2969 వ రోజు ...... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా?

స్వచ్ఛ సుందరోద్యమంలో మరొక విజయవంతమైన సందర్భం - @2969*

            డిసెంబరు నెల శుక్రవారం వేకువ 4:16 కే ప్రారంభమైన 29 మంది 2 వీధులలోని కృషి 6.10 కి గాని ముగియలేదు. ఇందులో ఎక్కువ మందిదీ మరొక మారు భారత లక్ష్మి వడ్లమర రోడ్డుకే అంకితం. నీకూ నాకు కనిపించని స్వచ్ఛ సుందర లోపాలేవో ఈ కార్యకర్తల్లో కొందరికి ఇట్టే తెలిసిపోతాయి కాబోలు! అందుకనే ఈ వీధిలో కార్యకర్తల మెరుగుదల ప్రయత్నం ఇది మూడవ నాడు ఇక్కడనే రెండు డజన్ల మంది శ్రమ త్యాగం.

            వడ్లమిల్లు పడమర భాగమైతే మరి 2 చోట్ల ఎంత నున్నగా, తేటగా కనిపించిందంటే ఇప్పటికిప్పుడు అక్కడ ఏ బంతి చామంతి పూల మొక్కలో నాటేయవచ్చు. మొన్న చేసిన చోటనే మరికొన్ని కొబ్బరి డిప్పలు పడి ఉంటే వేరెవరికైనా కోపమో, చిరాకో కలిగేవి కానీ వీళ్ళు స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు కదా! ఇలా ఎన్ని సార్లైనా శుభ్రపరుస్తూనే ఉంటారు.

            నిన్న మరికొన్ని పూల చెట్ల కొమ్మలు కరెంటు తీగల దాక పెరిగినవి మిగిలిపోతే వాటి జుట్లు ఇద్దరు కత్తిరించారు. క్రొత్తగా పడిన గాజు, ప్లాస్టిక్ సీసాలను ఒకాయన అతి కష్టం మీద వంగి గాజు,ప్లాస్టిక్ సీసాలను ఏరుతున్నారు.

            ఇక బందరు వీధిలో గుడి ఎదుట మెకానిక్ షెడ్డు దగ్గర నలుగురు మహిళలు చేసిన క్షుణ్ణమైన పరిశుభ్ర- సుందరీకరణను ఎలా వర్ణించాలి? వీరిలో ఒకామె కాలు నిలబడి, పని చేయనీయనంతగా దెబ్బతిని వున్నా సరే ఆమె వేకువ 4 గంటలకే  చేరి రెండున్నర గంటల పాటు కూర్చొని పని చేస్తూనే ఉన్నది. మరొక విశ్రాంత ఉపాధ్యాయిని చీపురుతో రోడ్డు ఊడుస్తూనే గడుపగా మాజీ వార్డు సభ్యురాలు వంగి పారతో పనిచేస్తున్న సన్నివేశం.

మన స్వచ్ఛ చల్లపల్లి శ్రమదానోద్యమం లో  రాబోవు నెల రోజులలో  మూడు ముఖ్య ఘట్టాలున్నవి

1.  ఈ డిసెంబరు 19 తో ముగుస్తున్న గంగులవారిపాలెం రోడ్డు శ్రమదాన దశాబ్దం

2. ఈ 28 వ తేదీ రామోజీ ఫిల్మ్ సిటీ కి పర్యాటక యాత్ర

3. జనవరిలో చేరుకోనున్న మూడు వేల రోజుల మైలురాయి

            వీటన్నిటినీ చల్లపల్లి శ్రమదాన చరిత్రలో కొన్ని ప్రముఖ ఘట్టాలుగా గుర్తించుకోవచ్చు.

            6.30 తరువాత జరిగిన  సమీక్షా సమావేశంలో ఉద్యమ నినాదాలను మూడు మార్లు ప్రస్తావించిన వారు విజయ రమా టీచరు గారు.

            మన రేపటి వేకువ శ్రమదాన రంగస్థలం బందరు వీధిలోని రామాలయం ఎదుటనే..

- నల్లూరి రామారావు

సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

15.12.2023.