2970 వ రోజు ...... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెన్నాళ్ళు?

నిరాటంకంగా @2970* రోజుల శ్రమదానమంటే మాటలా?  

            శనివారం (16.12.2023) సైతం తూర్పు వీధి రామాలయం వద్ద ఆగిన కార్యకర్తలు 4:16 - 6.13 నడుమ సాగించిన వీధి పారిశుద్ధ్యం తూర్పున రాయపాటి వారి గృహ సముదాయం మొదలు చంటి హోటల్ దాక వెళ్లి ఆగింది. ఐతే, 31+2 (ఈ ఇద్దరూ ప్రముఖ వైద్యులు లెండి – స్థానిక వి. రాజ్యలక్ష్మి గారు, అమెరికా తూర్పు రాష్ట్రం కెంటకీకి చెందిన సురేష్ గారు) మంది ఒకే సమూహంగా కాక 3 గా విడివడి నలుగురు సుందరీకర్తలు తూర్పు వైపునా, మరో నలుగురు గుడి ఎదుటి ఖాళీ చోటులో, ఇక మిగిలిన వారు రెండు బారులుగా – రహదారికి దక్షిణ, ఉత్తర దిశలలో చేసిన పనులు ఇవ్విధంగా నుండెను,

            ఈ సుందరీకర్తల సంగతేమంటే వాళ్ళకు దేన్ని చూసినా (ఆఖరికి మొన్న వాళ్ళే సుందరీకరించినదైనా -)  ఏదో లోపం కనిపిస్తూనే ఉంటుంది. అది చెట్టు కావచ్చు, పేవర్ టైల్స్ కావచ్చు ఇక వాటిని పునః నవీకరించక మానరు. అందులో ఒకాయన దగ్గరున్న కత్తెరకు పని చెప్పి పొగడ చెట్టు కొమ్మల్ని గొరిగేశాడు. (ఇది సరే ఒక సీనియర్ డాక్టరమ్మ ట్రాక్టర్ తెప్పించి పైకెక్కి చెట్టు కొమ్మల్ని సుందరీకరించడమే విశేషం!)

            ఒక మాజీ వార్డు సభ్యురాలు ఇంకొక షాబుల్ వీధి నివాసితురాలు మరో ఇద్దరితో కలిసి తీసేసిన ఇళ్ళ వద్ద పెరిగిన గడ్డిని పారలతో చెక్కుతున్నారు.

            ఇక పోతే అసలు సిసలు శ్రమదానం జరిగిన అరకిలో మీటరు వీధి సంగతి చూద్దాం. 20 మందిలో ఎక్కువగా చీపుళ్ళతోనూ కొద్దిమంది కత్తుల, దంతెలతోనూ వీధి కాలుష్యాన్ని వేటాడిన వైనం.

1.     మేదర సోదర గృహాల వద్ద పేరుకున్న + ఇసుక + దుమ్మును, ఎందుకో ఎవరో వదలిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్ధాలను సిగరెట్ పెట్టెలు, పీకలని ఊడ్చుకుంటూ, ఏరుకుంటూ సాగిన ప్రస్థానం పది మందిది.

2.      రహదారికి దక్షిణాన సిమెంటు కొట్ల, కూర అంగళ్ళ, టిఫిన్ సెంటర్ల్ ఎదుట నార గొనె సంచులు, సిమెంటు దుమ్ము, ఖాళీ మందు బిళ్ళల పెట్టెలు ఎన్ని పడుంటే అన్నిటినీ ఊడ్చుకుంటూ, ఏరుకుంటూనూ ఇంకో 10 మంది చంటి హోటల్ దాక వెనుతిరిగి చూడలేదు.   

3.     డా.డి.ఆర్.కె. కేమో అమెరికా అతిధి వైద్యుని ఊరంతా త్రిప్పి స్వచ్ఛ సుందర దృశ్యాలను చూపించడమే సరిపోయింది.

            ఇంతలో పని విరమణ ఈల మ్రోగనే మ్రోగింది. మరొక ఐదారు నిముషాల్లో కాఫీ సరదాలూ – కబుర్లు ముగిశాక చెరువు గట్టున సమీక్షా సమావేశం మొదలై ముందుగా పల్నాటి అన్నపూర్ణ వెరైటీగా స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలను ప్రకటించగా, ఒక అజ్ఞాత వ్యక్తి నా చేతుల మీదుగా సమర్పించిన విరాళాన్ని మేనేజింగ్ ట్రస్టీ గారందనుకొనగా,     

            డి.ఆర్.కె. ప్రసాదాదుల సంతోషం మిన్ను ముట్టుతుండగా, అమెరికా వైద్యుని మాటల్లో ఆనందాశ్చర్యాలు తొణికిసలాడగా నందేటి శ్రీనివాసుడు రెండు పాటల కోసం గళం విప్పగా, 6.40 కి నేటి శ్రమదానమనబడే సంగతి ముగిసింది.

            రేపటి వీధి కష్టం నిమిత్తం ముందుగా అనుకొన్నట్లు చంటి హోటల్ వద్ద కాక  C.I గారి అభ్యర్ధన మేరకు వారి ఆఫీసు (సంత వీధి) వద్ద కలుసుకొందాం!

            బుధవారం నాడు మాత్రం పది సంవత్సరాల “మన వీధి పండుగ” కోసం గంగులవారిపాలెం రోడ్డు “గస్తీ గది” వద్దనే మన కార్యక్రమం ఉండగలదు.

 

            మనిషి బ్రతుకులో దశాబ్ది

దేశ చరితలో పదేళ్ళు పెద్ద సంఖ్య కాకున్నా

మనిషి బ్రతుకులో దశాబ్ది మాత్రం పెద్దదే గదా!

ఊరి మేలుకై శ్రమించు ఉద్యమ కారుల సంగతి

గ్రామ – రాష్ట్ర చరిత్రలో కాకపోదు ప్రముఖం!     

- నల్లూరి రామారావు

సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

16.12.2023.

ఒక అజ్ఞాత వ్యక్తి సమర్పించిన విరాళం