2975 వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

ఐచ్ఛిక శ్రమదానం 2975* కు చేరుకొన్న వేళ!

            అనగా - గురువారం (21-12-23) మన్నమాట! 4:15 AM నుండి 6:12 దాక తొలిగా డజను మందీ, క్రమంగా మరో 20 మందీ పోలీసు క్వార్టర్స్ లో చేసిన కష్టం సద్యః ఫలితాన్నిచ్చింది ! సివిల్ డ్రస్ లో ఉన్న నలుగురు రక్షక భటుల శ్రమ బాగా కలిసొచ్చింది!

            రక్షక భట నివాసావరణలో - ముఖ్యంగా రైతు బజారు వైపున - 15 సెంట్ల ఖాళీ స్తలం ఉండవలసినంత శుభ్రంగా కాక - ఉండదగనంత అక్రమంగా ఉండెను. ఎన్నో తుప్పు పటిపోతున్న చిన్నా పెద్ద వాహనాలు, అందులో కొన్నిటిని పూర్తిగా మరుగుపరుస్తూ పెరిగిన మొక్కలూ, తీగలూ, వాటికి తోడు ప్రాత ఇసుప - ప్లాస్టిక్ వ్యర్థాలూ!

            50 పని గంటల పిదప చూస్తే - వంద శాతం స్వచ్ఛ శుభ్ర - సుందరంగా కాదు గాని, ఆ ప్రదేశం నిన్నటికన్న భిన్నంగా కనిపించింది. ఇంకోమారు - ఇంకో 10-15 పని గంటలు శ్రమించి, క్రమపద్ధతిలో 40-50 చెట్లనూ, పూల మొక్కల్నీ నాటి పెంచితే 40 కి పైగా ఉన్న ఇళ్లవారికెంత ఆహ్లాదదాయకంగా ఉంటుందో గదా!

            ఇది కాక రైతు బజారు వీధిలో 10 మంది చేసిన కృషి కూడ అక్కరకొచ్చింది. డ్రైను ప్రక్కనా, ట్రాన్స్ఫార్మర్ దగ్గరా ఏపుగా పెరిగిన గడ్డీ, పిచ్చి మొక్కలూ ఇప్పుడు మిగల్లేదు. చీపుళ్ల ఊడ్పుల్లో దుమ్మూ - ఇసుకా తొలగి రోడ్డు కాస్త బాగుపడింది.

            3 వేల రోజులకు దగ్గర పడుతున్న ఈ గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమంలో ఏ నాటి శ్రమైనా థ్రిల్లింగ్ గానే ఉంటుంది గాని, క్రొత్తగానే అనిపిస్తుంది గాని, ఈ వేకువ గజగజ వణికిస్తున్న చలీ - మంచులో కొన్ని ప్రముఖ శ్రమ ఘట్టాల్ని ప్రస్తావిస్తాను అవేమనగా:

- ఎగుడు దిగుడు చోట్ల - కాలు సరిగా లేని ఒకరిద్దరూ, షష్ట్యబ్ద వయోధికులూ కత్తులూ, చిన్న పంజాలు వాడి, ప్లాస్టిక్ తుక్కులేరిన సంగతీ,

- 2 బళ్ల వ్యర్ధాల్ని చాకచక్యంగా ట్రక్కులోనే త్రొక్కి, సర్దిన లోడింగ్ నైపుణ్యమూ

- దిక్కుమాలిన చెత్త పనుల్లో కూడ సంతోషం వెదుక్కొనే కార్యకర్తల వైఖరీ.....

            6.30 కు సమీక్షా సమావేశంలో కార్యకర్తల మెప్పు పొందిన ఒక కానిస్టేబుల్ - రమేష్ గారి శ్రమదానోద్యమ నినాదాలూ,

            అంతిమంగా రేపటి వేకువ మన శ్రమ వేడుక వేదిక బందరు రోడ్డులోని చంటి హోటల్ వద్దననే నిర్ణయమూ,

            తరు రక్షణ క్రమ శిక్షణ

విరిపందిరి శ్రమ బంధుర సుమసుందర చల్లపల్లి

తరు రక్షణ క్రమ శిక్షణ పురిగొలిపే చల్లపల్లి

రహదారుల విరి తోటల తహతహగా చల్లపల్లి

సుమనోహర ప్రమదావని స్వచ్చోత్తమ చల్లపల్లి!

- ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

  21.12.2023