2973 వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

2973* వ నాటి 6+4 మంది శ్రమానందం!

            మంగళవారం వేకువ కూడ పని స్తలం మారలేదు గాని – అదే గంగులవారిపాలెం వీధిలోనే గాని - పనితత్త్వం మారింది. నిన్నటిది దారు శిల్పకళాత్మకమైతే - నేటి కృషి వీధి పరిశుభ్రత!

            అందుకు పూనుకొన్న అసలు రెస్క్యూ మనుషులు 6 గురైతే - బేషరతు మద్దతుదారులు నలుగురం! కొసరు పనులు కాక - ప్రధాన కృషి నర్సరీ రమణుని ఇంటి దక్షిణపు సందులోనే! సందు చిన్నదే గాని, ముంపు వానల వల్ల రెండు ప్రక్కలా – నెల తిరక్కుండానే పెరిగిన గడ్డీ, ప్రత్తీ – దోమల మొక్కలూ - ఇతర పిచ్చి చెట్లూ తక్కువేం కావు!

            ముదరక ముందే వాటి పని బట్టాలనే – 4:20 & 6:10 నడుమ వీధి భద్రతా దళ సభ్యులు పూనుకొన్నది. గ్రామ పౌరులుగా తామనుకొన్న బాధ్యతను వాళ్లు నెరవేర్చారు!

            వ్యర్ధాల లోడింగంతా ఈపూట ఒంటరిగా ఒకాయనే పూర్తి చేశాడు. ఆ వేంకటరమణుడే నిన్నా – ఈ పూటా కార్యకర్తలకు కమ్మని కాఫీ ప్రదాత!

            ఇక్కడి పనులు ముగిసిన పిదప ‘గస్తీ గది’ దగ్గరకు వెళ్లి, మాలెంపాటి డాక్టరు గారి మార్గదర్శకత్వంలో 10 మందీ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు వల్లించారు. ఈ వీధి స్వచ్ఛ – శుభ్ర - సౌందర్య పరిరక్షణా హెచ్చరికల బోర్డు నెక్కడ - ఎలా అమర్చాలో నిర్ణయించారు!

            రేపటి అతి ముఖ్యమైన గంగులవారిపాలెం “వీధి పండుగ” కోసం బుధవారం వేకువనే మనం కలువదగినచోటు గస్తీ గది వద్దనే! అధిక సంఖ్యలో స్వచ్ఛ కార్యకర్తలూ, శాయినగర్ – భవఘ్ని నగర్ నివాసులూ తప్పక కలిసి నిర్వహించుకోవలసిన వేడుక మరి!

 

            చల్లపల్లిలో కాక ఎక్కడ

పరువు తక్కువగా తలంచక పారిశుద్ధ్యం పనులు చేయుట

కుంటి సాకులు చెప్పకుండా గోముగా శ్రమదాన మిచ్చుట

చంటి బిడ్డను పొదివి నట్లే చల్లపల్లిని సాకుచుండుట

చల్లపల్లిలో కాక ఎక్కడ జరుగుతున్నవొ చెప్ప మంటా!

- ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

  19.12.2023