2974 వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

గంగులవారిపాలెం వీధి పండుగ - @2974*

            ఔను బుధవారం 20.12.23 నాటి వేకువ 4.15 కు గస్తీగది వద్ద మొదలైనది వట్టి శ్రమదానమే కాదు గ్రామ పాలకులు, అధికారులు, స్వచ్ఛ కార్యకర్తలు ముఖ్యంగా గంగులవారిపాలెం వీధి నివాసులు - మొత్తం 85 మంది పాల్గొని, 6.55 దాక 2 ½ గంటలకు పైగా - చేసిన కొందరి శ్రమా, వెలిబుచ్చుకొన్న ఆత్మీయతలూ, త్రవ్వి బైటకు తీసుకొన్న పదేళ్ల నాటి రోడ్డు దుస్థితులూ.. ఇదంతా పండుగ వాతావరణం కాక మరేమిటి?

            ఎక్కడైనా ఏ గృహ ప్రవేశాలో - పెళ్లి వేడుకలో తప్ప రాత్రి వేళల్లో ఇందరు ఇంత చలిలో - ఏదో ఒక ఊరి వీధిని గురించి మాట్లాడుకొనేందుకు సమావేశాలు జరపడం స్వచ్ఛ చల్లపల్లిలో మాత్రమే జరిగే సంఘటన!

            వచ్చింది వీధి పండుగకే గాని శ్రమదాన వ్యసనపరులైన 40 మంది కార్యకర్తలు మాత్రం చీపుళ్లతో కళాశాల గేటు దాక ఊడ్చీ, 6 వ నంబరు కాల్వ గట్టులు శుభ్రపరచి, కాలేజి గోడెక్కి కొన్ని చెట్లను సుందరీకరించీ, శుభ్రంగానే ఉన్నా గస్తీ గది రోడ్డునూ మళ్లీ శుభ్రపరచీ, తమ నైజాన్ని చాటుకొన్నారు!!

            తాతినేని రమణ పర్యవేక్షణలో ఇదే రోడ్డులో ఇటీవల నరికిన ఏడాకుల మ్రానులకు 17 పూల తీగల్ని అల్లించడం కూడా జరిగింది.

            గతం మాట వదిలేస్తే - ప్రస్తుతం ఈ ఆస్పత్రి రోడ్డు సెల్ఫీ వాళ్ళతో, వీడియో గ్రాఫర్లతో, మార్నింగ్ వాకర్స్ తో, ఇతర సందర్శకులతో రద్దీగా మారిపోయింది. నాలుగైదేళ్లుగా ఇక్కడ పచ్చదనం రెచ్చిపోతూ, ముద్దబంతులు మురిపిస్తూ, విరగబూసి మిడిసిపడుతున్న చామంతులు గాలికి సుగంధాల చందాలిస్తూ, “ఏ ఊళ్లో వీధులైనా ఇలా ఉండాలిఅని సందేశమిస్తూనే ఉన్నది. ఈ వేకువైతే 85 మంది స్వచ్ఛ - శుభ్ర - సౌందర్యారాధకులతో దాని వైభవం సార్థకమయింది!

            ఈ బజారు పూర్వాపరాల చరిత్రను డాక్టర్ DRK మాటల్లో వినాలంటే - వాట్సప్ వీడియోలో లభిస్తుంది! దీని సుందరీకరణం వెనక ఎందరి భగీరథ ప్రయత్నముందో గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి మాధవేంద్రరావుల మాటల్నీ వినవచ్చు! వీధి సందర్శకులకు - వినియోగదారులకు హెచ్చరిక/విజ్ఞాపన బోర్డు గస్తీ గది దగ్గరలో ఆవిష్కృతమయింది!

            నందేటి శ్రీను పాటలు వింటున్నప్పుడూ - శ్రోతలు ఆనందిస్తున్నప్పుడూ – “ఇతని పాటల్లేకపోతే చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమం చప్పగా ఉండేదేమోఅనిపించింది! మరి స్వచ్ఛ కార్యకర్తల శ్రమదానం లేకపోతే....?” అని మాత్రం ఆలోచించవద్దు కొందరి జీవితాలంతే వాటి దుంప తెగ - ఇలా దశాబ్దాల తరబడీ సమాజానికంకితమైపోతాయి!

            మొత్తానికి ఇవాళ్టిదొక స్వచ్ఛ - సుందరానుభూతి! ఈ అనుభూతి ఊళ్లో అన్ని వీధులను క్రమ్ముకోవాలి, అన్ని ఊళ్లనూ ముంచెత్తాలి...ఆమెన్!

            పాటతో బాటు నినాదాల్నీ గాయకుడే పలకగా, రేపటి వేకువ మనం శుభ్రపరచవలసింది సంత వీధిలోని సర్కిలిన్స్పెక్టర్ కార్యాలయమనే ప్రకటన వెలువడగా..... నేటి చిర సంస్మరణీయ కార్యక్రమ పరిసమాప్తి!

            నా సుందర చల్లపల్లి

సంచలనము - సంతులనము స్వచ్చోద్యమ చల్లపల్లి

సుసమగ్రమొ సుచిత్రమో - హరిత భరిత చల్లపల్లి

శ్రమ సుందర ప్రమదావని - స్వచ్ఛ మాన్య చల్లపల్లి

నవ వసంత శ్రమ వితర్ది నా సుందర చల్లపల్లి!

- ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

  20.12.2023