2971 వ రోజు ..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెన్నాళ్ళు?

సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయ శుభ్ర సుందరీకరణం @ 2971*

ఈ ఆదివారం (17-12-23) నాటి వేకువ 4.19 - 6.48  నడిమి శ్రమదానం  చాల రోజులు  గుర్తుండిపోతుంది. 39 మంది మంది  స్వచ్ఛ కార్యకర్తల, పది- పన్నెండు గురు పోలీసుల ఉమ్మడి కష్టంతో సుమారు 10 సెంట్ల  ఆవరణ 90 శాతానికి పైగా కాలుష్యం నుండి విముక్తి పొందింది! ఈ నెలలో శ్రమదాతల బలం 50 ని మించడం ఈ పూటనే!

          అసలీ శ్రమదాన కార్యక్రమంలో వింతేమంటే-చిన్నపాటి మార్పుల్తో ప్రతి వేకువా వాడేది చీపుళ్లే,  ప్రయోగించేది కత్తులూ, -- దంతెలూ - గోకుడు పారలూ, డిప్పలే, కాని దగ్గరగా ఉండి చూస్తే మాత్రం ఏ పూటకాపూట శ్రమ వీరుల్లో సృజన శీలం – నూతనోత్సాహం- క్రితం రోజును మించిన సంతోషం!  బహుశా ప్రతిఫల మాసించరు కనుకనే ఈ ఉద్యమకారుల్లో ఇది సాధ్యపడుతుందేమో!

          రెండు బలీయ శక్తుల కలయికతో ఏ నూతనోత్సాహం వెలువడుతుంది, ఏ శుభ సంకేతమిస్తుందో ఈ 2 గంటల కాలంలో గమనించాను. ఊరి స్వఛ్ఛ- సుందరోద్యమంలో రాటుదేలిన  స్వచ్ఛ కార్యకర్తలూ + శరీర దార్డ్యం, చురుకుదనం కల రక్షక భటులూ కలిసి చేసిన ప్రయత్నం వివరిస్తాను:

           ఆవరణంతా శుభ్రంగానే ఉండేదేమోగాని భారీ వర్షాలకు గడ్డీ- పిచ్చి కలుపూ, తీగలూ, తుఫానుకు  రాలిపడిన ఆకులూ, కొమ్మ  రెమ్మలూ కలగలిసి, అలుముకుపోయి, కార్యకర్తల సహనాన్ని పరీక్షించాయి! ముఖ్యం గా పొట్ల- బీర చెట్ల పందిరి క్రింద వంగొని, తడి మన్నులో కూర్చొనీ చేసిన పనులు!

           40-50 మంది పూనుకొని పని చేస్తుంటే  - వీధైనా, కార్యాలయ ఆవరణై నా చూడ ముచ్చటగా  మారక తప్పుతుందా?  పనుల ఉద్రిక్తతో మహిళల చీరలకు బురద అంటుకొన్నా,  చలిలో కూడ కొందరు పురుష పుంగవులకు చెమటలు పట్టినా, ఇద్దరు మోకాళ్ల మీద కూర్చొని గడ్డీ చెక్కినా- పని ఆగలేదు!

          6.00 దాటాకనే జరిగిన చెత్త లోడింగును చూసి తీరాలి! 15 మంది కొమ్మల్ని చెలిగి, దూరంగా మోసి, డిప్పల్తో ట్రాక్టర్ దగ్గరకు చేర్చి, ఇద్దరు వాహనమ్మీ ద నుండి  త్రొక్కి 2 ట్రక్కుల వ్యర్ధాన్ని ఒక్కదాన్లోనే సర్దిన దృశ్యం శ్రమ సౌందర్య చిహ్నం.

          6.40 సమయంలో పోలీస్ ఉన్నతాధికారి Ch. నాగ ప్రసాద్ గారి నినాదాలు,  దేశంలో ఎక్కడా లేని శ్రమదానం ప్రత్యక్షంగా చూసి, పాల్గొన్న  ఆనందాశ్చర్యాలూ, కోడూరు వేంకటేశ్వరు ని 520 /- విరాళమూ, పోలీసు రక్షణ మీద  శేషు ఆలపించిన పాటా – తదుపరి  అందరూ కలిసి  భోగాది వాసు కు పరామర్శా , ఇళ్లకు చేరేటప్పటికి  7.30  సమయమై ఉంటుంది!

గంగులవారిపాలెం వీధిలో దశాబ్ది శ్రమదాన  పండుగ కోసం మనం బుధవారం వేకువ గస్తీ గది దగ్గర  కలుద్దాం.

              నేల విడిచి సామెందుకు

నేల విడిచి సామెందుకు - గాలిలోన మేడెందుకు

అమాంతముగ  సమాజాన్ని ఉద్ధరించు కబుర్లేల ?

మూడు వేల రోజులుగా మొండిగా సొంతూరి కొరకు

శ్రమిస్తున్న వారి తోటి చేయి కలప వచ్చును గద?

- నల్లూరి రామారావు

   సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   17.12.2023.