2987 వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

2987* వ వేకువ కూడ RTC సంస్థ ప్రాంగణమే!

            మంగళవారం (2/1/24) వేకువ కూడా ఊరి శుభ్ర సుందరీకరణకు తొలి అడుగులేసింది డజను మంది. మిగిలిన 15 గురూ అంచెలంచెలుగా 4:15 తరువాత చేరుకొని, యధాశక్తిగా తమ సేవలా - సువిశాల ప్రాంగణానికి సమర్పించుకొన్నవిధం బెట్టిదనిన :

1.     27 మంది శ్రామికులు 4:15 మొదలు 6:40 దాక 2 గంటల 20 నిముషాల పాటు అచ్చటనే గడిపిరి.

2.     పని స్తలంలో చెప్పుకోదగ్గ మార్పేమీ లేదు. సైకిల్ స్టాండు పడమటి గార్డెనూ, వాహన ప్రవేశ మార్గమూ, మూత్రశాల

పరిసరాలూ, బస్సులు నిలుచుచోటూ..

3.     పాత-క్రొత్త మూత్రశాలల నడుమ పెరిగిన బోగన్ విలియా ముళ్ళ చెట్ల కొమ్మల్ని కత్తిరించుట, నేల శుభ్రపరచుపనే నెమ్మదిగా జరిగెను.

4.     అరడజను మంది అచ్చంగా ఇన్ గేటు ప్రక్కనే పాటుబడితే గాని, బాగా ఎండి గట్టిపడిన మురుగు మట్టి దిబ్బను త్రవ్వడమూ, ట్రక్కులో నింపడమూ ముగియలేదు!

            అచ్చటనే భరించలేని కంపు గొడుతున్న - తెరచిన మురుగుమేన్ హల్ ను సంస్కరించడమూ , చుట్టూ చదును చేసి, పలక రాళ్లతో దానిని కప్పేయడమూ ఈ 6 గురే నిర్వర్తించిరి.

5.     దానికి ముందు ప్రవేశ మార్గానికి తూర్పు ప్రక్కన మూత్రవిసర్జనలతో చిత్తడిగా మిగిలిన చోటును ప్లాస్టిక్ రహితంగా చేసిన కర్మిష్టులూ వీళ్లే ! ఇసుకా, మన్నూ పోసి, కొంత వాసన తగ్గించడమూ వాళ్ల పనే!

6.     క్రమేణా మూత్రశాలల వాడకం తగ్గి, దాని ఎదుట మొలిచిన గడ్డీ, పిచ్చి మొక్కల్నీ, వాటి ప్రక్క పెరిగి, వాహనాల్ని అడ్డుకొంటున్న చెట్ల కొమ్మల్నీ తొలగించిన కార్యకర్తలది మరొక బృందం!

            తమ స్వార్థ రహిత శ్రమలో పాతిక మంది రకరకాల బాధ్యతల్ని నెరవేరుస్తుంటే - 2 గంటల కాలమూ చూస్తుండగానే కర్పూరంలా కరిగిపోయింది! తీరా చూస్తే బస్టాండు, తూర్పు భాగం పని మిగిలేపోయింది!

            6:30 కు ఒక బస్ సిబ్బందికి కార్యకర్తల కాఫీ మర్యాద కూడ దక్కింది!

            అప్పుడు జరిగిన సమీక్షా సభలో స్వచ్చోద్యమ ఫలితంగా కన్నుల పండుగగా ఉన్న ఊరి వీధుల్ని Dr. DRK ప్రస్తావించగా గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య నినాదాలను BSNL నరసింహారావు విన్పించగా రేపే కాక, ఇంకొన్ని నాళ్ళు సైతం తమ శ్రమను ఈ బస్ స్టేషన్ కే సమర్పించాలనే నిర్ణయంతో నేటి శ్రమదానం ముగిసెను!

            అందరికీ సాధ్యపడదు!

అపహాస్యములెదురౌతవి, అవహేళన వినిపిస్తది

సహకారము తరుగౌతది, స్వార్ధము బుసకొడుతుంటది!

ప్రశాంతముగ ఊరి కొరకు దశాబ్దముగ అంకితులై

అనుకొన్నవి సాధించుట అందరికీ సాధ్యపడదు!

- ఒక స్వచ్ఛ సుందర కార్యకర్త

  02.01.2024