్మి వడ్లమర వీధే! ఒకప్పుడు పరమ నికృష్టంగా – ‘నిప్పులకొలిమిలా ఉన్న వీధి మీద వాసిరెడ్డి వాని చూపు పడిన లగాయతు దాని రూపురేకలే మారిపోయినవి! ఈ వేకువ కూడా అక్కడొక అర ట్రక్కు వ్యర్ధాల సేకరణ జరిగింది!

4) బత్తుల వారి రామాలయం ఎదుట ఇద్దరు మహిళల ప్రయత్నమూ తక్కువేం కాదు! దేసు మాధురి ముమ్మారు స్పష్ట పరిచిన గ్రామ స్వచ్చ సుందరోద్యమ నినాదాలూ, అంతకుముందు వీరాధి వీరసింహుడు పంచిన పురుగు మందు లెరుగని అరటి నారింజ ఫలాలూ, మరొకరి జామ పళ్ళూ, DRK గారి సముచిత సమీక్షా వచనాలూ ముగిసేందుకు 6.40 వరకూ పట్టెను!

            అనుకోకుండా షణ్ముఖ శ్రీనివాసుని  మార్మిక విరాళం 500 నా వద్దకు చేరినది.

            రేపటి వేకువ కలువదగిన చోటు సైతం తూర్పు రామాలయ ప్రదేశమేనని నిర్ణయింపబడెను!

 

     చాలును ఈ సాక్ష్య ములు

ఆహ్లాదపు నవ్వురువ్వు ఆ పువ్వుల వనాలు,

పరిశుభ్రత ప్రలాపించు పలు వీధుల రీతులు

కొన్నిగుంటలైన పూడి మన్నుతున్న రహదారులు,

స్వచ్ఛోద్యమ విజయాలకు చాలును ఈ సాక్ష్య ములు!

- నల్లూరి రామారావు

   సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

 

   14.12.2023.